సంతాప తీర్మానంలా ఉంది: వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్రానికి దిక్సూచిలా ఉంటుందని, ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆశించామని, ఈ ప్రసంగం ఆంధ్రప్రదేశ్‌కు ఓ సంతాప తీర్మానంలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రోజాలు మీడియా పాయింట్‌లో మాట్లాడారు.
టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్ని అమలు చేసే విశ్వాసాన్ని, నమ్మకాన్ని గవర్నర్ తన ప్రసంగం ద్వారా కల్పించలేకపోయారని జ్యోతుల నెహ్రూ అన్నారు. గవర్నర్ కూడా టీడీపీ ఉద్దేశాన్ని మక్కీకి మక్కీగా తయారు చేసి చదివినట్లుందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం బాధాకరమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తారని తెలిపారు.