గిరి‘జన గోడు’
సాక్షి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతోపాటు రాష్ట్ర విభజన తర్వాత రెండు జిల్లాల్లో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, గిరిజన జిల్లా ఏర్పాటు అంశం క్రమంగా జఠిలమవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లేదా మన జిల్లాలోని పోలవరాన్ని కొత్త జిల్లాకు కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంపై రచ్చ సాగుతోంది. మరోవైపు గిరిజన జిల్లాలో కలవడం తమకు ఇష్టం లేదని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
కొత్త జిల్లా ఏర్పాటు ఇలా..
జిల్లాలో ఇప్పటికే 39లక్షల పైగా జనాభా ఉన్నారు. మొన్నటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న వేలేరుపాడు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు కలిసిన కుక్కునూరు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో విలీనం అయ్యూరుు. తద్వారా ఆ మండలాలకు చెందిన దాదాపు 70వేల జనాభా మన జిల్లాలో చేరింది. దీంతో జిల్లా జనాభా 40 లక్షలు దాటిపోనుంది. జనాభాతోపాటు భూ విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతున్నారుు.
ఈ నేపథ్యంలో గిరిజన మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, టి.నరసాపురం, కొత్తగా కలిసిన కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, దేవీపట్నం, ఆ జిల్లాలో కలిసిన కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్ మండలాలతో కలిపి గిరిజన జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గిరిజనేతరుల ఆందోళన
ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం, తాడువాయి, వేగవరం, చక్రదేవరపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాలుగురోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. గిరిజనులు ప్రత్యేక జిల్లాకు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ గిరిజనేతరులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
కొయ్యలగూడెం మండలాన్ని కొత్త జిల్లాలో విలీనం చేయూలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కన్నాపురం పంచాయతీ సోమవారం తీర్మానం చేసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో తరచూ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గోపాలపురం మండలంలోని గిరిజనేతరులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. గిరి జన ప్రత్యేక చట్టాల వల్ల తాము నష్టపోతామని ఆ మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా కేంద్రంపై రచ్చ
గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే ఆ జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా గిరిజనులు గట్టిగానే పట్టుపడుతున్నారు. జిల్లాలోని పోలవరం లేదా కేఆర్ పురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడి గిరిజనుల నుంచి వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని అక్కడి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలోని పోల వరం నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెళ్లేందుకు ప్రస్తుతం నేరుగా మార్గం లేదు. పోలవరం నుంచి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీదుగా గోదావరిని దాటి రాజమండ్రికి.. అక్కడి నుంచి రంపచోడవరం వెళ్లాలి. అంటే దాదాపు 120 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వరకూ రోడ్డు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ రెండు ప్రాం తాల మధ్య దూరం 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఇటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన మండలాలకు సైతం దూరం తగ్గుతుంది. ఈ సౌలభ్యం ఉందనే కారణంగా పోలవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని జిల్లాలోని గిరిజనులు కోరుతున్నారు.
ఐటీడీఏను విస్తరిస్తారా
గిరిజన జిల్లా ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉంటే గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)ను విస్తరించాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (73 గ్రామాలు), బూర్గంపాడు మండలాన్ని పాక్షికంగా (6 గ్రామా లు) జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఈ మండలాలు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. వీటిని జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలు ఉన్నాయి.
కలెక్టర్‌ను కలిసిన బాలరాజు
కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన జిల్లా కేంద్రంగా పోలవరాన్ని ఎంపిక చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను సోమవారం కోరారు. ఇరు జిల్లాలకు అందుబాటులో ఉండటంతోపాటు ఇందిరా సాగర్ జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతున్న దృష్ట్యా పోలవరానికి ప్రాధాన్యత ఏర్పడిందని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని బాలరాజుకు కలెక్టర్ హామీ ఇచ్చారు.