ప్రొటోకాల్ కష్టాలు
మంత్రులు, వీఐపీల ఖర్చులు తడిసిమోపెడు
కీలక శాఖల అధికారులపైనే భారం
జనం నుంచి వసూళ్లకుపాల్పడుతున్న వైనం
నెలకు రూ.20లక్షలపైనే అనధికారిక ఖర్చు
మంత్రులు, వీఐపీల ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఇటీవల నగరానికి వీఐపీల తాకిడి పెరగడంతో నెలకు రూ.20లక్షల పైనే అనధికారికంగా ఖర్చవుతోంది. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల పైబడే ఖర్చు చేస్తున్నారు.
విజయవాడ : నగరానికి ప్రొటోకాల్ తాకిడి ఎక్కువైంది. ముఖ్యమంత్రి మొదలుకుని రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారుల వరకు అందరూ నగరంలోనే ఎక్కువగా ఉండటంతో ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఉన్నతాధికారుల సూచనలతో రెవెన్యూ విభాగంలోని అధికారులు ప్రొటోకాల్‌ను విభజించి సంబంధిత శాఖల అధికారులకే ఆ బాధ్యతలు, ఖర్చులు అప్పగిస్తున్నారు. ఏ శాఖతో సంబంధం లేని కొందరు వీఐపీల ఖర్చును ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. దీంతో జిల్లాలో నెలకు ప్రొటోకాల్ పేరిట సుమారు రూ.20లక్షలపైనే ఖర్చవుతోంది.
ఆయా శాఖలపైనే భారం
వ్యక్తిగత పర్యటనల నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం వరకూ వివిధ కార్యక్రమాల నిమిత్తం నెలకు సగటున 50 మందికి పైగా వీఐపీలు నగరానికి వస్తున్నారు. ఇవికాకుండా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రోజూ మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు వస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ఖర్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. వివిధ శాఖల మంత్రులు వస్తే హోటల్ బస నుంచి రవాణా సౌకర్యం వరకు అన్నీ ఆయా శాఖల అధికారులే చూసుకుంటారు.
ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల ఖర్చు
ప్రొటోకాల్ బాధ్యతలు రెవెన్యూ సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి బాధ్యతలన్నీ తహశీల్దార్‌వే. అమాత్యులు, వారి బంధువుల బస, భోజన, ఫలహారాలను రోజుకు రూ.10వేల వరకు ఖర్చవుతోంది. ఇలా నెలకు ఒక్కో డిపార్టుమెంట్‌కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మరి.. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందంటే..
జనంపైనే భారం
ప్రొటోకాల్ ఖర్చులంటూ కొన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది.. జనాన్ని బాదేస్తున్నారు. అమాత్యుల ఖర్చులకు రెవెన్యూ, ఎక్సైజ్, విజిలెన్స్, రవాణా, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తమ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి నుంచి ఈ సొమ్ము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ప్రొటోకాల్ ఖర్చులంటూ ప్రతి కాగితానికీ డబ్బు వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు కొరడా ఝళిపించి మరీ వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా లారీ యజమానులు, వాహనచోదకుల నుంచి వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వంతులవారీగా తమకు వచ్చే లంచాల నుంచి ఖర్చు చేస్తున్నారు. సమాచార పౌరసంబంధాలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఉద్యానవన తదితర శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది బడ్జెట్ లేక అప్పులుచేసి ఖర్చు చేస్తున్నారు.