విమానాశ్రయ ఏర్పాటుతో అభివృద్ధి
విమానాశ్రయ ఏర్పాటుతో అభివృద్ధి
Published Wed, Nov 30 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
– ప్రజాభిప్రాయాన్ని సేకరించిన జేసీ హరికిరణ్
ఓర్వకల్లు : ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేయనున్న విమానాశ్రయంతో అభివృద్ధి జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బుధవారం కన్నమడకల గ్రామ శివారులో గల బుగ్గ దేవస్థానం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జేసీతో పాటు బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ రఘుబాబు, కాలుష్య నియంత్రణ మండలి విస్తరణాధికారి ప్రసాదరావు, కన్నమడకల, పూడిచెర్ల, ఓర్వకల్లు సర్పంచులు నారాయణ, సరోజమ్మ, పెద్దయ్య ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. రాయలసీమ జిల్లాల సౌలభ్యం కోసం ఓర్వకల్లు ప్రాంతంలో జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు నెలకొల్పనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.200 కోట్ల అంచనాలతో 584 ఎకరాలలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని..తొలి దశలో రూ.88 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో 800 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. భూ బాధిత కుటుంబాలలో ఇంటికొక ఉద్యోగం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఓర్వకల్లు విమానాశ్రయ ప్రాంతంలో గల చెరువులను అభివృద్ధి చేసి సాగు నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. సమావేశంలో సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐలు చంద్రబాబునాయుడు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement