సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్‌లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్‌టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్‌కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్‌లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్‌లో జరిగే రెండో దశ మెయిన్స్‌కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగేనా?
సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది.
అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్‌డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. సిలబస్‌లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు.
మేథ్స్ ఇక కఠినం కానట్టేనా?
కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్‌లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది.
కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్‌లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్‌టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment