నీళ్లు చల్లిన జైట్లీ | Sprinkled with water Jaitley | Sakshi
Sakshi News home page

నీళ్లు చల్లిన జైట్లీ

Published Fri, Jul 11 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

నీళ్లు చల్లిన జైట్లీ

నీళ్లు చల్లిన జైట్లీ

  • ఎరువుల రాయితీకి నగదు బదిలీకిలంకెతో రైతులకు ఇబ్బందులు
  •      సీమకు ప్రత్యేక ప్యాకేజీపై బడ్జెట్లో ప్రస్తావనే లేదు
  •      ఐఐటీని మంజూరు చేసినా ఎక్కడో తేల్చలేదు
  •      వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపుతో కాస్త ఊరట
  •      కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లాపై చూపే ప్రభావం ఇదీ
  • బోడిగుండుకూ మోకాలికీ ముడేయడమంటే ఇదే..! సంస్కరణల పేరుతో ఎరువుల రాయితీకి నగదు బదిలీకి ముడిపెట్టడంతో 8.70 లక్షలమంది రైతులకు అగచాట్లు తప్పేలా లేవు. విభజన సమయంలో సీమకు ప్రత్యేకప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ఇప్పుడు ఆ మాటే మరిచిపోవడంతో ప్రగతి ప్రశ్నార్థకమైంది. మన్నవరం పరిశ్రమను పూర్తిచేయడంతోపాటు కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటుపై హామీ ఇవ్వకపోవడంతో ఉపాధిపై యువత ఆందోళన చెందుతోంది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచడంతో 75 వేల మందికిపైగా వేతన జీవులకు కాసింత ఊరట లభించింది. మౌలికసదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన నేపథ్యంలో చెన్నై-బళ్లారి, తడ-పూతలపట్టు రహదారుల దశ తిరిగినట్లే..! ఇదీ జిల్లాపై కేంద్ర బడ్జెట్ చూపిన ప్రభావం..!?    
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అర్బన్: దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రాయలసీమ రెండో స్థానంలో ఉంది. సీమలో భాగమైన మన జిల్లాలో పశ్చిమ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది. ఏటా కరవు బారిన పడిన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కూడా హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడంతో జిల్లా ప్రజానీకం భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆ ఆశల్లో నీళ్లు చల్లారు.
     
     ఖేదం (-)....
     సంక్షోభంలో సేద్యం..:

     కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రైతులను నోటితో పలకరించి.. నొసటితో వెక్కిరించారు. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో 8.70 లక్షల కుటుంబాలు సేద్యంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పది లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు.
     
    కర్షకలోకానికి ఊతం ఇవ్వాల్సిన కేంద్రం వారిని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేసింది. యూరియాపై రాయితీని పూర్తిగా ఎత్తేసింది. ప్రస్తుతం యూరియా బస్తా రాయితీపై రూ.274కు మార్కెట్లో లభిస్తోంది. ఇకపై యూరియా బస్తా కొనాలంటే రైతు రూ.1324 వెచ్చించాలి. ఇక పోషక ఆధారిత ఎరువుల (నైట్రోజన్, పాస్ఫరస్, పొటాష్)పై ఇచ్చే రాయితీకి కూడా నగదు బదిలీని వర్తింపజేయాలని నిర్ణయించింది. అంటే.. రైతు పూర్తి ధరకు ఎరువులను కొనుగోలు చేస్తే ఆ తర్వాత కేంద్రం రాయితీని ఆ రైతు ఖాతాలో జమా చేస్తుందన్న మాట. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు పూర్తి స్థాయి ధరను వెచ్చించి ఎరువులను కొనుగోలు చేయగలరా? రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికే కేంద్రం ఈ ఎత్తు వేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై కేంద్రం చేతులెత్తేసింది. ఇందుకు దేశవ్యాప్తంగా కేవలం రూ.వంద కోట్లే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో జిల్లా ప్రజలను పూర్తిగా విస్మరించడం గమనార్హం.
     
     ఉపాధి ఎండమావే..:
     జిల్లాలో మన్నవరం వద్ద బీహెచ్‌ఈఎల్-ఎన్‌టీపీసీ రూ.12 వేల కోట్లతో విద్యుదుత్పత్తి పరికరణాల తయారీ పరిశ్రమ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పరిశ్రమ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కానీ.. ఈ పరిశ్రమ పూర్తి చేయడంపై బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పరిశ్రమను పూర్తిచేయడంతోపాటూ కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు మరిన్నింటిని జిల్లాకు కేటాయిస్తారని ప్రజలు భావించారు. కానీ.. ఒక్క పరిశ్రమను కూడా జిల్లాకు కేటాయించకపోవడంతో ఉపాధి కోసం యువత సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది.
     
     మోదం (+)....
     వేతన జీవులకు ఊరట..:

     జిల్లాలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, టీటీడీ తదితర ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 75 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆదాయపన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచడం వల్ల వేతనజీవులకు కాస్త ఊరట నిచ్చినట్లయింది. గృహ నిర్మాణ రుణాలను తక్కువ వడ్డీకే ఇవ్వడంతోపాటు.. ఆదాయపన్ను రాయితీని కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వేతనజీవులకు వెసులుబాటు కల్పించినట్లయింది.
     
     భరోసా కరవు..:
     దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాం తం రాయలసీమ.. అందులోనూ చిత్తూరుజిల్లా. రాష్ట్ర విభజన సమయంలో సీమకు బుందేఖండ్ తరహా ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. బడ్జెట్లో మాత్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం.. సీమకు ప్రత్యేక ప్యాకేజీకి ఎన్ని నిధులు కేటాయిస్తామన్నది స్పష్టీకరించకపోవడంతో ప్రజానీకం ఆందోళన చెందుతోంది.
     
     ఐఐటీ వస్తుందా..?:
     ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసినట్లుగానే రాష్ట్రానికి కూడా ఐఐటీని మంజూరు చేస్తున్న ట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేయక ముందే ఐఐటీని తిరుపతిలో నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. కేంద్రం మాత్రం మంజూరు చేసిన ఐఐటీని ఎక్కడ నెలకొల్పుతామన్నది స్పష్టంగా ప్రకటించలేదు. ఇది తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుపై అనుమానాలకు దారితీస్తోంది.
     
     పాఠశాల విద్యకు ఊతం..:
     పాఠశాల విద్యకు కేంద్రం ఊతం ఇచ్చింది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద రూ.208కోట్లు  నిధులు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాగం కేంద్రానికి రెండు నెలల క్రితమే నివేదిక పంపింది. సర్వశిక్ష అభియాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో మొత్తం రూ.28,635 కోట్లు నిధులు కేటాయించిన నేపథ్యంలో మన జిల్లాకు రూ.208 కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
     
     రహదారులకు జీవం..:
     మౌలిక సదుపాయాలు.. ప్రధానంగా జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేయాలని నిర్ణయించడంతో జిల్లాలో రహదారుల స్వరూపమే మారిపోనుంది. చెన్నై-బళ్లారి, తడ-పూతలపట్టు రహదారులకు కొత్త కళ రానుంది. కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానం చేసే రోడ్డు కూడా మన జిల్లా నుంచే వెళ్లే అవకాశం ఉంది. ఫోర్‌లేన్, సిక్స్ లేన్ రోడ్డు ఏర్పాటైతే ప్రైవేటు రంగంలో పరిశ్రమలు నెలకొల్పడానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.
     
     సంక్షేమమంటే ఇదేనా?
     ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. బడ్జెట్లో అరుణ్‌జైట్లీ నిధులు కేటాయించిన తీరే అందుకు తార్కాణం. పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఇదేనా..? మౌలిక సదుపాయాల రంగానికి పెద్దపీట వేయడం ఆహ్వానించదగ్గదే. కానీ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేవలం రూ.వంద కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించడంలో ఔచిత్యమేమిటన్నది వారికే తెలియాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలి. యువతకు ఉపాధిపై భరోసాను ఇచ్చేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.
     -వరప్రసాద్, ఎంపీ, తిరుపతి
     
     రాజధానికి నిధులు కేటాయించాల్సింది
     రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డ కొత్త ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి ఉండాల్సింది. అలాగే ఐటీ రంగాన్ని రాయలసీమలో మరింత అభివృద్ధి చేసే దిశగా కేంద్రం బడ్జెట్‌లో చర్యలు తీసుకుని ఉండాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్‌లో నవ్యాంధ్రకు కేటాయింపులు లేకపోవడం బాధించింది.             
    - డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, వైద్యురాలు
     
     ఎయిమ్స్‌పై స్పష్టత ఏదీ..?
     అభివృద్ధిని వికేంద్రీకరించే క్రమంలో ఏపీలో దేశస్థాయి వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్) ఏర్పాటుపై బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు. దాంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, రాయలసీమవాసుల్లో ఆందోళన నెలకొంది. కానీ ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయిన నవ్యాంధ్రలో బాగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
    - డాక్టర్ పార్థసారథి, ఐఏఎం కార్యదర్శి
     
