Bangarutalli scheme
-
మహాలక్ష్మీ ... నీవెక్కడ
► పథకం అమలులో సర్కార్ నిర్లక్ష్యం ► ఆన్లైన్ నుంచి బంగారు తల్లి తొలగింపు ► పెండింగ్‌లో వేల దరఖాస్తులు ► అయోమయంలో లబ్ధిదారులు ‘ప్రతి ఆడపిల్లనూ వివక్ష అన్నది లేకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చేందుకు, రాష్ట్రంలో తొలిసారిగా 1996లో బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం. అదే పథకాన్ని కొన్ని మార్పులతో ఇప్పుడు ‘మా ఇంటి మహాలక్ష్మి’ పథకంగా అమలు చేస్తున్నాం. పుట్టే ప్రతి ఆడశిశువునూ సగౌరవంగా, సంతోషంగా సమాజంలోకి స్వాగతించుదాం, మన ఉత్తమ సంస్కృతిని చాటుదాం.’ అంటూ రాష్ర్ట విభజన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు బాలికల సంరక్షణకు బంగారు తల్లి పేరుతో పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఆ పథకం పేరునే మా ఇంటి మహాలక్ష్మిగా చంద్రబాబు మార్చారు. పథకం పేరు మార్చడంలో ఉన్న ఆత్రుత...అమలులో లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. - ధర్మవరం మా ఇంటి మహాలక్ష్మి పేరుతో చంద్రన్న ప్రభుత్వం అమలు చేస్తున్న బంగారు తల్లి పథకం అమలు నేడు ప్రశ్నార్థకమైంది. ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని, ఆడబిడ్డలను తల్లిదండ్రులు భారంగా భావించకూడదనే సదుద్దేశంతో నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి చంద్ర ప్రభుత్వం మంగళం పాడింది? గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న చిత్తశుద్ధి వాటి అమలులో లేకపోవడం శోచనీయం. అంతా అయోమయం! మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద పేరు నమోదు చేసుకుంటే ఆడబిడ్డ పుట్టిన నాటి నుంచి పెళ్లి వరకు వివిధ దశల్లో వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తల్లిదండ్రులు ఆశించారు. బంగారు తల్లి పథకాన్ని 2014 వరకు మున్సిపాలిటీల్లో మెప్మా, రూరల్ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తర్వాత తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పేరును మాఇంటి మహాలక్ష్మిగా మార్చి, అమలు చేసే బాధ్యతను ఐసీడీఎస్ పర్యవేక్షిస్తుందంటూ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ 30న జీవో 50 విడుదల చేశారు. తమ పరిధి నుంచి ఐసీడీఎస్‌కు పర్యవేక్షణను మార్పు చేస్తారన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి దరఖాస్తులను వెలుగు, మెప్మా సిబ్బంది స్వీకరించడం లేదు. అర్హులు ఎవరైన తమ పిల్లల వివరాలను నమోదు చేసుకునేందుకు వెళితే సదరు శాఖల అధికారులు ఐసీడీఎస్ (అంగన్వాడీ కేంద్రాల్లో ) కలవాలని చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఐసీడీఎస్‌కు అందకపోవడంతో వారూ సైతం దరఖాస్తులను స్వీకరించడం లేదు. దీంతో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్లో అర్థం కాక పలువురు అయోమయంలో పడ్డారు. ఆన్లైన్ నుంచి తొలగింపు బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న ఆన్లైన్ సదుపాయాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. 2014 వరకు అర్బన్ ఏరియాల్లో (మెప్మా పరిధిలో )4,488 దరఖాస్తులు రాగా 632 మందికి తొలివిడత సాయం అందింది. అదే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 14,646 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కాగా 815 మందికి మాత్రమే తొలివిడత సాయం అందింది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ పథకాన్ని మొత్తం ఆన్లైన్ నుంచి తొలగించడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులకు స్పష్టత ఇచ్చే అధికారులే కరువయ్యారు. పథకం ద్వారా లభించే ప్రోత్సాహకాలు : బంగారు తల్లి పథకంలో బాలికకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. శిశువు పుట్టిన వెంటనే జనన నమోదు చేసుకుని ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు అందిస్తే.... ఆ శిశువు తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతుంది. ఒకటి నుంచి రెండేళ్ల వరకు రూ.1,000, మూడు నుంచి ఐదేళ్ల వరకు రూ.1,500, ఆరు నుంచి పదేళ్ల వరకు రూ.2 వేలు, 11నుంచి 12 ఏళ్ల వరకు రూ.2,500, 13వ ఏట రూ.2,500, 14నుంచి 15 ఏళ్ల వరకు రూ.3,000, 16నుంచి17 ఏళ్ల వరకు రూ.3,500, 18నుంచి21 ఏళ్ల వరకు రూ.4 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అయితే బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు తప్పని సరిగా చదువుకోవాల్సి ఉంటుంది. బాలిక విద్యను ప్రోత్సహించడం, భవిష్యత్తులో ఆమె పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా బ్యాంకులో జమ చేసిన నగదు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారురాలు 18 ఏళ్లు నిండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటే రూ.50వేలు ప్రభుత్వం అందిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక పెళ్లి చేస్తే రూ.లక్ష వస్తుంది. -
బంగారుతల్లి భరోసానిచ్చేనా..?
తెరుచుకోని వెబ్సైట్ శాఖల మధ్య సమన్వయ లోపం పథకాన్ని కొనసాగించాలని తల్లిదండ్రుల వేడుకోలు కావలిఅర్బన్ : మొదటి, రెండవ ఆడశిశువులకు బంగారుతల్లి పథకం 2013 మే 1వ తీదీ నుంచి వర్తించేవిధంగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకానికి రూపకల్పన చేసింది. అప్పట్లో ఆన్లైన్లో తల్లీ బిడ్డల పూర్తి వివరాలు పుట్టిన 21 రోజుల్లోపు నమోదు చేసుకునే వారు. నమోదైన ఆడశిశువుల పేరిట సంవత్సరానికి రూ 2,500 అకౌంట్లో వేసేవారు. కానీ ్రపస్తుత ప్రభుత్వం పథకాన్ని మరుగున పడేసింది. దీంతో ఇప్పుడు పుట్టిన పిల్లలకు ఆ పథకం వర్తిస్తుందో లేదో తెలియక ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. అమలులో శాఖల మధ్య సమన్వయ లోపం: ప్రారంభంలో ఇందిరా క్రాంతి పథం అధికారులు ఈ పథకాన్ని సమీక్షించేవారు. జనన ధ్రువీకరణ పత్రం, రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ నంబర్ తదితర వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేసేవారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న తొలి ఏడాది రూ 2,500లు, తరువాతి సంవత్సరం రూ 2,000లు ఆ తరువాతి సంవత్సరం కొంత నగదు నేరుగా తల్లీబిడ్డల ఖాతాల్లో జమయ్యేది. డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత మొత్తంగా రూ 2,16,000లు ఇస్తారు. వివాహ సమయం నాటికి ఈ నగదును ఉపయోగించుకోవడమే పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆ పథకం ప్రక్రియ నిలిచిపోయింది. బంగారు తల్లి పథకానికి ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకుందామని సంఘమిత్ర కార్యాలయానికి వెళ్తే ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగడంలేదంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారని అంటున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్ సైట్ తెరుచుకోవడంలేదని చెబుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు సుమారు 270, మున్సిపాలిటీలో సుమారు 300 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశామని ఆయా శాఖల అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే దరఖాస్తులు చేసుకోవడం ఎలా అని అడిగితే ఐసీడీఎస్ అధికారులకు ఇచ్చారని కొందరు చెప్పడంతో అక్కడకు వెళ్లి ఆరా తీస్తున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న దురాలోచనతోనే టీడీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించి ఆడబిడ్డలను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగించాలి: నాకు మొదటి కాన్పులో బాబు పుట్టాడు. రెండవ కాన్పులో ఇద్దరు ఆడశిశువులు పుట్టారు. బంగారుతల్లి పథకం ఉందనుకుంటున్నాను. ప్రస్తుతం పథకం ప్రక్రియ జరగడంలేదని తెలియడంతో ఆవేదనగా ఉంది. పథకాన్ని యథాతదంగా కొనసాగించి ఆదుకోవాలి. - ఉమ్మడిశెట్టి కామేశ్వరి, కొత్తపల్లి, కావలి మండలం. ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు: గత కొద్ది నెలలుగా బంగారుతల్లి పథకంలో ఆన్లైన్ ఫారమ్‌లు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు. అది వచ్చిన వెంటనే యథావిధిగా ప్రక్రియను కొనసాగిస్తాం. - షాలీమ్రోజ్, ఏపీఎం. ఐకేపీ కావలి మండలం. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం భరోసా కరువైంది. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉండడంతో తల్లిదండ్రులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. -
ఆడపిల్లలను పోషించలేమని..!
* పసికందును వదిలించుకున్న దంపతులు * ఎస్ఐ, సర్పంచ్ చొరవతో తిరిగి తల్లి చెంతకు.. ఖిల్లాఘనపురం: ఆడపిల్లల పోషణ భారమని భావించిన ఓ పేద తల్లిదండ్రులు తమ నెల వయసు ఉన్న పసికందును వదిలేసివెళ్లారు. మాతృప్రేమకు మచ్చతెచ్చిన ఈ సంఘటన సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఆముదంబండ తండాకు చెందిన కేతావత్ దేవి, సూర్యకు మొదటి సంతానంగా కూతురు జన్మించింది. ఇటీవల రెండోకాన్పులోనూ ఆడకూతురే పుట్టింది. వంశోద్ధారకుడు పుట్టలేదని వారు కలతచెందారు. కన్న మనసును చంపుకోలేక.. సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి ఖిల్లాఘనపురం వచ్చి ఓ ఇంటి ఆవరణలో ఆ పసిగుడ్డును వదిలేసివెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ మశ్చందర్‌రెడ్డి, సర్పంచ్ సౌమ్యానాయక్, వైద్యాధికారి అక్కడికి చేరుకుని శిశువును చేరదీశారు. ఇదిలాఉండగా, అక్కడే స్థానిక బస్టాండ్‌లో ఒంటరిగా దిగాలుగా కూర్చున్న దేవిని ఆరాతీయగా.. ఆ పసికందు తనకూతురేనని కంటతడిపెట్టింది. ఆడపిల్లలను పోషించలేమనే భారంతోనే ఇలా వదిలించుకున్నట్లు తెలిపింది. బంగారుతల్లి పథకం ద్వారా ఆర్థికసహాయం అందించేందుకు తమవంతు ప్రయత్నిస్తామని వారు నచ్చజెప్పి పాపను తిరిగి తల్లికి అప్పగించారు. -
కష్టాల్లో ‘బంగారు తల్లి’
ఖమ్మం హవేలి: చిన్నారి బాలికల కోసం ఏర్పాటు చేసిన బంగారుతల్లి పథకం 2013 మే 1 నుంచి అమలవుతున్నప్పటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని రూపొం దించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో నిత్యం ఎదురుచూపులే మిగిలాయి. 90శాతం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. లబ్ధిదారుల ఖాతాలో తక్షణం జమ కావాల్సిన రూ.2500 మొదటి విడత నగదు కూడా 60 శాతం మందికి పైగా జమ కాలేదు. జిల్లా నుంచి అధికారులు అన్ని వివరాలను ఆన్లైన్ చేసి పంపినప్పటికీ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదలడం లేదు. ఈ పథకం కొనసాగింపు విషయమై శాసనసభ సమావేశాల్లోనూ సభ్యులు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తారో.. కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారో కూడా ఏమాత్రం స్పష్టత లేదు. సంబంధిత శాఖ మంత్రి నుంచి తగిన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జిలా ్లవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 14,157 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 6,604 మందికి మాత్రమే మొదటి విడత ఇన్స్టాల్మెంట్ నగదు ఖాతాల్లో జమ అయింది. వీరిలో సింహభాగం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. 7,553 మంది లబ్ధిదారుల ఖాతాలో మొదటి విడత నగదు జమ కాలేదు. బాండ్లు రాలేదు. మరో 65 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. జిల్లా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా 27మండలాల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఈ మండలాల నుంచి 17 నెలల కాలంలో మొత్తం 9,214 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 54 తిరస్కరణకు గురయ్యాయి. 4,409 మందికి మొదటి విడత నగదు జమ అయింది. మరో 4,805 మందికి ఇప్పటికీ మొదటి విడత నగదు ఖాతాలో పడలేదు. కాగా ఈ ఆర్థిక సవంత్సరం 2014-15కు సంబంధించి 3,656 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు 3,642మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇందులో ఒక్కరికి కూడా తొలివిడత నగదు జమ కాలేదు. అదేవిధంగా మరో 19మండలాల్లో ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. ఈ 19మండలాల నుంచి గత 17 నెలల కాలంలో మొత్తం 5,050 మంది దరఖాస్తు చేసుకోగా 11 తిరస్కరణకు గురయ్యాయి. 1,874మందికి మొదటి విడత నగదు ఖాతాల్లో జమ అయింది. 3,176 మంది లబ్ధిదారులకు ఇప్పటికీ నగదు ఖాతాలో జమ కాలేదు. 2014-15 సంవత్సరానికి సంబంధించి 2,069 దరఖాస్తులు రాగా అధికారులు 2,066 లబ్ధిదారుల వివరాలు అన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇందులో ఇక్కరికి కూడా తొలివిడత నగదు ఖాతాల్లో పడలేదు. లబ్ధిదారులు తమ దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలియక గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి బాండ్లు రాకపోగా కనీసం మొదటి విడత నగదు కూడా ఖాతాల్లో చేరకపోవడంతో లబ్ధిదారులు మండలాల్లోని ఐకేపీ, ఖమ్మంలోని డీఆర్డీఏ, భద్రాచలంలోని ఐటీడీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటు బాండ్లు విడుదల చేస్తే ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. పథకం కొనసాగిస్తారో, లేదోనని అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు. చివరకు బడ్జెట్లో సైతం ఇందుకు సంబంధించి సరైన ప్రస్తావన లేదు. బంగారుతల్లి పథకం కొనసాగింపు, మార్పులు, చేర్పుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తగిన స్పష్టత ఇవ్వాలని, భరోసా కల్పించాలని లబ్ధిదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు. -
‘బంగారుతల్లి’ని కొనసాగిస్తాం
పరిగి: బంగారుతల్లి పథకాన్ని కొనసాగిస్తామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయున విలేకర్లతో వూట్లాడారు. గత ప్రభుత్వ పథకాలైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే కొనసాగిస్తామని చెప్పారు. బంగారుతల్లి పథకం విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లాలో కోట్‌పల్లి, లక్నాపూర్, సాలార్‌నగర్ ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. 1.20 లక్షల మంది రైతులకు జిల్లాలో రుణమాఫీ వర్తించిందని చెప్పారు. ఇప్పటికే 25శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేయగా మిగతా నిధులకు ప్రభుత్వం బ్యాంకులకు బాండ్లు ఇస్తుందన్నారు. ఎస్టీలకు, మైనార్టీలకు కల్యాణలక్ష్మి పథకం నవంబర్ 1వ తేదీ నుంచి అమలుచేస్తామని తెలిపారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన 500 జనాభా పైబడిన తండాలన్నీ పంచాయుతీలుగా మారనున్నాయన్నారు. కొత్తగా 200 బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు. కళ్యాణలక్ష్మి బీసీలకు, ఎస్సీలకు, నిరుపేద ఓసీలకు కూడా వర్తింపజేయాలని పరిగి మాజీ జెడ్పీటీసీ ఎస్పీ బాబయ్య కోరగా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల మహేష్‌రెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్‌మహేమూద్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ, పరిగి సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్, మాజీ జెడ్పీటీసీ ఎస్పీ బాబయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భాస్కర్, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి అశోక్‌రెడ్డి నాయుకులు పాల్గొన్నారు. -
‘బంగారుతల్లి’కి భరోసా ఏదీ?
సామాజిక భద్రత కొరవడిన ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు‘బంగారుతల్లి’ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చదువుసంధ్యల ఖర్చంతా భరిస్తామని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ పథకానికి తమ ‘ముద్ర’ వేసుకొనేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ఈ పథకం వల్ల జిల్లాలో ఒక్కరికీ లబ్ధి చేకూరలేదంటే.. పాలకులు, అధికార యంత్రాంగం తీరు ఏపాటిదో అవగతమవుతోంది. సాక్షి, రాజమండ్రి :గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బంగారుతల్లి పథకం జిల్లాలో మూలనపడింది. ఈ పథకం ప్రారంభం నుంచీ ఇప్పటివరకు సగం మందికి కూడా లబ్ధి చేకూరకపోగా, ఈ ఏడాది ఒక్క ‘బంగారు తల్లి’కి ప్రయోజనం అందలేదు. నమోదు చేసుకున్న లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఎప్పుడు సాయం మంజూరు చేస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి ‘పచ్చరంగు’ పులిమేందుకు యత్నిస్తోంది. బినామీ లబ్ధిదారులు అన్న సాకుతో గత ప్రభుత్వం గుర్తించిన వారిపై అనర్హత వేటు వేయాలని చూస్తోంది. తద్వారా తెలుగు తమ్ముళ్లు సూచించిన వారినే సిసలైన లబ్ధిదారులుగా చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాక పథకం పేరు కూడా మార్పు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తమ మార్కు సంస్కరణలు అమల్లోకి వచ్చేవరకు త పథకాన్ని పెండింగ్‌లో పెట్టింది. పథకం ఉద్దేశమిది.. జిల్లాలో గతేడాది మే ఒకటిన ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే దరఖాస్తు చేసుకుంటే రూ.2,500 బ్యాంకు ఖాతాలో తొలివిడతగా జమ చేస్తారు. రెండేళ్ల పాటు టీకాలు, పుట్టిన రోజు వేడుకలు వంటి ఖర్చుల కోసం ఏడాదికి రూ.వెయ్యి వంతున జమ చేస్తారు. మూడు, నాలుగు, ఐదో ఏడాదిలో రూ.1,500 వంతున, ఆరు నుంచి 15 ఏళ్ల వయసులో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి చదివించేందుకు ఏడాదికి రూ.2 వేలు, 11 నుంచి 13 ఏళ్ల వరకు హైస్కూలు చదువు కోసం ఏడాదికి రూ.2,500 వంతున, తొమ్మిది, పది తరగతులకు రూ.3 వేల వంతున చెల్లిస్తారు. ఇంటర్మీడియట్‌కు రూ.3,500 వంతున, 18 నుంచి 21 ఏళ్లలో డిగ్రీ చదువులకు ఏడాదికి రూ.4 వేల వంతున ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే రూ.50 వేలు, డిగ్రీ పూర్తయిన వెంటనే రూ.లక్ష బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ బాండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. జిల్లాలో అమలు ఇలా.. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పథకం ప్రారంభం నుంచి 25,376 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 12 వేల మందికి మాత్రమే తొలివిడత సాయం బ్యాంకుల్లో జమ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 51 మండలాల్లో 7,836 మంది, రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలు సహా మున్సిపాలిటీల్లో 711 మంది నమోదు చేసుకోగా, నేటికీ వీరికి బాండ్లు ఇవ్వలేదు. తొలి విడత నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. వెరసి ఒక్కరికి కూడా ఈ పథకం లబ్ధి చేకూరలేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. వారి మాటల సారాంశం.. బంగారుతల్లి పథకం పేరును కూడా ప్రభుత్వం మార్చేందుకు చూస్తోంది. లబ్ధిదారులను కూడా జల్లెడ పట్టిన తర్వాతే పథకం మళ్లీ అమలవుతుంది. -
అయ్యో ‘బంగారు తల్లీ’
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: మేలిమి బంగారు తల్లుల్లారా..కలువ కన్నుల కన్నెల్లారా..రేపటికి దీపాలయ్యే పాపల్లారా..మీరు చదువుకోవాలి. మీరు చదువుకుంటే మీ ఇల్లు బాగుపడుతుంది. మీకు చదువులేక పోతే మీ కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధిలో వెనుకపడుతుంది. స్త్రీకి చదువులేని పరిస్థితి రాకూడదనే భావించిన దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ‘బాలికా సంరక్షణ’ పేరుతో మహత్తర పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా ఆడపిల్ల పుట్టగానే కొంత నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని యోచించారు. బాలిక పెరిగి పెద్దయ్యాక ఆమెకు నగదు చేరాలంటే తప్పనిసరిగా చదువుకోవాలనే నిబంధన విధించారు. ఆయన హయాంలో ఈ పథకం వల్ల ఎంతో మంది లబ్ధిపొందారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఆ పథకం పేరును ఆర్భాటాల మధ్య ‘బంగారుతల్లి- మా ఇంటి మహాలక్ష్మి’గా మా ర్చేశారు. అయితే ఈ పథకం ఇప్పుడు ప్రాథమిక దశలోనే కునికిపాట్లు పడుతోంది. ఆడపిల్ల పుట్టగానే తల్లి ఖాతాలో పడాల్సిన సొమ్ము లబ్ధిదారులకు ఇప్పటికీ అందలేదు. ఎక్కడో అరకొరగా... ఆదీ ఈ వారంలోనే జమ అయినట్లు తెలిసింది. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులకు, పాపం తీరిక లేకుండా పోవడంతో పథకం అమలు గతుకుల రోడ్డుపై బండి నడకలా తయారైంది. ప్రస్తుతం పథకం ఎలా ఉందంటే... 2013 మే 1 తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ పథకం వర్తింపచేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు 2,243 మంది ఆడపిల్లలు జన్మించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ జననాల్లో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 400 మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలుగానే దరఖాస్తులు వచ్చాయి. వారి వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ ఇప్పటికీ నవీకరణ కాలేదు. పథకం కింద వచ్చిన ప్రతి ఆడపిల్లకూ ముందుగా రూ.2,500 జమచేయాలి. అయితే పథకం ప్రారంభించి ఐదునెలలు కావస్తున్నా ఇప్పటికి పైసా కూడా జమకాలేదు. గతంలోని బాలికా సంర క్షణ పథకాన్ని ఐసీడీఎస్ పరిధిలో చేర్చగా ప్రస్తుతం బంగారు తల్లి పథకం నిర్వహణ బాధ్యతను ఐకేపీకి అప్పగించారు. అర్హులు...నిబంధనలు.. ఈ పథకంలో చేరేవారు తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి. కుటుంబంలోని ఇద్దరు బాలికల వరకు ఈ పథకం వర్తిస్తుంది. మొదటి, రెండో కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించినా...లేక ఇద్దరూ కవలలుగా పుట్టినా పథకానికి అర్హులే. అయితే కాన్పును ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యశాలల్లోనే చేయించాలి. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లితో సంయుక్తంగా బాలిక పేరున బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, తల్లీబిడ్డల సంయుక్త ఫొటోను అధికారులకు అందించాలి. ఈ వివరాలను ఆన్లైన్లోని బంగారు తల్లి పథకం వెబ్సైట్లో నమోదు చేస్తారు. మూడేళ్లపాటు అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా టీకాలు వేయించి...ఐదేళ్లు వచ్చేవరకూ కేంద్రానికి పంపాలి. బిడ్డకు ఏడేళ్ల వయసు నిండగానే తల్లీబిడ్డల పేర్లపై సంయుక్త బ్యాంక్ ఖాతా తెరవాలి. పథక ప్రయోజనం పథకం కింద పేరు రిజిస్టర్ కాగానే తల్లీబిడ్డల పేరుపై ఉండే బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతాయి. ఏడాది దాటిన వెంటనే రూ.1,000, రెండేళ్లు పూర్తికాగానే మరో రూ.1,000 మూడు నుంచి పదేళ్లలోపు ఏడాదికి రూ.1,500 చొప్పున మొత్తం రూ.4,500 బ్యాంకులో వేస్తారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి పూర్తయ్యే లోపు ఏడాదికి రూ.2 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తారు. ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ. 2,500 చొప్పున మూడేళ్లకు రూ.7,500, తొమ్మిది, పది తరగతుల్లో ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఆరువేలు జమ చేస్తారు. ఇంటర్ రెండేళ్లకు రూ.7వేలు, ఏదైనా డిగ్రీ నాలుగేళ్ల పాటు చదివితే ఏడాదికి రూ. 4 వేలు చొప్పున రూ.16 వేలు ఇస్తారు. లబ్ధిదారురాలికి 21 సంవత్సరాలు నిండగా నే బ్యాంకు ఖాతాలో జమ అయి న రూ.55,500కు అదనంగా లక్ష రూపాయలు ఇస్తారు. ఇంట ర్ వరకు మాత్ర మే చదివితే 21 సంవత్సరాలకు రూ.50 వేలు మాత్రమే అందుతాయి. -
‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వీడాలి
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : బంగారు తల్లి పథకం అమలులో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, లేనిపక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మంచిర్యాల, చెన్నూరు క్లస్టర్ పరిధిలోని మండలాలకు చెందిన ఐకేపీ ఏపీఎంలు, సీసీలతో శనివారం మంచిర్యాల ఏరియా కో ఆర్డినేటర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ బంగారుతల్లి పథకం అమలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పుట్టిన ఆడపిల్లల వివరాలు సగం కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల వివరాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులు సేకరించడం లేదన్నారు. వీరి వైఖరితో లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. ఇకపై నిర్లక్ష్యం వీడి ఆడపిల్లల వివరాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయూలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా తెరవడంలో ఇబ్బందులుంటే అన్ని వివరాలు ఆదిలాబాద్‌కు పంపిస్తే ఒక్కరోజులో ఖాతా తీరుుస్తామని చెప్పారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, అభయహస్తం పథకాల అమలుపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. చెన్నూరులో స్త్రీనిధి పథకం కింద మహిళా సమాఖ్య సభ్యురాలి పేరుతో వేరొకరు రూ.4 లక్షలు రుణం తీసుకుని కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించారని, ఈ నెలాఖరులోగా మిగిలిన డబ్బు బ్యాంకులో జమ చేయూలని ఆదేశించారు. లేనిపక్షంలో ఏపీఎం, సీసీలపై చర్యలు తీసుకుంటామన్నారు. పథకాలు మహిళా సమాఖ్యలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పేర్కొన్నారు. డీఆర్డీఏ డీపీఎం ఎస్. వేణుగోపాల్, ఏపీఎం జాబ్స్ భూపతి బ్రహ్మయ్య, ఏరియా కో ఆర్డినేటర్లు చంద్రకళ, రాజుబాయ్, ఏపీఎం రాంచందర్ పాల్గొన్నారు. -
అయోమయంలో ‘బంగారు తల్లి’
నమోదుపై అవగాహన కల్పించని అధికారులు అమలు చేసేదెవరో తెలియని వైనం నానా తంటాలు పడుతున్న లబ్ధిదారులు ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్ : బాలికల సంరక్షణకు బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టామని, దీనికి చట్టబద్ధత కల్పించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పథకం అమలు అయోమయంగా మారింది. పథకం విధివిధానాలు, ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సంవత్సరం మే 1 నుంచి జన్మించిన ఆడ శిశువులు అర్హులని ప్రకటించడం తప్ప, పథకానికి సంబంధించి ఏ ఒక్క అంశపై సరైన వివరణ ఇవ్వలేదు. అవగాహన లేమి... బంగారు తల్లి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలం కావడంతో లబ్ధి పొందదల్చిన వారు తమ పిల్లల పేర్లు ఎక్కడ నమోదు చేయించుకోవాలన్న దానిపై అవగాహన లేకుండా పోయింది. ఏంచేయాలో తోచక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఆలస్యమైతే పథకానికి ఎక్కడ దూరమవుతామేమోనని ఆందోళన చెందుతున్నారు. మొదట మే 1 నుంచి జూన్ 23 లోపు పుట్టిన ఆడ శిశువుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఐకేపీ మహిళాసంఘాలను ఆదేశించింది. అయితే వారికి సరైన మార్గదర్శకాలు సూచించకపోవడంతో నమోదు ప్రక్రియ ముం దుకు సాగడం లేదు. మండలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ఆడశిశువులు, వారిలో పథకానికి అర్హులైన వారి వివరాల నమోదుకు కూడా వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. నమోదులో ఇబ్బందులు... ఇదిలా ఉంటే, పథకంలో నమోదుకు 24 అంశాలను పొందుపర్చాలన్న ప్రభుత్వం నిబంధనలు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జనన ధ్రువీకరణ పత్రం, బిడ్డ, తల్లి ఫొటోలు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే చాలామంది తమ పిల్లలకు పేర్లు పెట్టరు. అలాగే బర్త్ సర్టిఫికెట్ ఆన్లైన్ చేసినందున అది అందడంలో జాప్యమవుతోంది. రేషన్‌కార్డు, ఆధార్ కార్డులో పేర్లు, ఇతర సమాచారం నమోదులో లోపాలు ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి రేషన్‌కార్డు, ఆధార్ కార్డులు కూడా లేని పరిస్థితి. ఇది కాకుండా బంగారు తల్లి పథకానికి ఎక్కడ పేరు నమోదు చేసుకోవాలి, ఎవర్ని సంప్రదించాలన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాలు, ఐసీడీఎస్, ఐకేపీ ఇలా అన్ని కార్యాలయాల్లోనూ సమాచారం కోసం అడిగినా సమాధానం లభించడం లేదు. ఇంటి దగ్గర జన్మించిన ఆడపిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని, వీరి వివరాలను అంగన్వాడీ, గ్రామ సమాఖ్యలు నమోదు చేయాలన్న ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో తల్లులు తమ చిన్నపిల్లలను ఎత్తుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగుతున్నారు. లబ్ధి పొందింది ఒక్క బంగారు తల్లి మాత్రమే... మొదట మే, జూన్ మాసాల్లో జన్మించిన ఆడ శిశువులకు మాత్రమే బంగారు తల్లి పథకం అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తదనంతరం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబంలో ఆడశిశువుకు పథకం అం దించాలని నిర్ణయించింది. సుమారు 2లక్షల జనాభా ఉన్న మండలంలో మే, జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కేవలం 58 మంది అడపిల్లల పేర్లు మాత్రమే బంగారు తల్లి పథకంలో నమోదయ్యాయి. అయితే కాచివానిసింగారం గ్రామానికి చెందిన నల్ల చాతుర్యకు మాత్రమే పౌష్టికాహారం, ఆస్పత్రి ఖర్చుల కింద రూ. 2500లు ఈ పథకం ద్వారా అందాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి సరైన మార్గదర్శకాలు విడుదల చేసి బంగారు తల్లి పథకం ఫలాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
బంగారుతల్లికీ ‘ఆధార్’ లింకు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల తరహాలోనే ‘బంగారుతల్లి’ పథకానికి కూడా ప్రభుత్వం ఆధార్ లింకు పెట్టింది. అయితే ఈ ఏడాదికి మినహాయింపునివ్వాలని... 2014, మార్చి 31 తర్వాత దరఖాస్తు చేసుకునే ప్రతి తల్లీ ఆధార్ కార్డు పొంది ఉండాల్సిందేనని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బంగారుతల్లి పథకంపై జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగారుతల్లి పథకం కింద ఆన్లైన్లో నగదు బదిలీకోసం అందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేయాలని, అయితే, ఈ ఏడాది అందరికీ ఆధార్ అందుబాటులో లేనందున మినహాయింపునివ్వాలని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఆధార్ నిబంధన అమల్లోకి వచ్చేంతవరకు ఈ పథకం కింద దరఖాస్తుకు గానీ, నగదు బదిలీకి గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతోపాటు ఒక కాన్పులో ఆడబిడ్డ పుట్టిన తర్వాత రెండో కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా ఈ పథకం కింద అర్హులుగానే పరిగణించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పుట్టిన 21 రోజుల్లోగా జనన ధ్రువీకరణ పత్రం పొందాలన్న నిబంధన తొలగించారని పేర్కొన్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు 51,929 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,360 మందికి బ్యాంకు అకౌంట్లే లే వు. సంక్షేమ పథకాలకు సమీకృత సాఫ్ట్వేర్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం సమీకృత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. సెర్ప్, ఉపాధిహామీ, పెన్షన్లు, బంగారుతల్లి లాంటి పథకాల కోసం ఒకే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని, ఇందుకోసం జి.కె.వీధి లాంటి రెండు గిరిజన మండలాలను పైలట్‌గా ఎంచుకోవాలని సూచించారు. గ్రీన్‌చానల్‌లో చేరుస్తున్నాం: మంత్రి సునీతా ‘బంగారు తల్లి’ పథకం అమలుకు నిధుల కొరత రాకుండా గ్రీన్‌చానల్ ద్వారా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆదేశించారని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ పథకం కోసం రూ. 57.5 కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. సెదారన్ ప్రక్రియలో 1.30 లక్షల మంది వికలాంగులు పెన్షన్‌కు అనర్హులయ్యారని, అయినా వారికి పెన్షన్ రద్దు చేయకుండా నెలకు రూ.200 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
ఆడపిల్లల్ని చంపే హక్కు ఎవరిచ్చారు : సిఎం