‘స్థానిక’ పాలకుల ఎన్నికకు విధివిధానాలివే..
- పురపాలక సంఘాల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఒక చోట ఓటు
- విప్ ధిక్కరిస్తే ఓటు చెల్లినా.. వేటు తప్పదు..
- మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
- నేడో, రేపో మండల, జిల్లా పరిషత్‌లకు..
ఎట్టకేలకు ‘స్థానిక సంస్థల’ అధినేతల ఎన్నికకు రంగం సిద్ధమైంది. పురపాలక సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, పెడన పురపాలక సంఘాలతో పాటు ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీలకు మార్చి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 12న ఫలితాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఫలితాలు వెల్లడైన వారంలోపు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేవారు. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు తదితర కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. వైఎస్సార్ సీపీ విజ్ఞాపనలు, రాజ్‌భవన్ జోక్యంతో నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 3న మునిసిపల్, 4న మండల, 5న జిల్లా పరిషత్ సారథులను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధివిధానాలపై కథనం ఇదీ..
ఎంపీలకు ఒక చోటే ఓటు
పురపాలక సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిలకు సంబంధించిన ప్రకటనను మునిసిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన వారికి, ఆయా సంఘాల్లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఆప్షన్ ఇచ్చిన ఎంపీలకు అందజేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కౌన్సిలర్లు, మునిసిపాల్టీ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే అధికంగా మున్సిపాలిటీలు ఉన్నప్పుడు ఏదో ఒక చోట మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి. వారు ప్రత్యేక సమావేశానికి హాజరై పురపాలక సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే నాటికి, మునిసిపల్ పరిధిలో ఓటరు అయి ఉంటే... ఆ మునిసిపాల్టీలో వారూ ఓటు వేయవచ్చు. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు (లోక్‌సభ, రాజ్యసభ) ఆహ్వానం ఉంది. కానీ వారికి ఓటు హక్కు లేదు.
కోరం ఉంటేనే ఎన్నిక
మున్సిపాల్టీల సారథుల ఎన్నిక జూలై 3న జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, కమిషనర్ల ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత కౌన్సిల్ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు అర్హులైన వారిలో సగం మంది సభ్యులు సమావేశం ప్రారంభమైన గంటలోపు హాజరైతే కోరం ఉన్నట్లు. ఉదాహరణకు మచిలీపట్నం మున్సిపాలిటీలో 42 మంది కౌన్సిలర్లు, బందరు ఎంపీ, ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉంది. అంటే 44 మంది సభ్యులున్నట్లు. వీరిలో 22 మంది హాజరైతే కోరం ఉన్నట్లు. కోరం లేకుంటే మరుసటి రోజు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం మళ్లీ సమావేశం నిర్వహిస్తారు. పని దినమైనా, సెలవు రోజైనా సమావేశం ఉంటుంది. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచిం చాలి. మరో సభ్యుడు సమర్థించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సరి సమానంగా ఓట్లు వచ్చిన పక్షంలో ఎన్నికల అధికారి డ్రా పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. ఒకవేళ ఆ రోజున కూడా కోరం లేకపోతే.. కోరం ఉన్నా ఎన్నిక జరగపోతే ఆ విషయాన్ని తదుపరి ఆదేశాల కోసం ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తారు.
విప్ కీలకం
మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, సారథుల ఎన్నికలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండటాన్నే విప్ అంటారు. అంటే తన ఆదేశాల్ని ధిక్కరిస్తే... కొరడా ఝళిపించే అవకాశం పార్టీకి ఉంటుంది. స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు ఈ నిబంధన వర్తించదు. 14 పార్టీలు విప్ జారీ చేసే అర్హత కలిగి ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలను బట్టి స్పష్టమమవుతోంది. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేం దుకు పార్టీ పక్షాన ఒక విప్‌ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మాలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడు లేదా, పార్టీ నాయకుడిని విప్‌గా నియమించవచ్చు. సభ్యుడికి మాత్రమే సమావేశ మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం ఒక గంట ముందు, ఎన్నికల అధికారికి అందించాలి. అయితే విప్ జారీ చేసినా, ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకం చేయకపోతే.. విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్ అందుకుని, ఎన్నిక సందర్భంగా ధిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే.. ఓటు చెల్లుతుంది. ఆ సభ్యుడు సభ్యత్వం కోల్పోతాడు.
కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఇలా...
మునిసిపల్, మండల, జెడ్పీ సారథుల ఎన్నిక తరువాత కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్‌కు ఒకరు, జిల్లా పరిషత్‌కు ఇద్దరిని ఎన్నుకోవాలి. కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన వయోజనులు నిర్దేశిత ప్రత్యేక సమావేశం రోజున ఉదయం 10 గంటలకు నామినేషన్లు సమర్పించాలి. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే తెలుగు అక్షర క్రమంలో జాబితా రూపొందించి ఎన్నిక నిర్వహిస్తారు. మండల పరిషత్‌లో ఎంపీటీసీ సభ్యులు, జిల్లాపరిషత్‌లో జెడ్పీటీసీ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతిలో కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో ఎకరిని ఎంపిక చేస్తారు. ఈ ఎన్నికకు విప్ వర్తించదు. ఇక మున్సిపాలిటీలకు ముగ్గురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. ఇద్దరు మైనార్టీ వర్గాలకు, వారిలో ఒకరు మహిళ అయి ఉండాలి. ముస్లిం, క్రిష్టియన్, సిక్, బుద్దిస్ట్, జోరాస్త్రియన్ మైనార్టీ వర్గాల్లో ఎవరైనా మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లయిన వారిని ఎన్నుకోవాలి. మరో కో-ఆప్టెడ్ సభ్యుడిగా రిటైర్డ్ మునిసిపల్ ఉద్యోగి, వివిధ రంగాలపై అవగాహన నైపుణ్యం, సామాజిక సేవాతత్పరత వంటి సుగుణాలు కలిగిన వారిని ఎన్నుకోవాలి. కౌన్సిల్ ప్రమాణస్వీకారం తర్వాత 60 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి.