జిల్లాలో నాలుగు కొత్త అర్బన్ మండలాలు
Published Sat, Oct 29 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
– ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రెవెన్యూ అధికారులు
– కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌లు అర్బన్ మండలాలుగా మార్చేందుకు కసరత్తు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ దిశగా జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్‌లు, అర్బన్ మండలాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా కొత్తగా నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. తాను ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త డివిజన్‌లు, ఆర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. కర్నూలు నగరం, నంద్యాల, ఆదోని, డోన్ పట్టణాలను అర్బన్ మండలాలుగా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. అర్బన్, రూరల్ ప్రాంతాలు కలిపి ఒకే మండలంగా ఉండటం వల్ల పరిధి పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడుతోంది. సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయలనే నిర్ణయానికి వచ్చారు. కర్నూలు నగరాన్ని అర్బన్ మండలం చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ప్రభుత్వం కూడా దీనిని ఆమోదించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా కర్నూలుతో పాటు మరో మూడు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవి ఏర్పాటయితే జిల్లాలో మండలాల సంఖ్య 58కి చేరనుంది.
Advertisement
Advertisement