దూరదర్శన్.. మన దగ్గరకే
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ప్రభావం దూరదర్శన్‌పైనా పడింది. ఇప్పటికే పలు ప్రైవేటు చానల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను వేర్వేరుగా ప్రసారం చేస్తున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రసారాలు చేసేందుకు ప్రసారభారతికి దూరదర్శన్ ప్రతిపాదనలు అందాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కార్యక్రమాలు ప్రసారంచేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రసారం చేసినా, అందులో రెండు గంటలు స్థానిక కార్యక్రమాలకు అవకాశం ఇచ్చేవారు. తొలుత అర్ధగంటే కేటాయించినా ఆ తర్వాత రెండు గంటలకు పెంచారు.
ఇందులోనే 15 నిమిషాల్లో ఈ 13 జిల్లాల వార్తలు ఉండేవి. ప్రధానంగా కోస్తాంధ్రలోని 10 జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించిన వార్తలను ఈ ప్రాంతం నుంచి ప్రసారం చేసేవారు. ఇవి రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రం నుంచి విడిపోయి విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసాయ తదితర అన్ని కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. అయితే ఇందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని తెలిసింది.
30 ఏళ్ల అనుబంధం!
1977లో నీలం సంజీవరెడ్డి హైదరాబాద్ దూరదర్శన్‌ను ప్రారంభించారు. 1985 నాటికి విజయవాడలోనే ట్రాన్స్‌మిషన్ స్టేషన్ ఏర్పాటుచేయడంతో ఈ ప్రాంత వాసులకు హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో 1985వ దశకంలో దూరదర్శన్‌కు విపరీ తమైన ప్రాచుర్యం ఉండేది. హైదరాబాద్ దూరదర్శన్ రెండుగా విడిపోతే ఈ ప్రాంత ప్రజలకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోతుంది.
మరో ఆరు నెలల వ్యవధి..
హైదరాబాద్ దూరదర్శన్ నుంచి విడిపోయి ఇక్కడ నుంచి పూర్తిగా కార్యక్రమాలు నిర్వహించాలంటే మరో ఆరు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. వివిధ రకాల కార్యక్రమాలను రికార్డు చేసుకోవడానికి స్టూడియో, అప్‌లింకింగ్ సౌకర్యం, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. యాంకర్లు, న్యూస్ రీడర్లతోపాటు సిబ్బంది సంఖ్య పెంచాల్సి ఉంది. అలాగే కార్యక్రమాలను నేరుగా ప్రసారం చేసేందుకు ఓబీ వ్యాన్ అవసరం ఉంటుంది.
విస్తరణకు తగిన అవకాశాలు..
ప్రస్తుతం స్టూడియో ఎకరంన్నర స్థలంలో నిర్మించారు. రెండు గంటల కార్యక్రమాలను ఇక్కడినుంచే ప్రసారం చేస్తున్నందున ప్రోగ్రామ్ జనరేటింగ్, అప్‌లింకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దూరదర్శన్ విస్తరణ చేయాలంటే ప్రస్తుతం ఉన్న చోటనే మరో నాలుగు ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ నూతన నిర్మాణాలు చేసుకుంటే ఈ ప్రాంతంలోనూ హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు దీటుగా కేంద్రాన్ని నిర్మించుకోవచ్చు.