ఎన్టీపీసీ ‘విద్యుత్’పై కేంద్రానిదే నిర్ణయం !
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న 1,600(25800) మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధన మేరకు ‘ఎన్టీపీసీ’, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) మధ్య గత జనవరి 18న కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) బహిర్గతం చేసింది.
ఈ ఒప్పందంపై అభ్యంతరాలు, సలహాలను వచ్చే నెల 18లోగా తెలియజేయాలని ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. 1,600 మెగావాట్ల తొలి దశ ప్రాజెక్టుపై పీపీఏలో రాష్ట్ర పునర్విభజన చట్టం హామీ ఊసే లేదు. కేంద్రం హామీ మేరకు 100 శాతం విద్యుత్ రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా రాష్ట్రానికి కేటాయించే విద్యుత్‌ను కేంద్రమే నిర్ణయిస్తుందని ఒప్పందంలో రాసుకున్నారు. పీపీఏలో పెట్టుబడి వ్యయాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. విద్యుత్ కేంద్రం వాణిజ్య ఉత్పత్తి ప్రారంభ తేదీ(సీవోడీ) నుంచి 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం మనుగడలోకి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, సీవోడీ కానీ, ప్రాజెక్టు నిర్మాణ కాల వ్యవధి వివరాలు మాత్రం లేవు.