ప్రొటోకాల్ పోటు
రాజధాని స్థాయిలో విశాఖకు వీఐపీల తాకిడి
ఖర్చుల భారంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి
{పైవేటు హోటళ్లకు కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు
రాష్ర్ట విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖ నగరానికి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. పేరుకు మంగళగిరి తాత్కాలిక రాజధాని అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయి. కేబినెట్ మీటింగ్‌ల నుంచి అంతర్జాతీయ సదస్సుల వరకు అన్నింటికి ఈ పోర్టు సిటీయే వేదికవుతోంది. వేలకోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలన్నీ ఇక్కడే సాగుతున్నాయి. వీఐపీల పర్యటనల కోసం పెట్టే ప్రోటోకాల్ ఖర్చులు ఇక్కడి అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది.
విశాఖపట్నం : విశాఖకు వీఐపీల తాకిడి విపరీతంగా పెరగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హద్‌హుద్ తర్వాత వీఐపీలే కాదు..దేశ విదేశాలకు చెందిన ముఖ్యల రాక బాగా పెరిగిపోయింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలేని నెలంటూ లేదనే చెప్పాలి. ఒక్కో నెలలో రెండు మూడు సార్లు వస్తున్నారు. విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం, ఏపీ టూరిజం గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. అయినా సీఎంతో సహా వీరందరికీ స్టార్ హోటళ్లే కావాలి. నోవటల్ అయితే సీఎంకు క్యాంపుకార్యాలయంగా మారిపోయిందనే చెప్పాలి. అలాగే ప్రోటోకాల్ వాహనాలు మూలనపడ్డాయి. వాటిని బాగు చేయించుకోవడం కాని, కొత్తవి కొనుగోలు చేయడం కానీచేయరు..వచ్చిన ప్రతీ సారివేలకు వేలు పోసి ప్రైవేటు ఏసీ వాహనాలే కావాలి. వీరి పర్యటనల పేరుతో స్టార్ హోటళ్లను, ప్రైవేటు ట్రావల్ ఏజెన్సీలను మేపుతున్నారనే చెప్పాలి.
బకాయిలు కోట్లల్లో...వచ్చేది లక్షల్లో
సీఎం గత పది నెలల్లో అధికారికంగా 23 సార్లు జిల్లాకు వచ్చారు. ఒకసారి వచ్చివెళితేరూ.30లక్షలు ఖర్చవుతుందని అంచనా. అదే సీఎం పర్యటనలో కాస్తా భారీ కార్యక్రమం ఏదైనా ఉంటే ఖర్చు రూ. కోటి దాటిపోతోంది. అంటే సరాసరిన ట్రిప్పుడు సుమారుగా రూ.50లక్షల చొప్పున లెక్కేసుకున్నా సుమారు రూ.11.5కోట్ల పైమాటే. ఇక వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు, కేంద్ర బృందాలు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, గవర్నర్లు, కేంద్ర రాష్ర్ట మంత్రులు, సుప్రీం, హైకోర్టు జడ్జిలు ఇలా వీఐపీల పర్యటనలు లెక్కకు మించేఉన్నాయి. వీటిన్నింటికి ప్రోటోకాల్ ఖర్చులు లెక్కలేస్తే రూ.15-20 కోట్ల పైబడే ఉంటోంది. సీఎం పర్యటనల కోసం ఒక్క బాలాజీ సప్లయిర్స్‌కే అక్షరాల రూ.40 లక్షలు వరకు అధికారులు చెల్లించాల్సి ఉంది. రూ.20లక్షల వరకు హోటళ్లకు, కాన్వాయ్ వాహనాల కోసం ట్రావెల్ ఏజెంట్స్‌కు 35లక్షల వరకు చెల్లించాలి. అలాగే ఇతర ఖర్చులుగా మరో రూ.50లక్షలవరకు బిల్లులు బకాయిలున్నాయి.
వీఐపీల పర్యటనల కోసం హోటళ్లు, కాన్వాయ్, ఇతర ఖర్చుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.40లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా అధికారికంగా రెండుకోట్లకు పైగానే బకాయిలున్నాయి. 2014-15 సంవత్సరానికి ప్రోటోకాల్ ఖర్చుకు జిల్లాకు రూ.34లక్షలు మంజూరైతే రూ.22లక్షలు మాత్రమే డ్రా చేసుకోగలిగారు. మిగిలిన రూ.13లక్షలు ఆంక్షలు పుణ్యామని వెనక్కి మళ్లిపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.12లక్షలు మాత్రమే మజూరయ్యాయి. ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. వీఐపీల తాకిడీ ఇంత తీవ్రంగా ఉంటే కలెక్టరేట్‌లో మాత్రం ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగమంటూ లేని దుస్థితి నెలకొంది. రాజధాని స్థాయిలో వీఐపీల తాకిడి ఉన్న విశాఖలో ప్రత్యేకంగా డివిజనల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగం ఉండాల్సి ఉన్నప్పటికీ విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు.