girls welfare
-
నేషనల్ గర్ల్ చైల్డ్ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు
అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం.. ‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కుటుంబంలో స్కీమ్స్ ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్లు, వీడియోలు, రీసోర్సింగ్ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్‌వర్క్‌లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి. చట్టం.. హక్కులు సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది. నాయకత్వాన్ని పెంచుదాం అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే .. ► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి. ► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు. ► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి. ► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి. ► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి. ► రోల్ మోడల్స్‌గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి. ► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి. ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం. -
అన్నీ తెలుగు పాటలే
బాలికల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని చిత్ర పాడబోతున్నారు. ఎలెవెన్ పాయింట్ టు సంస్థ నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని వికేర్ సంస్థ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరగనుంది. ఈ సంగీత విభావరిలో శ్రీకృష్ణ, శ్రీనిధి, సోనీ వంటి పలువురు సింగర్స్ పాల్గొంటారు. ఈ సందర్భంగా చిత్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే కొన్ని పాటలు ప్రాక్టీస్ చేశాం. కొన్నిపాటలను శ్రీకృష్ణ, శ్రీనిధి, సాకేత్, సోనీ కూడా పాడతారు. మూడు గంటలపాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరికీ పరిచయం ఉన్న మ్యూజిషియన్సే పాల్గొంటారు. అన్నీ తెలుగు పాటలే ఉంటాయి. మంచి కారణం కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘భారతీయ భాషలు చేసుకున్న పుణ్యమిది. మా చిత్రమ్మగారు మంచి కార్యక్రమం చేయబోతున్నారు’’ అన్నారు శ్రీకృష్ణ. ‘‘చిత్రగారు అసోసియేట్ అయిన కార్యక్రమంలో భాగం కావడం అదృష్టం’’ అన్నారు శ్రీనిధి. సాకేత్, సోనీ మాట్లాడారు. -
అయోమయంలో ‘బంగారు తల్లి’
నమోదుపై అవగాహన కల్పించని అధికారులు అమలు చేసేదెవరో తెలియని వైనం నానా తంటాలు పడుతున్న లబ్ధిదారులు ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్ : బాలికల సంరక్షణకు బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టామని, దీనికి చట్టబద్ధత కల్పించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పథకం అమలు అయోమయంగా మారింది. పథకం విధివిధానాలు, ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సంవత్సరం మే 1 నుంచి జన్మించిన ఆడ శిశువులు అర్హులని ప్రకటించడం తప్ప, పథకానికి సంబంధించి ఏ ఒక్క అంశపై సరైన వివరణ ఇవ్వలేదు. అవగాహన లేమి... బంగారు తల్లి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలం కావడంతో లబ్ధి పొందదల్చిన వారు తమ పిల్లల పేర్లు ఎక్కడ నమోదు చేయించుకోవాలన్న దానిపై అవగాహన లేకుండా పోయింది. ఏంచేయాలో తోచక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఆలస్యమైతే పథకానికి ఎక్కడ దూరమవుతామేమోనని ఆందోళన చెందుతున్నారు. మొదట మే 1 నుంచి జూన్ 23 లోపు పుట్టిన ఆడ శిశువుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఐకేపీ మహిళాసంఘాలను ఆదేశించింది. అయితే వారికి సరైన మార్గదర్శకాలు సూచించకపోవడంతో నమోదు ప్రక్రియ ముం దుకు సాగడం లేదు. మండలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ఆడశిశువులు, వారిలో పథకానికి అర్హులైన వారి వివరాల నమోదుకు కూడా వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. నమోదులో ఇబ్బందులు... ఇదిలా ఉంటే, పథకంలో నమోదుకు 24 అంశాలను పొందుపర్చాలన్న ప్రభుత్వం నిబంధనలు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జనన ధ్రువీకరణ పత్రం, బిడ్డ, తల్లి ఫొటోలు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే చాలామంది తమ పిల్లలకు పేర్లు పెట్టరు. అలాగే బర్త్ సర్టిఫికెట్ ఆన్లైన్ చేసినందున అది అందడంలో జాప్యమవుతోంది. రేషన్‌కార్డు, ఆధార్ కార్డులో పేర్లు, ఇతర సమాచారం నమోదులో లోపాలు ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి రేషన్‌కార్డు, ఆధార్ కార్డులు కూడా లేని పరిస్థితి. ఇది కాకుండా బంగారు తల్లి పథకానికి ఎక్కడ పేరు నమోదు చేసుకోవాలి, ఎవర్ని సంప్రదించాలన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాలు, ఐసీడీఎస్, ఐకేపీ ఇలా అన్ని కార్యాలయాల్లోనూ సమాచారం కోసం అడిగినా సమాధానం లభించడం లేదు. ఇంటి దగ్గర జన్మించిన ఆడపిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని, వీరి వివరాలను అంగన్వాడీ, గ్రామ సమాఖ్యలు నమోదు చేయాలన్న ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో తల్లులు తమ చిన్నపిల్లలను ఎత్తుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగుతున్నారు. లబ్ధి పొందింది ఒక్క బంగారు తల్లి మాత్రమే... మొదట మే, జూన్ మాసాల్లో జన్మించిన ఆడ శిశువులకు మాత్రమే బంగారు తల్లి పథకం అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తదనంతరం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబంలో ఆడశిశువుకు పథకం అం దించాలని నిర్ణయించింది. సుమారు 2లక్షల జనాభా ఉన్న మండలంలో మే, జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కేవలం 58 మంది అడపిల్లల పేర్లు మాత్రమే బంగారు తల్లి పథకంలో నమోదయ్యాయి. అయితే కాచివానిసింగారం గ్రామానికి చెందిన నల్ల చాతుర్యకు మాత్రమే పౌష్టికాహారం, ఆస్పత్రి ఖర్చుల కింద రూ. 2500లు ఈ పథకం ద్వారా అందాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి సరైన మార్గదర్శకాలు విడుదల చేసి బంగారు తల్లి పథకం ఫలాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.