పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యమేలుతున్నారు | YSRCP MLA Raghu Rami Reddy Slams On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యమేలుతున్నారు

Published Wed, Aug 22 2018 8:32 AM | Last Updated on Wed, Aug 22 2018 8:32 AM

YSRCP MLA Raghu Rami Reddy Slams On Chandrababu Naidu - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, చిత్రంలో సురేష్‌బాబు

కడప కార్పొరేషన్‌: తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యమేలుతోందని మైదుకూ రు శాసనసభ్యులు ఎస్‌. రఘురామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు విమర్శించారు. మంగళవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.  మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అరాచకాలు, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. యనమల రామక్రిష్ణుడు బంధువని అధికారులు ఆయన ఎలా చెబితే అలా ఆడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 19వ తేది పలుగురాళ్లపల్లెలో మైనార్టీలు, దళితులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరి మైదుకూరులో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారని, దాన్ని ఓర్వలేని టీడీపీ నాయకులు వారిని బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. మైదుకూరు పట్టణమంతా టీడీపీ వారు ఫ్లెక్సీలు వేసుకుంటే తొలగించని పోలీ సులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఒక్క ఫ్లెక్సీ ఏర్పా టు చేసుకుంటే తొలగించాలని చెప్పడం అన్యాయమన్నారు. పోలీసులు దగ్గరుండి ఆ ఫ్లెక్సీని తొలగించారన్నారు.

దీన్ని నిరసిస్తూ తాము ఆందోళన చేస్తే మైదుకూరు సీఐ ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను బండబూతులు తిడుతూ బెదిరించారని, ఆయనకు ఆ పవర్‌ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సీఐ పొగరుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన చర్యలను బట్టి తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ లో చేరిన వారు రూ.72వేలు  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ తీసుకున్నారని, దాన్ని తిరిగి ఇవ్వాలని సుధాకర్‌యాదవ్‌ మనుషులు బెదిరించడం సరికాదన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వాళ్ల అబ్బ సొత్తా...అది ప్రభుత్వ సొమ్ము కదా...దాన్ని కూడా రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు.

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గంలో రూ.4కోట్లు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలన్నీ పోలీసుల పహారాలోనే సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ నాయకులు మాబూసాబ్, మున్నా మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా వచ్చిన రూ.72వేలు కట్టి పార్టీ మారాలని టీడీపీ వారు తమను బెదిరించారని, డబ్బులు ఇవ్వపోతే గుడ్డలిప్పదీసి కొడతామని హెచ్చరించారన్నారు. మైదుకూరులో ముస్లిం మైనా ర్టీలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అఫ్జల్‌ఖాన్, తుమ్మలకుంట శివశంకర్, నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, మైనార్టీ నాయకులు ఖాదర్‌బాషా, షరీఫ్, వలీ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement