Brahmam Sagar
-
తెలుగు గంగ.. ఆయకట్టు మురవంగ
సాక్షి, అమరావతి: తెలుగు గంగ (టీజీ) ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో గల 5.75 లక్షల ఎకరాలకు పూర్తిగా నీళ్లందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడం.. బ్రహ్మం సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకపోవడం.. డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతం 4,28,846 ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి. మిగిలిన 1,46,154 ఎకరాలకు నీళ్లందడం లేదు. పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా నీళ్లందని ఆయకట్టునూ సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఇప్పటికే రూ.152.90 కోట్లను ఖర్చు చేసింది. మిగతా పనులను వచ్చే సీజన్‌లోగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. లక్ష్యం ఇదీ: కృష్ణా, పెన్నా నదుల వరద జలాల్లో 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగు గంగ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ 7.80 కిలోమీటర్ల పొడవున నిర్మించిన లింక్ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం.. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ వరకూ 18 కిలోమీటర్ల పొడవున తవ్విన ప్రధాన కాలువ సక్రమంగా లేకపోవడం, బ్రహ్మం సాగర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 17.745 టీఎంసీలను నిల్వ చేయకపోవడం.. డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతం 4,28,846 ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి. పూర్తి ఆయకట్టుకు నీళ్లందించే దిశగా.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల 8 వేల క్యూసెక్కులు కూడా ప్రవహించడం లేదు. దాంతో 16.95 టీఎంసీల సామర్థ్యం ఉన్న వెలిగోడు రిజర్వాయర్‌ను వేగంగా నింపలేని దుస్థితి నెలకొంది. వెలిగోడు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు. కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల కనీసం 3,500 క్యూసెక్కులను కూడా తరలించలేని పరిస్థితి. దాంతో 17.745 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్రహ్మం సాగర్‌ను వేగంగా నింపడం సాధ్యకావడం లేదు. ఈ నేపథ్యంలో కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచటం ద్వారా రిజర్వాయర్లను శరవేగంగా నింపేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి మిగతా 1,46,154 ఎకరాలకు నీళ్లందించాలని దిశానిర్దేశం చేశారు. దాంతో ఈ కాలువ లైనింగ్ పనులను రూ.280 కోట్లతో చేపట్టారు. తెలుగు గంగ కాలువలో ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకూ నీటి ప్రవాహం ఉంటుంది. 4 నెలలు మాత్రమే పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రబీలో ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించిన అధికారులు.. వేగంగా పనులు చేస్తున్నారు. బ్రహ్మం సాగర్‌ను పటిష్టం చేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసేలా చర్యలు తీసుకంటున్నారు. డిస్ట్రిబ్యూటరీల పనులనూ వేగవంతం చేశారు. -
ఉద్యోగాల కోసం నిరీక్షణ
సాక్షి, బ్రహ్మంగారిమఠం (కడప): తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్రహ్మంగారిమఠం సమీపంలోని ఓబులరాజుపల్లె పంచాయతీలోని 6 గ్రామాలు సాగర్‌లో ముంపునకు గురయ్యాయి. 1983– 1987లో ఆ గ్రామాల పరిధిలో 1980 కుటుంబాలకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అవార్డులు పొందిన కుటుంబాలలో చదువుకున్నవారికి నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. అవార్డులు పొందిన వారిలో చదువుకోనివారు ఉంటే అలాంటి కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కింద 5ఎకరాలు వ్యవసాయపొలం, ఇళ్లు వంటివి కేటాయించారు. అప్పటి ప్రభుత్వం కేవలం 480 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించింది. 2005లో ముంపు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన వైఎస్సార్ నిబంధనల ప్రకారం నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని అప్పటి కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో అప్పట్లో అధికారులు నిరుద్యోగుల జాబితా తయారు చేశారు. అయ్యినా నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు దక్కలేదు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 420 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు బ్రహ్మంసాగర్ ముంపు వాసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీఓలు ఉన్నా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముంపు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయి. చివరకు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. – రాజోలి జగన్నాథరెడ్డి (సాగర్ ముంపు నిరుద్యోగ కమిటీ చైర్మన్ బి.మఠం మండలం) అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు గత మూడు సంవత్సరాలుగా తెలుగుగంగ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏఒక్క అధికారి స్పందించడంలేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగం కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. చదువుకున్నా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – బి.రామసుబ్బయ్య (కమిటీ వైస్‌చైర్మన్, బి.మఠం మండలం) ముఖ్యమంత్రిపైనే ఆశలు పెట్టుకున్నాం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మంసాగర్ ముంపు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నాం. మా సమస్యలు ముఖ్యమంత్రికి తెలుపుకొనేందుకు అధికారులు అవకాశం కల్పించాలి. – యు.పెంచలరత్నం( సాగర్ ముంపు నిరుద్యోగి) -
నీరు పుష్కలం.. ప్రాజెక్టు నిష్ఫలం
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుగంగ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు విడుదల చేసినా.. బద్వేలు, మైదుకూరు నియోకవర్గాల్లోని ఆయకట్టుకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం అట్లూరు, పోరుమామిళ్ల, కలసపాడు, గోపవరం ప్రాంతాల్లోని ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు తదితర పనులకు కేవలం రూ. 50 కోట్లు కూడా విడుదల చేయలేదు. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుగంగ ›ప్రాజెక్టులో అంతర్భాగమైన 2.133 టీఎంసీల సామర్థ్యం కలిగిన అనుబంధ రిజర్వాయర్(ఎస్ఆర్–1), 2.444 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్ఆర్–2ల తో పాటు 17.730 టీఎంసీల సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌ను నీటితో నింపాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పెండింగ్ పనులు పూర్తి కాకపోడంతో ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ మొండిచేయి రూ. 50 కోట్ల ఖర్చుతో పూర్తి చేయాల్సిన ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు పనులను టీడీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మైదుకూరు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో 30వ కిలోమీటరు నుండి 45వ కిలోమీటరు వరకు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. కాశినాయన మండలంలో ఎనిమిది పిల్లకాలువల్లో కంపచెట్లు పెరిగాయి. పోరుమామిళ్ల చెరువునుండి ఎడమకాలువను కలిపే అప్రోచ్ కెనాల్ పనులు నిలిచి పోయాయి. పోరుమామిళ్ల బ్లాక్–9 పరిధిలో 9ఏకు సంబంధించి 3.7 కిలోమీటర్లు, చింతలపల్లి నుంచి మార్కాపురం మీదుగా ముద్దంవారిపల్లె వరకు జరగాల్సిన 1.7 కిలోమీటర్ల పనులు మొదలు కాలేదు. 9–బి బ్లాక్ పరిధిలో 2.5 కిలోమీటర్లు, చింతలపల్లి కాలువ కట్ట మీదుగా కట్టకిందపల్లి వరకు 2.5 కిలోమీటర్లు కాలువ పనులకుగాను 1.8 కిలోమీటర్లు పనులు జరగాల్సిఉంది. 9–బి బ్లాక్ పరిధిలో దమ్మనపల్లె నుంచి వీధుళ్లపల్లె మీదుగా రెడ్డికొట్టాల వరకు 7.8 కిలోమీటర్ల కాలువ పనులకు గాను 3.2 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 9–ఎఫ్ పరిధిలో రామాయపల్లెవద్ద 8.5 కిలోమీటర్ల కాలువ పనులు జరగాల్సి ఉండగా ఏడు కిలోమీటర్ల మేర పనులు వెక్కిరిస్తున్నాయి. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాల్సి ఉన్నా అర్ధంతరంగా వదిలేశారు. కలసపాడు మండలం అక్కివారిపల్లె వద్ద కంపచెట్లతో నిండిపోయిన కాలువ నీళ్లొచ్చినా ఆయకట్టుకు అందని దుస్థితి ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు నిండి తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కొన్ని రోజుల్లో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరుతుంది. అయితే పనులు పూర్తికాక పోవడంతో వైఎస్ హయాంలో పూర్తి చేసిన పనుల పరిధిలో 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పనులు పూర్తి చేసిఉంటే బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నదాతలు చెబుతున్నారు. రూ.300 కోట్లతో నీళ్లందించిన వైఎస్సార్ బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే దృక్పథంతో 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. వెంటనే రూ. 300 కోట్లతో ప్రధాన పనులను పూర్తిచేసి మూడోవంతు భూమికి సాగునీరందించి రైతుల్లో ఆనందం నింపారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రయోజనం సున్నా తెలుగుగంగ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కాలువకు నీళ్లు వదులుతున్నా పొలాలకు మాత్రం నీరు రావడం లేదు. ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలే అవకాశమున్నా పిల్లకాలువలను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. దీంతో రైతుల పొలాలకు నీళ్లు అందే అవకాశం లేదు. – వెంకటనారాయణ రెడ్డి, మిద్దెల, కాశినాయన మండలం పిల్లకాలువలు అధ్వానంగా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో పిల్ల కాలువలు నిర్మించలేదు. కొన్ని చోట్ల నిర్మించినా కంపచెట్లు పెరిగి అధ్వానంగా మారాయి. నీళ్లు వదిలినా పొలాలకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఐదారేళ్లుగా ప్రధాన కాలువలకు నీళ్లు వదులుతున్నా చాలా తక్కువగా వస్తున్నాయి. – మునిరెడ్డి, మామిళ్లపల్లె, కలసపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
సాగు.. ఇక బాగు!
సాక్షి, చాపాడు(కడప) : అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అనాసక్తి కారణంగా గత కొన్నేళ్లుగా జిల్లాలోని చెరువులను నింపకపోవటంతో ఏటా 79, 976.495 ఎకరాల ఆయకట్టులో సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు అన్ని చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన ప్రాజెక్టుల్లో వరద నీరు సమృద్ధిగా చేరటం, వరద నీటిని సాగునీరుగా అందించేందుకు సీఎం చర్యలు తీసుకోవటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు చెరువులకు జలకళ.. కరువు నేల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకోవటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,022 క్యూసెక్కులు, ముచ్చిమర్రి ఎత్తిపోతల ద్వారా 927 క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. మరో 50 రోజుల పాటు కృష్ణానదిలోకి వరద జలాలు వచ్చే అవకాశం ఉండటంతో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులను నింపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు. వెలుగోడు నుంచి జిల్లాలోని తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్, ఎస్సార్–1, 2 ప్రాజెక్టులకు, గోరకల్లు, అవుకు ప్రాజెక్టుల నుంచి గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి, మైలవరం ప్రాజెక్టులకు వరద నీరు అందనుంది. వరద నీటి ఉధృతి మేరకు ఈ ప్రాజెక్టులను నింపే క్రమంలోనే చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు సాగునీటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెరువు ఆయకట్టు రైతులకు మహర్దశ.. కొన్నేళ్లుగా జిల్లాలోని అధిక భాగం ప్రాజెక్టులకు సాగునీరు చేరని పరిస్థితుల్లో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువు ఆయకట్టు రైతులు సాగునీరు లేక సాగుకు దూరమయ్యేవారు. ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో సాగునీరు అందనుండటంతో కేసీ కెనాల్ రైతాంగంతో పాటు చెరువు ఆయకట్టు రైతులు పంటలను సాగు చేసుకోవచ్చు. జిల్లాలోని 9 జలాశయాల కింద 16,987.481 ఎకరాల విస్తీర్ణంలో 216 చెరువులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఈ చెరువుల కింద 79,976.495 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి వేలాది మంది రైతులు చెరువు నీటితోనే పంటలు సాగు చేసుకోవాలి. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వలన సాగునీరు ప్రతి ఎకరాకు పుష్కలంగా అందనుండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. చెరువు నింపితే రెండు కార్లలో పంటల సాగు వర్షాలు వస్తేనే చెరువులు నిండుతాయి. ఈ సారి వర్షాలు పడకపోయినా ప్రాజెక్టులు నిండాయి. గ్రామ పరిధిలోని చెరువును నింపితే ఏటా వరితో పాటు వేసవి కాలంలో మరో పంట సాగు చేస్తాము. చెరువులను త్వరగా నింపితే వరి సాగు చేసుకుంటాము. చెరువులను నింపాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరుగుతుంది. – వడ్ల నాయబ్‌రసూల్, రైతు, ఖాదర్‌పల్లె, చాపాడు మండలం -
ప్రకృతి ఒడిలో
-
ఆర్టీపీపీకి ఆగిన నీటి సరఫరా
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా ఆగి పోయింది. విద్యుదుత్పత్తికి బ్రహ్మంసాగర్ నుంచి నీరు సరఫరా చేసే పైపులైన్ ఊహించని రీతిలో దెబ్బతింది. వివరాలివీ.. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి 68 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించారు. చాపాడు మండలంలోని కుందూ, ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నా నదులపై ఈ పైపులైన్ వస్తోంది. దీని ద్వారా ఆర్టీపీపీకి రోజు 38 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. గురువారం సాయంత్రం పెన్నానదిలోని పైపులైన్‌కు సంబంధించి ఎక్స్పాన్షన్ జాయింట్ ఊడిపోయింది. తీవ్ర ఒత్తిడి ప్రభావం కారణంగా ఈ జాయింట్ ఊడిపోయి నీరు పెన్నానదిలోకి చేరింది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేస్తే తప్ప పైపులైన్ నిర్మాణం యధాస్థితికి రాదని తెలుస్తోంది.