     ఏడ్చే బిడ్డకు వెలక్కాయ చూపినట్టుంది
     ఎన్నికలకు ముందు బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం బడ్జెట్‌లో చేసిన పద్దులను పరిశీలిస్తే ఏడ్చే బిడ్డకు వెలక్కాయ చూపినట్టుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎక్కడా స్పష్టమైన నిధుల కేటాయింపు జరగక మళ్లీ బీజేపీ ప్రభుత్వం నట్టేట ముంచుతోంది. ఈ బడ్జెట్‌తో సామాన్యునికి ఒనగూరే అభివృద్ధి అంటూ ఏదీ లేదు. దేశానికి ప్రాముఖ్యం కలిగిన రక్షణ రంగంలోనూ ఎఫ్‌డీఐలను తెస్తే దేశ భద్రతకు భరోసా ఉంటుందా..?   
    - పీ.నవీన్‌కుమార్‌రెడ్డి, జె సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
     
     ఉద్యోగులకు నిరాశే మిగిల్చింది
     మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రధానంగా గత యూపీయే విధానాలనే కొనసాగించింది. సాధారణ ప్రజలతో పాటు వేతన జీవులకు తీవ్ర నిరాశ కలిగించింది. టాక్స్ మినహాయింపు కనీసం రూ.5 లక్షలు ఉంటుందని ఉద్యోగులు ఆశించారు. రూ.2 లక్షల నుంచి మరో రూ.50 వేలకు పెంచి చేతులు దులుపుకున్నారు. కనీసం రూ.4 లక్షల వరకైనా చేసి ఉంటే కొంత ఊరట ఉండేది. వేలకోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ కంపెనీలకు ఈ బడ్జెట్ ఊతం ఇచ్చినట్టుగానే ఉంది. పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అడుగడుగునా నిర్వీర్యం చేస్తూనే.. కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించిందని చెప్పక తప్పదు.
     - ఎం నాగార్జున, టీటీడీ ఉద్యోగి
     
     ఆశలపై నీళ్లు చల్లారు
     వేతన జీవులకు రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను మినహయింపు ఇస్తామని ఆశలు రేకెత్తించారు. తీరా బడ్జెట్‌లో కేవలం రూ.50వేలు మాత్రం పెంచి ఆశలపై నీళ్లు చల్లారు. అంటే 12నెలల పాటు పనిచేస్తే వచ్చిన జీతంలో నుంచి సుమారు 2నెలల జీతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది. ఇది దారుణం. పెరిగిన ధరలకు కళ్లెం వేయకపోతే ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
      - లోకేష్‌వర్మ, రాష్ర్ట అధ్యక్షుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం  
     
     గృహిణులకు తగిన బడ్జెట్ కాదిది
     ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గృహిణులకు ప్రణాళికాబద్ధత ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి..చేసేది ఒకటిలాగా బడ్జెట్ పద్దును చూస్తే అర్థం అవుతోంది. మొత్తం మీద ఈ బడ్జెట్ గృహిణుల అంచనాలకు తగినట్లుగా లేదనిపిస్తోంది.
     - ఎంఆర్ రెడ్డెమ్మ, గృహిణి
     
     కార్మికులకు నయవంచన
     ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగాల్లో పదేపదే చెప్పే కార్మిక సంక్షేమం అంశానికి తూట్లు పొడిచేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. అసలు వివిధ కర్మాగారాల్లోని కార్మికులకు, అసంఘటిత రంగాల్లోని కోట్లాది మంది కార్మికులకు ఏం సంక్షేమం చేపడుతారో బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణం. ప్రతి రంగానికి చెప్పిన అంశాలను చూస్తే స్పష్టమైన విధానమే కనబడలేదు. ఇది కేవలం కార్పొరేటర్లకు ఉపయోగ పడేలా ఉన్న బడ్జెట్‌లా కనబడుతోంది.                                                
    - లేబూరు రత్నకుమార్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు
     
     రైతన్నకేదీ భరోసా..
     దేశానికి రైతన్న వెన్నెముక. వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతన్నలను నట్టేట ముంచింది. ఎరువుల రాయితీ ఎత్తేయడం, నగదు బదిలీని వర్తింపజేయడం అంటే సేద్యాన్ని సంక్షోభంలోకి నెట్టడమే. రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతు రుణాల మాఫీకి కేంద్రం ఎలాంటి దన్ను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రైతు రుణాల మాఫీపై చంద్రబాబు తక్షణమే విధి విధానాలను ప్రకటించాలి. రైతుల రుణాలను మాఫీ చేయకపోతే కర్షకుల ఆగ్రహాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం కాలి బూడిదవడం ఖాయం. రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీమకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. ఐఐటీని తిరుపతిలోనే నెలకొల్పి.. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలి.                
    -పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట
     
