ప్రజలందరి ఆకలిని తీర్చే తిండిగింజలను సృష్టించేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడు. అతడి శ్రమకు వరుణుడి కరుణ తోడైతేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. కానీ, వరుసగా మూడేళ్ల నుంచి.. రైతుకు అవసరమైన ప్రతిసారీ వరుణుడు ముఖం చాటేస్తూనే ఉన్నాడు. దీంతో ‘ఆకాశగంగ’ను నమ్ముకుని లాభం లేదనుకున్న రైతులు.. నేలతల్లి గర్భంలోని పాతాళగంగను ఒడిసిపట్టి.. పంటచేలల్లో ప్రవహింపజేసి.. సిరులు పండిస్తున్నారు. అయితే ఇందుకు ఉచిత విద్యుత్‌ను అదుపు లేకుండా వాడేస్తున్నారని, దీనివల్ల సరఫరాకు, వినియోగానికి మధ్య అంతరం పెరిగిపోతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, రాజమండ్రి :జిల్లాలో మూడేళ్లుగా సాగు ఆరంభంలో వర్షాభావం ఏర్పడడం, వ్యవసాయ అవసరాలు తీరిన తర్వాత వానలు పడుతూండడంతో రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతిపై ఆధారపడడం తగ్గించి, అందుబాటులో ఉన్న కరెంటు మోటారును నమ్ముకోవడం ప్రారంభించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగంలో 80 శాతం ఉచితంగా ఇస్తారు. దీంతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వ్యవసాయ రంగంలో విద్యుత్తు వాడకం పెరిగిపోతోంది. ఈ పరిస్థితి విద్యుత్ సరఫరాకు, వినియోగానికి మధ్య అంతరాన్ని సృష్టిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఉచిత విద్యుత్ వాడకాన్ని అదుపు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ విద్యుత్ వినియోగంపై నిఘా ఉంచాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ వినియోగ వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
‘ఉచిత’ వినియోగం జరుగుతోందిలా..
సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం ఉంటుంది. జిల్లాలో మొత్తం 42 వేల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. వీటికింద ఏటా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తారు. కానీ, దీనిని మించి ఉచిత విద్యుత్ వినియోగం జరుగుతోందని అధికారులు గుర్తించారు. 2013లో నవంబర్ నాటికి 257 మిలియన్ యూనిట్ల వినియోగం జరగగా, అది 2014లో నవంబర్ నాటికి 357 మిలియన్ యూనిట్లకు పెరిగింది. వచ్చే మార్చి నాటికి ఈ వినియోగం 408 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగాన్ని కట్టడి చేసే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటికే విద్యుత్తు శాఖ ఎనర్జీ ఆడిట్ విభాగం జిల్లాలోని వ్యవసాయ విద్యుత్తు వినియోగం, ఉన్న కనెక్షన్లు, పెరుగుదల శాతాల గణాంకాలను సేకరించినట్టు తెలిసింది. అలాగే వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగంపై నిఘా పెట్టాలని అధికారులకు కూడా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే వినియోగం పెరుగుతున్న తీరును గమనించి అందుకు అనుగుణంగా అదుపు చేసేందుకు చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఉచిత కరెంటుకు కళ్లెం
Published Wed, Jan 21 2015 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement
Advertisement