{పత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి
ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రాకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, దానికి మద్దతు పలికిన టీడీపీ ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ సీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని, తాము అధికారంలోకి వస్తే కనీసం పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. అదే వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న ప్రభుత్వమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. గతంలో రామ మందిర నిర్మాణం విషయంలో బీజేపీ దేశ ప్రజలను మోసగించిందని, ఆ మోసాన్ని గ్రహించిన ఓటర్లు తరువాత ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దించేశారని గుర్తు చేశారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఆ పార్టీ మరోసారి అధికారం నుంచి దిగిపోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుబ్బారాయుడు హెచ్చరించారు.
విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రభుత్వాలు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసగించగా, ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆ హామీ నుంచి పలాయనం చిత్తగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో చూపిన ఉత్సాహాన్ని ప్రత్యేక హోదా అమలు చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు.
ప్రత్యేక హోదాపై పచ్చి మోసం
Published Sat, Aug 1 2015 3:03 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement