మహాలక్ష్మీ ... నీవెక్కడ | The removal of gold from the mother Online | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మీ ... నీవెక్కడ

Published Tue, May 24 2016 8:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

మహాలక్ష్మీ ... నీవెక్కడ

మహాలక్ష్మీ ... నీవెక్కడ

పథకం అమలులో సర్కార్ నిర్లక్ష్యం
ఆన్‌లైన్ నుంచి బంగారు తల్లి తొలగింపు
పెండింగ్‌లో వేల దరఖాస్తులు
అయోమయంలో లబ్ధిదారులు
 

‘ప్రతి ఆడపిల్లనూ వివక్ష అన్నది లేకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చేందుకు, రాష్ట్రంలో తొలిసారిగా 1996లో బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం. అదే పథకాన్ని కొన్ని మార్పులతో ఇప్పుడు ‘మా ఇంటి మహాలక్ష్మి’ పథకంగా అమలు చేస్తున్నాం.  పుట్టే ప్రతి ఆడశిశువునూ సగౌరవంగా, సంతోషంగా సమాజంలోకి స్వాగతించుదాం, మన ఉత్తమ సంస్కృతిని చాటుదాం.’ అంటూ రాష్ర్ట విభజన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఇవి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు బాలికల సంరక్షణకు బంగారు తల్లి పేరుతో పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఆ పథకం పేరునే మా ఇంటి మహాలక్ష్మిగా చంద్రబాబు మార్చారు. పథకం పేరు మార్చడంలో ఉన్న ఆత్రుత...అమలులో లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి.   - ధర్మవరం
 
 
మా ఇంటి మహాలక్ష్మి పేరుతో చంద్రన్న ప్రభుత్వం అమలు చేస్తున్న బంగారు తల్లి పథకం అమలు నేడు ప్రశ్నార్థకమైంది. ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని, ఆడబిడ్డలను తల్లిదండ్రులు భారంగా భావించకూడదనే సదుద్దేశంతో నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి చంద్ర ప్రభుత్వం మంగళం పాడింది? గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న చిత్తశుద్ధి వాటి అమలులో లేకపోవడం శోచనీయం.


అంతా అయోమయం!
మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద పేరు నమోదు చేసుకుంటే ఆడబిడ్డ పుట్టిన నాటి నుంచి పెళ్లి వరకు వివిధ దశల్లో వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తల్లిదండ్రులు ఆశించారు. బంగారు తల్లి పథకాన్ని 2014 వరకు మున్సిపాలిటీల్లో మెప్మా, రూరల్ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తర్వాత తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పేరును మాఇంటి మహాలక్ష్మిగా మార్చి, అమలు చేసే బాధ్యతను ఐసీడీఎస్ పర్యవేక్షిస్తుందంటూ ప్రకటించారు.

ఇందుకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ 30న జీవో 50 విడుదల  చేశారు.  తమ పరిధి నుంచి ఐసీడీఎస్‌కు పర్యవేక్షణను మార్పు చేస్తారన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి దరఖాస్తులను వెలుగు, మెప్మా సిబ్బంది స్వీకరించడం లేదు. అర్హులు ఎవరైన తమ పిల్లల వివరాలను నమోదు చేసుకునేందుకు వెళితే సదరు శాఖల అధికారులు ఐసీడీఎస్ (అంగన్‌వాడీ కేంద్రాల్లో ) కలవాలని చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఐసీడీఎస్‌కు అందకపోవడంతో వారూ సైతం దరఖాస్తులను స్వీకరించడం లేదు. దీంతో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్లో అర్థం కాక పలువురు అయోమయంలో పడ్డారు.  


ఆన్‌లైన్ నుంచి తొలగింపు
బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. 2014 వరకు అర్బన్ ఏరియాల్లో (మెప్మా పరిధిలో )4,488 దరఖాస్తులు రాగా 632 మందికి తొలివిడత సాయం అందింది. అదే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 14,646 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కాగా 815 మందికి మాత్రమే తొలివిడత సాయం అందింది. అప్పటి నుంచి  జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ పథకాన్ని మొత్తం ఆన్‌లైన్ నుంచి తొలగించడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులకు స్పష్టత ఇచ్చే అధికారులే కరువయ్యారు.


 పథకం ద్వారా లభించే ప్రోత్సాహకాలు :
బంగారు తల్లి పథకంలో బాలికకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. శిశువు పుట్టిన వెంటనే జనన నమోదు చేసుకుని ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు అందిస్తే.... ఆ శిశువు తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతుంది. ఒకటి నుంచి రెండేళ్ల వరకు రూ.1,000, మూడు నుంచి ఐదేళ్ల వరకు రూ.1,500, ఆరు నుంచి పదేళ్ల వరకు రూ.2 వేలు, 11నుంచి 12 ఏళ్ల వరకు రూ.2,500, 13వ ఏట రూ.2,500, 14నుంచి 15 ఏళ్ల వరకు రూ.3,000, 16నుంచి17 ఏళ్ల వరకు రూ.3,500, 18నుంచి21 ఏళ్ల వరకు రూ.4 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అయితే బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు తప్పని సరిగా చదువుకోవాల్సి ఉంటుంది. బాలిక విద్యను ప్రోత్సహించడం, భవిష్యత్తులో ఆమె పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా బ్యాంకులో జమ చేసిన నగదు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారురాలు 18 ఏళ్లు నిండి ఇంటర్‌మీడియట్ పూర్తి అయ్యాక తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటే రూ.50వేలు ప్రభుత్వం అందిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక పెళ్లి చేస్తే రూ.లక్ష వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement