
ఐటీడీఏ...4 జిల్లాల్లోకి..!
రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత కూడా భద్రాచలం అతి పెద్ద ఐటీడీఏగా గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 29 మండలాలు, తెలంగాణ రాష్ట్రంలో 24 మండలాలున్న ఐటీడీఏ... జిల్లాల పునర్విభజన కారణంగా నాలుగు ముక్కలవుతోంది. భద్రాద్రి జిల్లాలో 19 మండలాలు, భూపాలపల్లిలో 2, మహబూబాబాద్‌లో 3, ఖమ్మం జిల్లాలో 3 మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలోకి రానున్నారుు. కామేపల్లిని కొత్తగూడెంలో ఉంచుతారా... ఖమ్మంలో కలుపుతారా వేచి చూడాల్సిందే.
భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత ప్రజానీకం అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో 1975 మార్చి 3వ తేదీన ఖమ్మం కేంద్రంగా ఐటీడీఏ తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని 1979 డిసెంబర్ 17న పాల్వంచకు తరలించారు. అక్కడ నుంచి 1993 ఫిబ్రవరి 9న భద్రాచలంనకు మార్చారు. భద్రాచలంలో మొదట్లో ఐటీడీఏ కార్యాలయూన్ని చర్ల రోడ్డులోని ప్రస్తుతం గిరిజన బీఈడీ కళాశాల నిర్వహిస్తున్న భవనాల్లో నిర్వహించారు. కొద్ది కాలానికి ఐటీడీఏకు ప్రత్యేకించి విశాలమైన భవనాలు నిర్మించారు. భద్రాచలం ఐటీడీఏకు ఉన్న అధునాతన భవనాలు, సువిశాలమైన స్థలం తెలంగాణ రాష్ట్రంలో కాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ ఐటీడీఏకు కూడా లేవు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇలా....
రాష్ట్ర విభజన జరగక ముందు జిల్లాలో 46 మండలాలకుగాను, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలోని 29 మండలాలు పూర్తిగా, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు కూడా ఐటీడీఏ పరిధిలోనే ఉండేవి. ఇందులో ట్రైబల్ సబ్‌ప్లాన్(టీఎస్‌పీ) పరిధిగా గుర్తించిన 19 మండలాలపై ఐటీడీఏ ద్వారా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ఉండేది. జిల్లా విస్తీర్ణం 16,029 స్క్వేర్ కిలోమీటర్లు కాగా, ఇందులో ఐటీడీఏ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతం 12,175 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. అంటే ఈ లెక్కన జిల్లా విస్తీర్ణంలో 76 శాతం ఏజెన్సీనే అన్నమాట. జిల్లాలో 4 డివిజన్లు ఉండగా, ఇందులో 3 డివిజన్‌లు ఏజె న్సీ పరిధిలోనివి. జిల్లా మొత్తం మీద 6.83 లక్షల మంది గిరిజన జనాభా ఉండగా, ఇందులో 5.61 మంది గిరిజనులు ఏజెన్సీ ప్రాంతవాసులే.
తెలంగాణ రాష్ట్రంలో
రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో ఉన్న ఐదు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి. ఈ కారణంగా భద్రాచలం ఐటీడీఏ పరిధి త గ్గింది. ప్రస్తుతం జిల్లాలో 41 మండలాలకు గాను ఐటీడీఏ పరిధిలో 24 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలో 904 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 571 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన జనాభాలో 1,90,304 మంది తగ్గిపోయారు.
కొత్తజిల్లాల ఏర్పాటుతో....
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఐటీడీఏ స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 41 మండలాల్లో కొత్తగా ఏర్పడబోయే భద్రాద్రి జిల్లాలో 19 మండలాలు ఉంటారుు. అరుుతే జూలూరుపాడు, బయ్యారం, గార్ల, కామేపల్లి, ఏన్కూరు ఏజెన్సీ మండలాలు ఖమ్మంలో ఉంటాయని, వీటి కోసమని అక్కడ కొత్తగా ఐటీడీఏ కార్యాలయూన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి జిల్లా నుంచి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అయితే తాజాగా కొత్త ప్రతిపాదనలు వచ్చి పడ్డాయి. గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే మహబూబాబాద్ జిల్లాలోకి, అదే విధంగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలోకి సర్దుబాటు చేసేందుకు తాజా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇదే జరిగితే భద్రాచలం ఐటీడీఏ పరిధి మరింతగా తగ్గిపోయే అవకాశముంది.