‘బంగారుతల్లి’కి భరోసా ఏదీ?
సామాజిక భద్రత కొరవడిన ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు‘బంగారుతల్లి’ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చదువుసంధ్యల ఖర్చంతా భరిస్తామని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ పథకానికి తమ ‘ముద్ర’ వేసుకొనేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ఈ పథకం వల్ల జిల్లాలో ఒక్కరికీ లబ్ధి చేకూరలేదంటే.. పాలకులు, అధికార యంత్రాంగం తీరు ఏపాటిదో అవగతమవుతోంది.
సాక్షి, రాజమండ్రి :గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బంగారుతల్లి పథకం జిల్లాలో మూలనపడింది. ఈ పథకం ప్రారంభం నుంచీ ఇప్పటివరకు సగం మందికి కూడా లబ్ధి చేకూరకపోగా, ఈ ఏడాది ఒక్క ‘బంగారు తల్లి’కి ప్రయోజనం అందలేదు. నమోదు చేసుకున్న లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఎప్పుడు సాయం మంజూరు చేస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి ‘పచ్చరంగు’ పులిమేందుకు యత్నిస్తోంది. బినామీ లబ్ధిదారులు అన్న సాకుతో గత ప్రభుత్వం గుర్తించిన వారిపై అనర్హత వేటు వేయాలని చూస్తోంది. తద్వారా తెలుగు తమ్ముళ్లు సూచించిన వారినే సిసలైన లబ్ధిదారులుగా చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాక పథకం పేరు కూడా మార్పు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తమ మార్కు సంస్కరణలు అమల్లోకి వచ్చేవరకు త పథకాన్ని పెండింగ్‌లో పెట్టింది.
పథకం ఉద్దేశమిది..
జిల్లాలో గతేడాది మే ఒకటిన ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే దరఖాస్తు చేసుకుంటే రూ.2,500 బ్యాంకు ఖాతాలో తొలివిడతగా జమ చేస్తారు. రెండేళ్ల పాటు టీకాలు, పుట్టిన రోజు వేడుకలు వంటి ఖర్చుల కోసం ఏడాదికి రూ.వెయ్యి వంతున జమ చేస్తారు. మూడు, నాలుగు, ఐదో ఏడాదిలో రూ.1,500 వంతున, ఆరు నుంచి 15 ఏళ్ల వయసులో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి చదివించేందుకు ఏడాదికి రూ.2 వేలు, 11 నుంచి 13 ఏళ్ల వరకు హైస్కూలు చదువు కోసం ఏడాదికి రూ.2,500 వంతున, తొమ్మిది, పది తరగతులకు రూ.3 వేల వంతున చెల్లిస్తారు. ఇంటర్మీడియట్‌కు రూ.3,500 వంతున, 18 నుంచి 21 ఏళ్లలో డిగ్రీ చదువులకు ఏడాదికి రూ.4 వేల వంతున ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే రూ.50 వేలు, డిగ్రీ పూర్తయిన వెంటనే రూ.లక్ష బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ బాండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు.
జిల్లాలో అమలు ఇలా..
జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పథకం ప్రారంభం నుంచి 25,376 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 12 వేల మందికి మాత్రమే తొలివిడత సాయం బ్యాంకుల్లో జమ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 51 మండలాల్లో 7,836 మంది, రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలు సహా మున్సిపాలిటీల్లో 711 మంది నమోదు చేసుకోగా, నేటికీ వీరికి బాండ్లు ఇవ్వలేదు. తొలి విడత నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. వెరసి ఒక్కరికి కూడా ఈ పథకం లబ్ధి చేకూరలేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. వారి మాటల సారాంశం.. బంగారుతల్లి పథకం పేరును కూడా ప్రభుత్వం మార్చేందుకు చూస్తోంది. లబ్ధిదారులను కూడా జల్లెడ పట్టిన తర్వాతే పథకం మళ్లీ
అమలవుతుంది.