బంగారుతల్లి భరోసానిచ్చేనా..?
తెరుచుకోని వెబ్‌సైట్
శాఖల మధ్య సమన్వయ లోపం
పథకాన్ని కొనసాగించాలని
తల్లిదండ్రుల వేడుకోలు
కావలిఅర్బన్ : మొదటి, రెండవ ఆడశిశువులకు బంగారుతల్లి పథకం 2013 మే 1వ తీదీ నుంచి వర్తించేవిధంగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకానికి రూపకల్పన చేసింది. అప్పట్లో ఆన్‌లైన్‌లో తల్లీ బిడ్డల పూర్తి వివరాలు పుట్టిన 21 రోజుల్లోపు నమోదు చేసుకునే వారు. నమోదైన ఆడశిశువుల పేరిట సంవత్సరానికి రూ 2,500 అకౌంట్‌లో వేసేవారు. కానీ ్రపస్తుత ప్రభుత్వం పథకాన్ని మరుగున పడేసింది. దీంతో ఇప్పుడు పుట్టిన పిల్లలకు ఆ పథకం వర్తిస్తుందో లేదో తెలియక ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.
అమలులో శాఖల మధ్య సమన్వయ లోపం:
ప్రారంభంలో ఇందిరా క్రాంతి పథం అధికారులు ఈ పథకాన్ని సమీక్షించేవారు. జనన ధ్రువీకరణ పత్రం, రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ నంబర్ తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేవారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తొలి ఏడాది రూ 2,500లు, తరువాతి సంవత్సరం రూ 2,000లు ఆ తరువాతి సంవత్సరం కొంత నగదు నేరుగా తల్లీబిడ్డల ఖాతాల్లో జమయ్యేది. డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత మొత్తంగా రూ 2,16,000లు ఇస్తారు. వివాహ సమయం నాటికి ఈ నగదును ఉపయోగించుకోవడమే పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆ పథకం ప్రక్రియ నిలిచిపోయింది.
బంగారు తల్లి పథకానికి ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకుందామని సంఘమిత్ర కార్యాలయానికి వెళ్తే ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగడంలేదంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారని అంటున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్‌లైన్ సైట్ తెరుచుకోవడంలేదని చెబుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు సుమారు 270, మున్సిపాలిటీలో సుమారు 300 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేశామని ఆయా శాఖల అధికారులు వెల్లడిస్తున్నారు.
అయితే దరఖాస్తులు చేసుకోవడం ఎలా అని అడిగితే ఐసీడీఎస్ అధికారులకు ఇచ్చారని కొందరు చెప్పడంతో అక్కడకు వెళ్లి ఆరా తీస్తున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న దురాలోచనతోనే టీడీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించి ఆడబిడ్డలను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
బంగారుతల్లి పథకం కొనసాగించాలి:
నాకు మొదటి కాన్పులో బాబు పుట్టాడు. రెండవ కాన్పులో ఇద్దరు ఆడశిశువులు పుట్టారు. బంగారుతల్లి పథకం ఉందనుకుంటున్నాను. ప్రస్తుతం పథకం ప్రక్రియ జరగడంలేదని తెలియడంతో ఆవేదనగా ఉంది. పథకాన్ని యథాతదంగా కొనసాగించి ఆదుకోవాలి.
- ఉమ్మడిశెట్టి కామేశ్వరి, కొత్తపల్లి, కావలి మండలం.
ఆన్‌లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు:
గత కొద్ది నెలలుగా బంగారుతల్లి పథకంలో ఆన్‌లైన్ ఫారమ్‌లు నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు. అది వచ్చిన వెంటనే యథావిధిగా ప్రక్రియను కొనసాగిస్తాం.
- షాలీమ్‌రోజ్, ఏపీఎం. ఐకేపీ కావలి మండలం.
ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం భరోసా కరువైంది. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉండడంతో తల్లిదండ్రులు ఆవేదనవ్యక్తం
చేస్తున్నారు.