National Girl Child Day 2023: Generate Awareness On Importance Of Girl Education - Sakshi
Sakshi News home page

నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే: ఒక్క చిరునవ్వు... కోటి కాంతులు

Published Tue, Jan 24 2023 12:14 AM | Last Updated on Tue, Jan 24 2023 9:50 AM

National Girl Child Day 2023: Generate awareness on importance of girl education - Sakshi

అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. కూతురు అమ్మకు అమ్మ అవుతుంది. నాన్న మనసుకు కష్టం కలిగితే.. కూతురు చేయి ఓదార్పు అవుతుంది. ఈ పదేళ్లలో ప్రభుత్వాలు, ప్రజలలోనూ బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ, బాలికల హక్కులపై అవగాహన పరిమితంగానే ఉంది. బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు వారి అడుగులకు మరింత ఊతాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. ‘నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే’ సందర్భంగా ఈ విషయంపై దృష్టి సారిద్దాం..

‘కూతుళ్ళే మన భవిష్యత్తు’ అనే మాటని మన ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాలలో చెప్పడం పదే పదే విన్నాం. వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తిస్తున్నాం. ఆడపిల్లల సాధికారతకు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ‘ఆమె’ పురోగతి కి కుటుంబం, సమాజం చేయాల్సిన కృషి ఎంతో ఉంది.

కుటుంబంలో స్కీమ్స్‌
ఒకప్పుడు కూతురు ఇంటి గుండె మీద కుంపటి. ఇప్పుడు కుటుంబ సమస్యలను ఓ దరిచేర్చగల చుక్కాని. అందుకే పుట్టేది ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా ‘సరే’ అనే దిశకు కుటుంబం చేరుకుందనే చెప్పాలి. కానీ, ‘ఆమె’ పెరుగుదలలో ఇంటి నుంచే ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లితండ్రులే అమ్మాయిలను ప్రోత్సహించడానికి స్కీమ్స్‌ పెడుతుండాలి. ఆమె కలలకు, ఆశయాలకు మద్దతునివ్వాలి. ఎలాంటి సమస్య అయినా ‘పరువు’ అనే భయంతో కాకుండా బలమైన వెన్నుగా నిలవాలి.

డిజిటల్‌ జనరేషన్, అవర్‌ జనరేషన్‌
ఈ నినాదం ఇప్పుడు బాలికలకు అత్యవసరమైనది. డిజటల్‌ యుగంలో ‘ఆమె’కు వాటి వినియోగంలోనూ పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు డిజిటల్‌ పరికరాల వాడకంలో వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. డిజిటల్‌ మాధ్యమం ద్వారా అమ్మాయిలను ప్రభావంతంగా మార్చే మానవ ఆసక్తి కథనాలు, బ్లాగ్‌లు, వీడియోలు, రీసోర్సింగ్‌ చేసే స్ఫూర్తిదాయకమైన నెట్‌వర్క్‌లు, సంస్థల గురించి తెలుసుకునే అవకాశాలను కల్పించాలి.

చట్టం.. హక్కులు
సమాజంలో ధైర్యంగా, శక్తిమంతంగా ఎదిగేందుకు ఆమె చుట్టూ ఉన్న రక్షణ, న్యాయ వ్యవస్థల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కుటుంబంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది.  

నాయకత్వాన్ని పెంచుదాం
అవగాహన ‘ఆమె’కు అవకాశాలను విస్తృతం చేస్తుంది. నాయకత్వాన్ని ఎంచుకునేలా ఎదగాలంటే ..
► మన ప్రాంతంలోని అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాల గురించి అవగాహన పెంపొందించడంలో, వాటిని పరిష్కరించడంలో ముందుండాలి.
► బాలికలకు అందాల్సిన సేవలను మరింతగా బలోపేతం చేయాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా వారి నాయకత్వం, చర్యలు, ప్రభావాన్ని సమష్టిగా విస్తరింపజేయాలి.
► ప్రపంచవ్యాప్తంగా బాలికలు లింగ అసమానత, వివక్షకు గురవుతున్నారనేది వాస్తవం. ఇవి బాలికలను ప్రతిచోటా వెనకడుగు వేయిస్తున్నాయి. అందుకే లైంగిక వేధింపులు, హింస, అసమానతలు, హక్కుల గురించి అవగాహన కల్పించడంలో వెనకంజ వేయకూడదు.
► విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతలను తెలియజేయడమే కాదు వాటిని అందించడంలోనూ ముందంజలో ఉండాలి.
► అమ్మాయిలు తమలోని ప్రతిభను కనబరచడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో జీవించే అవకాశాన్ని కల్పించాలి.
► చాలా ప్రాంతాలలో అమ్మాయిలను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. అయినా, ఎలాంటి హింస జరిగినా ఆడపిల్లలకు తమ గొంతు వినిపించే హక్కు ఉంది. ఈ విషయాన్ని వారికి తప్పక తెలియజేయాలి.
► రోల్‌ మోడల్స్‌గా ఉన్నవారిని బాలికలకు పరిచయం చేయిస్తూ ఉండాలి. బాలికా నాయకత్వం పట్ల ప్రజలలో అవగాహనను పెంచాలి.
► అలజడులు, వలసలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సామాజిక సహాయ సేవలను పొందుతున్నప్పుడు బాలికలు అనుభవించే అసమానతలను పరిష్కరించడానికి అధికారులు, విధాన నిర్ణేతలు మరింత గా దృష్టి సారించాలి.


ఒక ఆడపిల్ల తన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పేది ఆమె. కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేసే స్వచ్ఛమైన ఆత్మ. కాబట్టి ప్రతి ఇంటినీ తన నిస్వార్థ ప్రేమతో, ప్రకాశంతమైన కాంతితో నింపే ఆమె భవిష్యత్తును ఉజ్వలం చేద్దాం. సమాజంలో సమానమైన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement