ఎందుకీ శిక్షణ?
- పదింతల అయోమయం
- సిలబస్ మార్చారు.. శిక్షణ మరిచారు!
- ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు లేవు
- ఒకరోజు వీడియో కాన్ఫరెన్స్‌తో సరిపెట్టిన విద్యాశాఖ
- విద్యార్థుల ఆందోళన
పదో తరగతి పాఠ్యాంశాలు ఈ విద్యా సంవత్సరం నుంచి మారాయి. తరగతులు ప్రారంభమై 85 రోజులు గడిచినా నేటికీ ఉపాధ్యాయులకు మారిన సిలబస్‌పై శిక్షణ ఇవ్వకుండా విద్యాశాఖ మౌనం వహిస్తోంది. కేవలం ఒక్కరోజు వీడియో కాన్పరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. సరైన శిక్షణ లేకుండానే ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది.
యలమంచిలి : జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద ఉన్నత పాఠశాలల్లో సుమారు 52 వేలకు పైగా పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం(ఎన్‌సీఎఫ్)-2005, వి ద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)-2009లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన రాష్ట్ర విద్యా ప్రణాళికా పరిధి పత్రం-2011 మేరకు పదో తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌తో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. పిల్లలు తమకున్న సహజ శక్తి సామర్థాల ద్వారా బడి బయట జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ పరస్పర ప్రతి చర్యలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాల విశ్లేషణ చేస్తూ పాఠ్యాంశాలను అవగాహన చేసుకునే విధంగా పాఠ్య పుస్తకాలను రూపొందించారు. దీనిపై ఇప్పుడు సరైన బోధన అవసరం కాగా, ఉపాధ్యాయులకు ఆ దిశగా శిక్షణ కరువైంది.
ఒక్కరోజు టెలికాన్ఫరెన్స్ శిక్షణతో సరా?
వేసవి సెలవుల్లోనే మారిన సిలబస్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖకు వినతులు అందినా రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల నిర్వహించలేదు. మారిన సిలబస్‌పై ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడికి కనీసం 15 నుంచి 20 రోజుల శిక్షణ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ 16 నుంచి 24 వరకు ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడి కీ ఓ రోజు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కొత్త సిలబస్ అమలులోకి వచ్చినపుడు బోధనాభ్యసన పద్ధతులపై జిల్లా, డివిజన్ స్థాయిల్లో పాఠ్యపుస్తక రచయితలతో, రిసోర్స్‌పర్సన్లతో వృత్యంతర శిక్షణ ఇప్పించాలి. గతంలో సిలబస్ మారిన సమయంలో ఇదే విధంగా చేశారు. ఈ సారి మాత్రం విద్యాశాఖ పట్టించుకోలేదు.
ఇలా అయితే విద్యాబోధన ఎలా?
నూతన పాఠ్యపుస్తకాలతో పాత విధానం (11 పేపర్ల పరీక్షా విధానం) అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల మాదిరి ప్రశ్నపత్రాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు అన్ని జిల్లాల డీఈవోల వెబ్‌సైట్లలో మోడల్ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంచారు. విద్యాబోధన మాత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుగుణంగా మారిన ప్రణాళికతో జరగాలని ఆదేశించారు.
విద్యార్థుల ఇబ్బందులు
కొత్త పాఠ్యాంశాల వల్ల పలు సబ్జెక్టుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవు. విద్యార్థులు స్వయంగా ప్రశ్నలకు జవాబులు కనుగొనాలి. దీని కోసం వారు దినపత్రికలు, గ్రంథాలయాలు, ఇంటర్‌నెట్ తదితరాల నుంచి సమాచారాన్ని సేకరించాలి. భౌతికశాస్త్రం పాఠాలు కఠినతరంగా ఉండటంతో పాటు ప్రయోగాలు చేయడానికి అవసరమైన సదుపాయాలు పాఠశాలల్లో లేవు. జీవశాస్త్రంలో ముద్రణా లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా కృత్యాధార పద్ధతిలో పాఠాలు బోధించాల్సి ఉంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పదో తరగతి విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్షించాల్సి ఉందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
శిక్షణ ఇస్తే మెరుగైన బోధన
మారిన సిలబస్‌పై ఉపాధ్యాయులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే శిక్షణ ఇచ్చి ఉంటే బాగుండేది. కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల లక్ష్యం మేరకు విద్యార్థులకు బోధన చేయలేకపోతున్నారు. కనీసం కరదీపికలైనా అందజేస్తే బాగుంటుంది. గణితం, ఆంగ్లం పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ వల్ల గతంలో కన్నా పాఠ్యాంశాల స్థాయి, కాఠిన్యం, ప్రామాణికత తగ్గాయి. శిక్షణ ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
-ఎస్.సూర్యప్రకాశ్, రాష్ట్ర రిసోర్స్ పర్సన్
ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం
పదో తరగతిలో మారిన పాఠ్యాంశాల సిలబస్‌పై గతంలో టీవీ ద్వారా శిక్షణ ఇచ్చాం. ఇపుడు నేరుగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. శిక్షణా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఆదేశాలు వచ్చిన వెంటనే శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తాం.
-వెంకటకృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి