ఆడపిల్లలను పోషించలేమని..!
* పసికందును వదిలించుకున్న దంపతులు
* ఎస్‌ఐ, సర్పంచ్ చొరవతో తిరిగి తల్లి చెంతకు..
ఖిల్లాఘనపురం: ఆడపిల్లల పోషణ భారమని భావించిన ఓ పేద తల్లిదండ్రులు తమ నెల వయసు ఉన్న పసికందును వదిలేసివెళ్లారు. మాతృప్రేమకు మచ్చతెచ్చిన ఈ సంఘటన సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఆముదంబండ తండాకు చెందిన కేతావత్ దేవి, సూర్యకు మొదటి సంతానంగా కూతురు జన్మించింది. ఇటీవల రెండోకాన్పులోనూ ఆడకూతురే పుట్టింది.
వంశోద్ధారకుడు పుట్టలేదని వారు కలతచెందారు. కన్న మనసును చంపుకోలేక.. సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి ఖిల్లాఘనపురం వచ్చి ఓ ఇంటి ఆవరణలో ఆ పసిగుడ్డును వదిలేసివెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ మశ్చందర్‌రెడ్డి, సర్పంచ్ సౌమ్యానాయక్, వైద్యాధికారి అక్కడికి చేరుకుని శిశువును చేరదీశారు.
ఇదిలాఉండగా, అక్కడే స్థానిక బస్టాండ్‌లో ఒంటరిగా దిగాలుగా కూర్చున్న దేవిని ఆరాతీయగా.. ఆ పసికందు తనకూతురేనని కంటతడిపెట్టింది. ఆడపిల్లలను పోషించలేమనే భారంతోనే ఇలా వదిలించుకున్నట్లు తెలిపింది. బంగారుతల్లి పథకం ద్వారా ఆర్థికసహాయం అందించేందుకు తమవంతు ప్రయత్నిస్తామని వారు నచ్చజెప్పి పాపను తిరిగి తల్లికి అప్పగించారు.