బంగారుతల్లికీ ‘ఆధార్’ లింకు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల తరహాలోనే ‘బంగారుతల్లి’ పథకానికి కూడా ప్రభుత్వం ఆధార్ లింకు పెట్టింది. అయితే ఈ ఏడాదికి మినహాయింపునివ్వాలని... 2014, మార్చి 31 తర్వాత దరఖాస్తు చేసుకునే ప్రతి తల్లీ ఆధార్ కార్డు పొంది ఉండాల్సిందేనని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బంగారుతల్లి పథకంపై జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బంగారుతల్లి పథకం కింద ఆన్‌లైన్‌లో నగదు బదిలీకోసం అందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేయాలని, అయితే, ఈ ఏడాది అందరికీ ఆధార్ అందుబాటులో లేనందున మినహాయింపునివ్వాలని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఆధార్ నిబంధన అమల్లోకి వచ్చేంతవరకు ఈ పథకం కింద దరఖాస్తుకు గానీ, నగదు బదిలీకి గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతోపాటు ఒక కాన్పులో ఆడబిడ్డ పుట్టిన తర్వాత రెండో కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా ఈ పథకం కింద అర్హులుగానే పరిగణించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పుట్టిన 21 రోజుల్లోగా జనన ధ్రువీకరణ పత్రం పొందాలన్న నిబంధన తొలగించారని పేర్కొన్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు 51,929 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,360 మందికి బ్యాంకు అకౌంట్లే లే వు.
సంక్షేమ పథకాలకు సమీకృత సాఫ్ట్‌వేర్
రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం సమీకృత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. సెర్ప్, ఉపాధిహామీ, పెన్షన్లు, బంగారుతల్లి లాంటి పథకాల కోసం ఒకే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని, ఇందుకోసం జి.కె.వీధి లాంటి రెండు గిరిజన మండలాలను పైలట్‌గా ఎంచుకోవాలని సూచించారు.
గ్రీన్‌చానల్‌లో చేరుస్తున్నాం: మంత్రి సునీతా
‘బంగారు తల్లి’ పథకం అమలుకు నిధుల కొరత రాకుండా గ్రీన్‌చానల్ ద్వారా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆదేశించారని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ పథకం కోసం రూ. 57.5 కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. సెదారన్ ప్రక్రియలో 1.30 లక్షల మంది వికలాంగులు పెన్షన్‌కు అనర్హులయ్యారని, అయినా వారికి పెన్షన్ రద్దు చేయకుండా నెలకు రూ.200 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.