సుండుపల్లె ప్రాంతంలో అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి మ్యాప్
సాక్షి కడప: ఎవరిని కదిపినా కన్నీరే. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బును అగ్రిగోల్డ్‌లో దాచితే.. అప్పనంగా కాజేసి యాజమాన్యం కనుమరుగైంది.సొమ్ము కనబడకపోయే సరికి బాధితుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నా ఏమి చేయలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో లక్షల మంది కట్టిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడేళ్ల కిందట ఆందోళన నిర్వహించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒకవైపు బా«ధితులు న్యాయపోరాటం చేస్తూనే..ఇంకోవైపు ఆందోళనలు సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో జిల్లాలో అగ్రిగోల్డ్ స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్థలాలను స్వాధీనం చేసుకుని వెంటనే డిపాజిట్లు అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తాలు అందించడంలో ఆలస్యం అయ్యేకొద్ది వీరిలో అలజడి పెరిగిపోతోంది. ఇప్పటికే 17 మంది డిపాజిట్‌దారులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
జిల్లాలో భారీగా డిపాజిట్ దారులు
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన డిపాజిట్‌దారులు అధిక సంఖ్యలో ఉన్నారు. పది నియోజకవర్గాల్లో దాదాపుగా 1.18 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యవహారం రెండు, మూడేళ్లుగా నానుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో డిపాజిట్ వెనక్కి వస్తుందా, రాదా అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. జిల్లాలో డిపాజిట్‌దారులతోపాటు ప్రత్యేకంగా ఏజెంట్లు కూడా 4500–5000 మంది ఉన్నారు. ఏడు బ్రాంచ్‌ల పరిధిలో ఎప్పటికప్పుడు ఏజెంట్లు డిపాజిట్లు చేయిస్తూ వచ్చారు. సుమారు రూ. 130 కోట్ల డిపాజిట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎదురుచూపులు
అగ్రిగోల్డ్ సంస్థ 2015 జనవరి 4వ తేదీన బోర్డు తిప్పేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జనాలు పెట్టిన పెట్టుబడి ఎప్పుడు వెనక్కి ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయగా, తర్వాత అదిగో..ఇదిగో అంటూ ఏదో ఒక సాకుతో కాలాన్ని సాగదీస్తుందే తప్ప చిత్తశుద్దితో వెంటనే డిపాజిట్లు అందించే చర్యలు చేపట్టడం లేదని బాధితులు మండిపడుతున్నారు. 2015 నుంచి డిపాజిట్ సొమ్ముల కోసం ఏజెంట్లతోపాటు డిపాజిట్ దారులకు నిరీక్షణ తప్పలేదు.
కొనసాగుతున్న ఆందోళనలు
జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎప్పటికప్పుడు ఆందోళనబాట పడుతున్నారు. బాధితుల కమిటీ పిలుపు మేరకు 2015 నుంచి ఇప్పటివరకు పోరు సాగిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, కలెక్టరేట్ వద్ద దీక్షలు సాగిస్తూనే ఉన్నారు. నాలు గురోజుల కిందట ఏకంగా కడపలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు గుండు గీయిం చుకొని నిరసన చేపట్టారు. మూడేళ్లుగా న్యాయం కోసం ఉద్యమ పంథాను కొనసాగిస్తున్నారు.
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తోంది. విజయవాడలో దీక్ష చేసే సమయంలో కూడా పార్టీ కీలక నేతలు వెళ్లి పరామర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రస్తుత టీడీపీ సర్కార్ బాధితుల సొమ్ము పట్ల నిర్లక్ష్యం వహిస్తే..అధికారంలోకి రాగానే వెంటనే డిపాజిట్లు వెనక్కి ఇస్తామని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనలకు ఎప్పటికప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి ఉద్యమంలో పాలుపంచుకుంటోంది. మొత్తం సొమ్ము అందించేవరకు అండగా ఉండాలని నిర్ణయించి.. ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘాన్ని కూడా వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసింది.
అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా డిపాజిట్లు చెల్లిస్తాం
అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారు. మంత్రి లోకేష్, ఎంపీలు సుజనాచౌదరి, మురళీమోహన్‌లకు విలువైన అగ్రిగోల్డ్ ఆçస్తులను కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుందే తప్ప చిత్తశుద్ధితో సీఎం వ్యవహరించడం లేదు. బినామీ ద్వారా కోర్టులో పిల్ వేయించి ఆస్తులు ఇస్తామని మభ్య పెడుతున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం కాలాయాపన చేస్తుందే తప్ప డిపాజిట్ దారులకు న్యాయం చేయడం లేదు. వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని..వెయ్యి కోట్లు యుద్ధప్రాతిపదికన అందించాలి. బాధితులను ఆదుకోవాలనే స్పృహ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి ప్రాధాన్యత కింద డిపాజిట్‌దారులకు డిపాజిట్లు అందజేస్తాం. – కె.సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment