private channels
-
స్ట్రెయిట్ ఫ్రమ్ స్టవ్
పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్ చానెల్స్ షోస్ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. ఇదివరకు ఇంగ్లిష్ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాలు ఊరవతల ఉన్న టాకీసుల్లో రిలీజ్ అయ్యేవని చెప్పుకునేవారు. ఎవరికీ తెలియకుండా ఆ సినిమాలు చూడాలి అనుకునేవారు. సీక్రెట్‌గా పొలిమేరలకు వెళ్లేవాళ్లు. ఆ తర్వాత పదేళ్లకు ఊళ్లోనే సెంటర్లో ఉన్న సినిమా హాళ్లకే ట్రాన్స్ఫర్ అయ్యాయి అవి. కాకపోతే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లోనే స్క్రీనింగ్ ఉండేది. అనంతరం పదేళ్లకు ప్రైవేట్ చాన్సల్ రాకతో ఇంగ్లిష్ సినిమాలు ఇంట్లోకే వచ్చేశాయి. ఇప్పుడు.. ఇంగ్లీష్ సినిమాలే కాదు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, హిందీ ఎట్సెట్రా భాషల సినిమాలతోపాటు సీరియల్స్ కూడా అరచేతిలో షో చేస్తున్నాయి. యెస్.. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అది. వాడుక భాషలో వెబ్ చానెల్స్. ఈ యేటి సాంకేతిక ఉప్పెన! ఇవి చూపించేవన్నీ ‘ఎ’ సర్టిఫికెట్ చిత్రాలే. సేక్రెడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్, ఇన్సైడ్ ఎడ్జ్.. వంటివి కొన్ని ఉదాహరణలు. ఆడియెన్స్ క్రేజ్‌ను క్యాచ్ అండ్ క్యాష్ చేసుకుంటున్న బొమ్మలు. పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్ చానెల్స్ షోస్ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. గల్లీలో గాలియా (వీధిలో తిట్లు) నుంచి గోలియోంకి రాస్లీలా దాకా.. అన్నీ ఉన్నవి ఉన్నట్టే.. వినిపిస్తూ కనిపిస్తాయి. సిల్వర్ స్క్రీన్ పాటించే సోకాల్డ్ మర్యాద, పట్టింపుల గ్రామర్ బెడద వెబ్ చానెల్స్‌కు లేదు. తూటాలు కణతల్లోంచి దూసుకుపోయే సీన్.. ట్రాన్స్‌జెండర్ న్యూడ్ లుక్, డ్రెస్సింగ్ రూమ్‌లో చీర్ గర్ల్‌తో సెక్స్.. ఎలాంటి పరదా, బ్లర్ ఇమేజ్ లేకుండా చాలా సామాన్య దృశ్యాలుగానే రోల్ అవుతాయి. సినిమాల కన్నా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే సినిమా బడ్జెట్కేమీ తీసిపోకుండా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా స్టార్స్‌ను పెట్టీ మరీ వెబ్ మూవీస్‌ను, వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి వెబ్ చానెల్స్. క్రైమ్ అయినా, శృంగారం అయినా.. అనురాగం అయినా.. ముసుగు లేకుండా చూపించడమే వీటి సిగ్నేచర్. సిల్వర్ స్క్రీన్.. ప్రేక్షకుల చాయిస్. కాని టీవీ.. నట్టింటి వినోదం. ఇలాంటి షోస్ పాస్వర్డ్ రక్షణతో పరిణతి లేని వాళ్లకు ఇన్విజబుల్గా ఉండే అవకాశం ఉందా? ఒక ఒరవడి 24 గంటల ఆయువునే రాసుకుని వస్తున్న కాలంలో ఉన్నాం. అవకాశాలు ఎప్పుడు ప్రమాదాలవుతాయో.. ప్రమాదాలు ఎలాంటి ప్రమోదాలుగా మారుతాయో తెలియని.. గ్రహించలేని వేగంలో కొట్టుకుపోతున్నాం. ఫలితాలను బేరీజు వేసుకొని సమీక్షించేంత టైమ్ కూడా ఉండట్లేదు. అన్నిటికీ వీక్షకులమే.. వెబ్ చానెల్స్కైనా.. రేపు వచ్చే ఇంకో కొత్త ట్రెండ్ మీడియానికైనా! – సరస్వతి రమ -
దూరదర్శన్.. మన దగ్గరకే
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ప్రభావం దూరదర్శన్పైనా పడింది. ఇప్పటికే పలు ప్రైవేటు చానల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను వేర్వేరుగా ప్రసారం చేస్తున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రసారాలు చేసేందుకు ప్రసారభారతికి దూరదర్శన్ ప్రతిపాదనలు అందాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కార్యక్రమాలు ప్రసారంచేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రసారం చేసినా, అందులో రెండు గంటలు స్థానిక కార్యక్రమాలకు అవకాశం ఇచ్చేవారు. తొలుత అర్ధగంటే కేటాయించినా ఆ తర్వాత రెండు గంటలకు పెంచారు. ఇందులోనే 15 నిమిషాల్లో ఈ 13 జిల్లాల వార్తలు ఉండేవి. ప్రధానంగా కోస్తాంధ్రలోని 10 జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించిన వార్తలను ఈ ప్రాంతం నుంచి ప్రసారం చేసేవారు. ఇవి రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రం నుంచి విడిపోయి విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసాయ తదితర అన్ని కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. అయితే ఇందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని తెలిసింది. 30 ఏళ్ల అనుబంధం! 1977లో నీలం సంజీవరెడ్డి హైదరాబాద్ దూరదర్శన్ను ప్రారంభించారు. 1985 నాటికి విజయవాడలోనే ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటుచేయడంతో ఈ ప్రాంత వాసులకు హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో 1985వ దశకంలో దూరదర్శన్‌కు విపరీ తమైన ప్రాచుర్యం ఉండేది. హైదరాబాద్ దూరదర్శన్ రెండుగా విడిపోతే ఈ ప్రాంత ప్రజలకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోతుంది. మరో ఆరు నెలల వ్యవధి.. హైదరాబాద్ దూరదర్శన్ నుంచి విడిపోయి ఇక్కడ నుంచి పూర్తిగా కార్యక్రమాలు నిర్వహించాలంటే మరో ఆరు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. వివిధ రకాల కార్యక్రమాలను రికార్డు చేసుకోవడానికి స్టూడియో, అప్లింకింగ్ సౌకర్యం, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. యాంకర్లు, న్యూస్ రీడర్లతోపాటు సిబ్బంది సంఖ్య పెంచాల్సి ఉంది. అలాగే కార్యక్రమాలను నేరుగా ప్రసారం చేసేందుకు ఓబీ వ్యాన్ అవసరం ఉంటుంది. విస్తరణకు తగిన అవకాశాలు.. ప్రస్తుతం స్టూడియో ఎకరంన్నర స్థలంలో నిర్మించారు. రెండు గంటల కార్యక్రమాలను ఇక్కడినుంచే ప్రసారం చేస్తున్నందున ప్రోగ్రామ్ జనరేటింగ్, అప్లింకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దూరదర్శన్ విస్తరణ చేయాలంటే ప్రస్తుతం ఉన్న చోటనే మరో నాలుగు ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ నూతన నిర్మాణాలు చేసుకుంటే ఈ ప్రాంతంలోనూ హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు దీటుగా కేంద్రాన్ని నిర్మించుకోవచ్చు.