నీరు పుష్కలం.. ప్రాజెక్టు నిష్ఫలం | TDP government neglected the water projects | Sakshi
Sakshi News home page

నీరు పుష్కలం.. ప్రాజెక్టు నిష్ఫలం

Published Mon, Aug 26 2019 5:06 AM | Last Updated on Mon, Aug 26 2019 5:06 AM

TDP government neglected the water projects - Sakshi

అట్లూరు మండలంలో స్ట్రక్చర్స్‌ నిర్మించని తెలుగుగంగ కుడి కాలువ

సాక్షి ప్రతినిధి కడప: తెలుగుగంగ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు విడుదల చేసినా.. బద్వేలు, మైదుకూరు నియోకవర్గాల్లోని ఆయకట్టుకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం అట్లూరు, పోరుమామిళ్ల, కలసపాడు, గోపవరం ప్రాంతాల్లోని ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు తదితర పనులకు కేవలం రూ. 50 కోట్లు కూడా విడుదల చేయలేదు. వైఎస్సార్‌ కడప జిల్లాలో తెలుగుగంగ ›ప్రాజెక్టులో అంతర్భాగమైన 2.133 టీఎంసీల సామర్థ్యం కలిగిన అనుబంధ రిజర్వాయర్‌(ఎస్‌ఆర్‌–1), 2.444 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్‌ఆర్‌–2ల తో పాటు 17.730 టీఎంసీల సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ను నీటితో నింపాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పెండింగ్‌ పనులు పూర్తి కాకపోడంతో ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి కనిపించడంలేదు.  ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

టీడీపీ ప్రభుత్వ మొండిచేయి
రూ. 50 కోట్ల ఖర్చుతో పూర్తి చేయాల్సిన ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు పనులను టీడీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మైదుకూరు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో 30వ కిలోమీటరు నుండి 45వ కిలోమీటరు వరకు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. కాశినాయన మండలంలో ఎనిమిది పిల్లకాలువల్లో కంపచెట్లు పెరిగాయి. పోరుమామిళ్ల చెరువునుండి ఎడమకాలువను కలిపే అప్రోచ్‌ కెనాల్‌ పనులు నిలిచి పోయాయి. పోరుమామిళ్ల బ్లాక్‌–9 పరిధిలో 9ఏకు సంబంధించి 3.7 కిలోమీటర్లు, చింతలపల్లి నుంచి మార్కాపురం మీదుగా ముద్దంవారిపల్లె వరకు జరగాల్సిన 1.7 కిలోమీటర్ల పనులు మొదలు కాలేదు. 9–బి బ్లాక్‌ పరిధిలో 2.5 కిలోమీటర్లు, చింతలపల్లి కాలువ కట్ట మీదుగా కట్టకిందపల్లి వరకు 2.5 కిలోమీటర్లు కాలువ పనులకుగాను 1.8 కిలోమీటర్లు పనులు జరగాల్సిఉంది. 9–బి బ్లాక్‌ పరిధిలో దమ్మనపల్లె నుంచి వీధుళ్లపల్లె మీదుగా రెడ్డికొట్టాల వరకు 7.8 కిలోమీటర్ల కాలువ పనులకు గాను 3.2 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 9–ఎఫ్‌ పరిధిలో రామాయపల్లెవద్ద 8.5 కిలోమీటర్ల కాలువ పనులు  జరగాల్సి ఉండగా ఏడు కిలోమీటర్ల మేర పనులు వెక్కిరిస్తున్నాయి. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు  పనులు పూర్తిచేయాల్సి ఉన్నా అర్ధంతరంగా వదిలేశారు. 

కలసపాడు మండలం అక్కివారిపల్లె వద్ద కంపచెట్లతో నిండిపోయిన కాలువ 

నీళ్లొచ్చినా ఆయకట్టుకు అందని దుస్థితి
ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు నిండి తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కొన్ని రోజుల్లో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరుతుంది. అయితే పనులు  పూర్తికాక పోవడంతో వైఎస్‌ హయాంలో పూర్తి చేసిన పనుల పరిధిలో 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పనులు పూర్తి చేసిఉంటే బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నదాతలు చెబుతున్నారు.

రూ.300 కోట్లతో నీళ్లందించిన వైఎస్సార్‌
బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే దృక్పథంతో 2005లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. వెంటనే రూ. 300 కోట్లతో ప్రధాన పనులను పూర్తిచేసి మూడోవంతు భూమికి సాగునీరందించి రైతుల్లో ఆనందం నింపారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 

ప్రయోజనం సున్నా
తెలుగుగంగ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కాలువకు నీళ్లు వదులుతున్నా పొలాలకు మాత్రం నీరు రావడం లేదు. ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలే అవకాశమున్నా పిల్లకాలువలను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. దీంతో రైతుల పొలాలకు నీళ్లు అందే అవకాశం లేదు. 
– వెంకటనారాయణ రెడ్డి, మిద్దెల, కాశినాయన మండలం

పిల్లకాలువలు అధ్వానంగా ఉన్నాయి
చాలా ప్రాంతాల్లో పిల్ల కాలువలు నిర్మించలేదు. కొన్ని చోట్ల నిర్మించినా కంపచెట్లు పెరిగి అధ్వానంగా మారాయి. నీళ్లు వదిలినా పొలాలకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఐదారేళ్లుగా ప్రధాన కాలువలకు నీళ్లు వదులుతున్నా చాలా తక్కువగా వస్తున్నాయి. 
– మునిరెడ్డి, మామిళ్లపల్లె, కలసపాడు మండలం, వైఎస్సార్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement