విద్యాసంస్థలపై విభజన ఎఫెక్ట్
- తెలంగాణ నుంచి ఇంటర్ అడ్మిషన్లు నిల్
- జిల్లాలో ఒక్కసారిగా పడిపోయిన వైనం
- కార్పొరేట్ హాస్టళ్లలో భర్తీకాని సీట్లు
- పెరిగిన రాయలసీమ ప్రాంత విద్యార్థులు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రభావం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతోపాటు విద్యాసంస్థలపైనా పడింది. విద్యారంగంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన గుంటూరు జిల్లాలో ఇంటర్‌మీడియెట్ విద్యను అభ్యశించేందుకు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రతి యేటా దాదాపు 10 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. జిల్లాలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు చెందిన హాస్టళ్లలో ఉండి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో విద్యనభ్యశిస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంత తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు పంపడం మానేశారు.
పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే తమ పిల్లలను వెంట పెట్టుకుని ఏప్రిల్, మే నెల మొదటి వారంలోనే తెలంగాణ జిల్లాల నుంచి తల్లిదండ్రులు ప్రతియేటా ఇక్కడికి వచ్చి కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అడ్మిషన్లు ఆశించినంతగా లేక కళాశాలలు వెలవెలబోతున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమ కాలంలోనూ తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిల్లలను ఇక్కడే చదివించిన తల్లిదండ్రులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్‌లోని విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్ ఎంఈసీ, సీఏ శిక్షణ కోసం ఖమ్మం జిల్లా నుంచి ప్రతియేటా పెద్దసంఖ్యలో విద్యార్థులు వచ్చి తమ హాస్టల్లో అడ్మిషన్లు పొందేవారని ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని జిల్లా కేంద్రంలోని ఒక సీఏ విద్యాసంస్థ డెరైక్టర్ న్యూస్‌లైన్‌కు స్వయంగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తమ సంస్థ శాఖల్లో తెలంగాణ జిల్లాల నుంచి గతేడాది వరకు ఐదు వేల వంతున అడ్మిషన్లు ఉండగా, ప్రస్తుతం 1,500 దాటలేదని మరో కార్పొరేట్ కళాశాల ప్రతినిధి పేర్కొన్నారు.
రాయలసీమ నుంచి అడ్మిషన్లు.. తెలంగాణ ప్రాంత తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్‌మీడియెట్‌లో చేర్పించేందుకు హైదరాబాద్‌కు పంపుతుండగా.. రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లాకు అడ్మిషన్లు పెరుగుతున్నాయని సమాచారం. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి గతంలో హైదరాబాద్‌కు విద్యార్థులను పంపించగా, ప్రస్తుతం సీమ నుంచి హైదరాబాద్‌కు అడ్మిషన్లు తగ్గిపోయి గుంటూరు జిల్లా వైపు సంఖ్య పెరిగిందని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు.