విస్తరణకు వేళాయె
- రూ.260కోట్లతో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి
- 482ఎకరాల సేకరణ లక్ష్యం
- 206కుటుంబాల తరలింపు
నూజివీడు : నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గన్నవరం విమానాశ్రయాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విజయవాడకు వీఐపీలు, వీవీఐపీల రాకపోకలు పెరిగినందున విమాన సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం 5వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయంలో చిన్న విమానాలు మాత్రమే దిగేం దుకు వీలుంది.
రాబోయే రోజుల్లో దీనిని అంతర్జాతీయ స్థాయికి పెంచాల్సిన అవసరం రానుంది.అలాగే బోయింగ్ 747 లాంటి విమానాలు దిగేందుకు వీలుగా విమానాశ్రయాన్ని విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా సేకరించాల్సిన భూ వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి పంపారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం గతంలోనే రూ.260కోట్లు కేటాయించింది.
విమానాశ్రయంలో ఉన్న ప్రస్తుత రన్‌వే పొడవు 6500 అడుగులుండగా దానిని 10500 అడుగుల పొడవుకు పెంచేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి గానూ ఇప్పుడున్న దానికి అదనంగా మరో 482ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అందుబాటులో 51ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున మిగిలిన 431ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది.
గన్నవరం మండలం కేసరపల్లిలో 121.97ఎకరాలు, బుద్ధవరంలో 196.56ఎకరాలు, అర్జంపూడిలో 112.49 ఎకరాలు సేకరించనున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది సమగ్ర సర్వే పూర్తిచేశారు. ఈ భూసేకరణ కారణంగా 206 కుటుంబాలను విమానాశ్రయం విస్తరణ చేయనున్న ప్రాంతం నుంచి తరలించాల్సి వస్తోంది. దీనికి గానూ వారికి నష్టపరిహారం చెల్లించడమే కాకుండా పునరావాసాన్ని కల్పించడానికి నిధులు కేటాయించారు.
వీరందరికీ రీ సెటిల్‌మెంట్ అండ్ రీహేబిటేషన్ కింద పునరావాసం కల్పిస్తారు. భూసేకరణ, పునరావాసానికి కలిపి ప్రభుత్వం రూ.260కోట్లు కేటాయించినట్లు సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తరువాతే భూసేకరణ ప్రక్రియ చేపడతామని ఆయన తెలిపారు.