చేయూత కాదు..చెంపపెట్టు | tdp government Dwarka loans Waived | Sakshi
Sakshi News home page

చేయూత కాదు..చెంపపెట్టు

Published Mon, Dec 15 2014 12:01 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

చేయూత కాదు..చెంపపెట్టు - Sakshi

చేయూత కాదు..చెంపపెట్టు

 చూడబోతే తెలుగుదేశం ప్రభుత్వం.. మాట ఇచ్చి, పాటించకపోవడంలో రికార్డు స్థాపించే ఊపులో ఉన్నట్టుంది. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ నుంచి పింఛన్ల పెంపు వరకూ చెప్పిందొకటి, చేతల్లో చూపింది వేరొకటి. ప్రభుత్వ సారథులు ప్రజలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని గప్పాలు కొట్టుకోవచ్చు గాక.. వాస్తవం ఏమిటన్నది ఆయా వర్గాల నిట్టూర్పుల్లోనే మార్మోగుతోంది. టీడీపీ వచ్చాక మహిళా సంఘాల ఒడిదుడుకులే అందుకు తిరుగులేని నిదర్శనం.
 
 సాక్షి, రాజమండ్రి :డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీని ఈ ప్రభుత్వం ‘ఎండమావి’లో నీటిమాదిరి మార్చేసింది. ఈ హామీ వల్ల మహిళలకు ఒరిగింది శూన్యం కాగా ప్రభుత్వం మాత్రం రుణ మాఫీ చాటున మిగిలిన ప్రయోజనాలకు మంగళం పాడుతోంది. ఈ క్రమంలోనే మహిళా సాధికారత కోసం ప్రవేశ పెట్టిన వడ్డీలేని రుణాల పథకం ఈ ఏడాది అందని ద్రాక్షే అవుతోంది. ప్రధానంగా జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మహిళా సంఘాలకు రవ్వంత మేలు జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేసి, పథకాన్ని సమర్థంగా అమలు చేశారు. ఆయన తర్వాత 2012లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ప్రతినెలా 15లోగా రుణవాయిదా చెల్లిస్తే వారి అప్పులపై వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. అప్పటి నుంచి 2013-14 వరకూ నామమాత్రంగా కొనసాగిన పథకం 2014-15 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా కుంటు పడింది.
 
 లబ్ధి తగ్గిపోతోంది..
 ఏజెన్సీ ప్రాంతంలోని ఏడు గిరిజన మండలాల్లో 120 పంచాయతీల పరిధిలోని 663 గ్రామాల్లో 4,569 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 46,357 మంది సభ్యులు ఉన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 2000 సంఘాల సభ్యులు రూ.69.91 లక్షల మేర వడ్డీలేని రుణాలు పొందారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో అది కూడా గగనమే అయింది. ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన వాటితో కలిపి ఈ ఏడాది ఏజెన్సీలో మండలాల సంఖ్య 11కు చేరింది. వీటిలో 183 పంచాయతీలు, 1003 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 7,273 మహిళా శక్తి సంఘాల్లో 75,256 మంది సభ్యులుగా ఉన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి 1125 సంఘాలకు కేవలం రూ.7.91 లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం లభించింది.
 
 ముంచిన మాఫీ హామీ..
 ఒక పక్క వడ్డీలేని  రుణాలు సక్రమంగా అందక గిరిజనమహిళలు నిరాశ పడుతుంటే.. టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ హామీ మహిళా సంఘాలను నిండా ముంచింది. రుణ మాఫీ లభిస్తుందని రుణాలు పొందిన సంఘాలు గత జూన్ నుంచి బ్యాంకు అప్పులు కట్టడం మానేశారు. దీంతో అర్హత ఉన్న సంఘాలు కూడా వడ్డీ మాఫీ పొందలేక పోయాయి. అపరాధ రుసుంతో కలిపి బ్యాంకులు వీరి నుంచి 14 శాతం వడ్డీని గుంజుతున్నాయి. కట్టక పోతే చర్యలంటూ నోటీసులు జారీ చేస్తున్నాయి. విలీన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరిలో కలిసిన నెల్లిపాక, కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం మండలాల్లో ఇందిరా క్రాంతి పథం కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడ్డాయి. బ్యాంకులు ఇక్కడి వారి నుంచి అప్పులు రాబట్టుకునేందుకు రంగంలోకి దిగుతున్నాయి.
 
 బ్యాంకు లింకేజి కూడా అధ్వానమే..
 మహిళా సంఘాలకు లభిస్తున్న బ్యాంకు లింకేజి కూడా ఈ ఏడాది కనీసస్థాయికి చేరుకుంది. గత ఏడాది 1903 సంఘాలకు రూ.27 కోట్లు లభించాల్సి ఉండగా 1052 సంఘాలకు రూ.19 కోట్లు మాత్రం లభించింది. ఈ ఏడాది 3376 గ్రామాలకు రూ.66.18 కోట్లు బ్యాంకు లింకే జి ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటికి 240 సంఘాలకు రూ. 4.5 కోట్లు మాత్రమే ప్రభుత్వం అందించింది. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి ఈ ఆర్థిక సంవత్సరం చివ రినాటికి మరో 10 శాతం లబ్ధి కూడా మహిళా సంఘాలకు లభించే అవకాశం లేదని చెబుతున్నారు. మహిళాభ్యున్నతి అంటూ నమ్మించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక.. తమ సంఘాల దారిలో ముళ్లు పరిచిందని ఏజెన్సీలోని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement