‘‘ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం, ప్రతీ కమిటీ ఇదే నివేదిక ఇస్తోంది, రాష్ట్ర విభజనలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు...
* గిరిజన వర్సిటీ తరలిపోతున్నా పట్టించుకోని కేంద్ర మంత్రి
* వైఎస్‌ఆర్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సుజయ్
బొబ్బిలి(విజయనగరం): ‘‘ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం, ప్రతీ కమిటీ ఇదే నివేదిక ఇస్తోంది, రాష్ట్ర విభజనలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు...అయితే ఇక్కడకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని పక్క జిల్లాకు తరలిస్తున్నారు ఇదేనా అభివృద్ధి చేయడమంటే ’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్‌కృష్ణ రంగారావు ప్రశ్నించారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినా ఇప్పటివరకూ ఒక్కటి కూడా అమలులోకి రాలేదన్నారు.
పార్వతీపురం డివిజన్‌లో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారని, దీంతో జిల్లా వాసులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. మాన్సాస్ భూములు ఇస్తుండడంతో ఎంతో సంతోషపడ్డారని చెప్పారు. అయితే ఇప్పుడు విశాఖపట్నానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని తరలించడం అన్యాయమన్నారు. ఇదేనా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయడం అని ఆయన ప్రశ్నించారు. సొంత జిల్లాకి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చూస్తూ ఊరుకోవడం సబబుగా లేదన్నారు.