నమోదుపై అవగాహన కల్పించని అధికారులు
అమలు చేసేదెవరో తెలియని వైనం
నానా తంటాలు పడుతున్న లబ్ధిదారులు
ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్ : బాలికల సంరక్షణకు బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టామని, దీనికి చట్టబద్ధత కల్పించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పథకం అమలు అయోమయంగా మారింది. పథకం విధివిధానాలు, ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సంవత్సరం మే 1 నుంచి జన్మించిన ఆడ శిశువులు అర్హులని ప్రకటించడం తప్ప, పథకానికి సంబంధించి ఏ ఒక్క అంశపై సరైన వివరణ ఇవ్వలేదు.
అవగాహన లేమి...
బంగారు తల్లి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలం కావడంతో లబ్ధి పొందదల్చిన వారు తమ పిల్లల పేర్లు ఎక్కడ నమోదు చేయించుకోవాలన్న దానిపై అవగాహన లేకుండా పోయింది. ఏంచేయాలో తోచక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఆలస్యమైతే పథకానికి ఎక్కడ దూరమవుతామేమోనని ఆందోళన చెందుతున్నారు. మొదట మే 1 నుంచి జూన్ 23 లోపు పుట్టిన ఆడ శిశువుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఐకేపీ మహిళాసంఘాలను ఆదేశించింది. అయితే వారికి సరైన మార్గదర్శకాలు సూచించకపోవడంతో నమోదు ప్రక్రియ ముం దుకు సాగడం లేదు. మండలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ఆడశిశువులు, వారిలో పథకానికి అర్హులైన వారి వివరాల నమోదుకు కూడా వ్యవస్థను ఏర్పాటు చేయలేదు.
నమోదులో ఇబ్బందులు...
ఇదిలా ఉంటే, పథకంలో నమోదుకు 24 అంశాలను పొందుపర్చాలన్న ప్రభుత్వం నిబంధనలు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జనన ధ్రువీకరణ పత్రం, బిడ్డ, తల్లి ఫొటోలు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే చాలామంది తమ పిల్లలకు పేర్లు పెట్టరు. అలాగే బర్త్ సర్టిఫికెట్ ఆన్‌లైన్ చేసినందున అది అందడంలో జాప్యమవుతోంది. రేషన్‌కార్డు, ఆధార్ కార్డులో పేర్లు, ఇతర సమాచారం నమోదులో లోపాలు ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి రేషన్‌కార్డు, ఆధార్ కార్డులు కూడా లేని పరిస్థితి. ఇది కాకుండా బంగారు తల్లి పథకానికి ఎక్కడ పేరు నమోదు చేసుకోవాలి, ఎవర్ని సంప్రదించాలన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాలు, ఐసీడీఎస్, ఐకేపీ ఇలా అన్ని కార్యాలయాల్లోనూ సమాచారం కోసం అడిగినా సమాధానం లభించడం లేదు. ఇంటి దగ్గర జన్మించిన ఆడపిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని, వీరి వివరాలను అంగన్‌వాడీ, గ్రామ సమాఖ్యలు నమోదు చేయాలన్న ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో తల్లులు తమ చిన్నపిల్లలను ఎత్తుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగుతున్నారు.
లబ్ధి పొందింది ఒక్క బంగారు తల్లి మాత్రమే...
మొదట మే, జూన్ మాసాల్లో జన్మించిన ఆడ శిశువులకు మాత్రమే బంగారు తల్లి పథకం అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తదనంతరం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబంలో ఆడశిశువుకు పథకం అం దించాలని నిర్ణయించింది. సుమారు 2లక్షల జనాభా ఉన్న మండలంలో మే, జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కేవలం 58 మంది అడపిల్లల పేర్లు మాత్రమే బంగారు తల్లి పథకంలో నమోదయ్యాయి. అయితే కాచివానిసింగారం గ్రామానికి చెందిన నల్ల చాతుర్యకు మాత్రమే పౌష్టికాహారం, ఆస్పత్రి ఖర్చుల కింద రూ. 2500లు ఈ పథకం ద్వారా అందాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి సరైన మార్గదర్శకాలు విడుదల చేసి బంగారు తల్లి పథకం ఫలాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అయోమయంలో ‘బంగారు తల్లి’
Published Thu, Oct 3 2013 12:46 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement