‘మన్యసీమ’వైపు మరో అడుగు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో ముంపు బారినపడే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో పురుడుపోసుకున్న కొత్త జిల్లా ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోంది. ‘మన్యసీమ’ జిల్లా ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణారావుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. విభజన అనంతరం తెలంగాణ లోని ఖమ్మం జిల్లా నుంచి నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, మూడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఎప్పటి నుంచో మన్యసీమ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాకారమయ్యే దిశగా అడుగులు పడడానికి ఈ పరిణామం దోహదం చేసింది.
రాష్ట్రంలో విలీనమైన ఏడు మండలాలను, ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న ఏజెన్సీ మండలాలను కలుపుతూ కొత్తగా మన్యసీమ జిల్లా ఏర్పాటు యోచనపై తూర్పు గోదావరి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఇటీవల రంపచోడవరంలో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. కాగా ఆ ప్రక్రియను ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు కొనసాగిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు మన్యసీమ జిల్లా వైపే మొగ్గుచూపారు. దీంతో విలీనమైన మండలాల గ్రామాల్లో దశలవారీ విసృ్తతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ లోపు మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రంపచోడవరం కేంద్రంగా మన్యసీమ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను కలెక్టర్ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపినట్టు కలెక్టరేట్ వర్గాలు బుధవారం రాత్రి ‘సాక్షి’కి ధృవీకరించాయి.తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరిలో విలీనమైన కుకునూరు, బూర్గంపాడు, వేలేరుపాడు; తూర్పుగోదావరిలో విలీనమైన భద్రాచలం రూరల్ ప్రాంతం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలతో పాటు వై.రామవరం మండలాన్ని రెండుగా విభజించి ప్రతిపాదిత మన్యసీమ జిల్లాలో కలపాలని నివేదించారు.రాజవొమ్మంగి మండలంలో కొన్ని గ్రామాలు, జిల్లాకు సరిహద్దున విశాఖజిల్లాలో ఉన్న గ్రామాలను కలిపి ఒక మండలాన్ని, విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుగ్రామాలను కలిపి మరో మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇలా 20 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటుకు ఒక ప్రతిపాదన పంపారు.
పాలనాపరమైన ప్రయోజనాలే ప్రాతిపదిక
కాగా పశ్చిమ ఏజెన్సీలో విలీనం అనంతరం ఉన్న ఆరు మండలాలు, తూర్పుగోదావరి ఏజెన్సీలో ప్రస్తుతమున్న ఏడు మండలాలు, కొత్తగా చేరిన నాలుగు మండలాలు, ప్రత్తిపాడు, శంఖవరం, కోటనందూరు, రౌతులపూడి మండలాల్లోని ఉప ప్రణాళిక ప్రాంతాల్ని కలిపి మూడు రెవెన్యూ డివిజన్లుగా మార్చి, మన్యసీమ జిల్లా ఏర్పాటు చేయాలన్న మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్రంలో 14వ జిల్లా అవతరించేందుకు మార్గం సుగమమవుతోంది. ఆయా మండలాలను విలీనం చేసినా ఒక జిల్లా ఏర్పాటుకు అవసరమైన జనాభా ఉండనంత మాత్రాన.. మన్యసీమ ఏర్పాటును జనాభా ప్రాతిపదికన చూడరాదని, ఏజెన్సీలో ప్రత్యేక పరిస్థితులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒకే జిల్లా పరిధిలో జరిగితే ఒనగూడే పాలనాపరమైన ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఖమ్మం నుంచి విలీనమైన మండలాల అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నా విసృ్తత ప్రయోజనాల దృష్ట్యా జిల్లా అధికారులు ఈ ప్రతిపాదన పంపించారని సమాచారం.