     మొండిచేయి చూపిన మోడీ బడ్జెట్
     కేంద్ర బడ్జెట్‌లో సీమాంధ్రకు మొండిచేయే మిగిలింది. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతానని ప్రమాణం చేసి ప్రధాని అయిన నరేంద్రమోడీ బడ్జెట్ విషయంలో మాట తప్పి కొత్త రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఈ బడ్జెట్ కార్పోరేటర్లకు, ధనిక వర్గాలకు ఉపయోగపడేలా ఉందేకానీ మధ్య తరగతి ప్రజలకు, రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడదు. రైల్వే బడ్జెట్ ఎంత నిరాశ కల్గించిందో ఈ బడ్జెట్ అంతకుమించిన నిరాశను మిగిల్చింది. అరుణ్‌జైట్లీ గొప్ప ఆర్థికవేత్త అన్న గుర్తింపును పొందారే కానీ ఏమాత్రం మానవతాదృక్పథంతో ఆలోచించకపోవడం దారుణం. కొత్త  రాష్ట్ర పునర్నిర్మాణాన్ని విస్మరించి ఏకపక్షంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దురదృష్టకరం. సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని తాము పూడుస్తామని ప్రగల్భాలు పలికి ఆచరణలో సాధ్యం చేయలేకపోయారు. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు ఎలాంటి నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించి కోట్లాదిమంది ప్రజల మనోభావాలను తమ ఆర్థిక ప్రగతిని, అభివృద్ధిని విస్మరించి బడ్జెట్ ప్రవేశపెట్టారు.                
     - దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే
     
     వ్యవసాయానికి ప్రాధాన్యం లేదు
     మనదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం వదిలివేసినట్టు బడ్జెట్ చెబుతోంది. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు, జాతీయ రహదారులకు రూ.36 వేల కోట్లు కేటాయించిన కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించడానికి కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. గ్రామీణ ప్రాం తాల్లో గృహ నిర్మాణం, నీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని విస్మరించడం బాధాకరం. విద్యారంగానికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై, రాజధాని నిర్మాణంపై ప్రస్తావన రాకపోవడం అన్యాయం.
     -ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, మాజీ రిజిస్ట్రార్
     
     గొప్పగా ఏమీ లేదు
     కేంద్రప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఏమీ లేదు. ఆదాయపు పన్ను మినహాయించిన అంశంలో చేసిన వెసులుబాటు పెద్దగా ప్రయోజనాన్ని చేకూర్చదు. ఇనుప క మ్మీలు, సిమెంట్ ధరలు తగ్గించారు. దీనివల్ల నిర్మాణరంగానికి మేలు జరుగుతుంది. అలాగే తయారీ రంగానికి మేలు చేశారు. దీనివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. వినియోగసామర్థ్యం, కొనుగోలు సామర్థ్యం పెరుగుతాయి. మధ్యతరగతి ఉద్యోగులకు గృహ రుణాలను కొంత పెంచారు.
     -ప్రొఫెసర్ ఎ.పద్మావతి, ఆర్థికశాస్త్ర విభాగాధిపతి
     
     పొంతన లేని బడ్జెట్
     బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించిన హామీలకు, ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతనలేదు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన నరేంద్రమోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. సామాన్య ప్రజానీకానికి, మధ్యతరగతి  ఉద్యోగులకు బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ఆదాయపన్ను పరిధిని కొంతమేరకే పెంచారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే గ్రామీణ లింక్ రోడ్ల నిర్మాణానికి ఎక్కువ కేటాయింపులు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. పేద, మధ్యతరగతికి ఆశాజనకంగా లేదు.
     -ప్రొఫెసర్ సవరయ్య, ఎస్వీయూ
     
     విద్యారంగానికి ప్రాధాన్యం లేదు
     గురువారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. రాష్ట్ర విభజన వల్ల మనం 200 కేంద్రీయ సంస్థలను కోల్పోయాం. కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రీయ విద్యాసంస్థలను కేటాయించక పోవడం దారుణం. తిరుపతికి కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర సంస్థలను కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో ఏ ఒక్క సంస్థ ఏర్పాటుకూ కేటాయింపులు పెద్దగా లేవు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుత్సాహానికి గురిచేసింది.
     -హేమంత్‌కుమార్, విద్యార్థి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement