
సీమాంధ్రులు మిమ్మల్ని ‘ఒకే ఒక్కడు’గా భావించారు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన జరిగిన రోజు రాజ్యసభలో మీ హావ భావాలూ, వాక్పటిమ చూసి సీమాంధ్రను ఆదుకోవడానికి ఉన్న ‘ఒకే ఒక్కడు’గా భావించి సీమాంధ్ర ప్రజలు మీకు అత్యున్నత స్థానం కల్పించారని, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రమంత్రి వెంకయ్యకి శనివారం మూడు పేజీల లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఇలా..‘రాష్ట్ర విభజనను సీమాంధ్రకు చెందిన ఏ పార్టీ పార్లమెంటు సభ్యుడు గానీ, మంత్రులు గానీ సమర్థించలేదు. మీరు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నా సీమాంధ్ర తరఫున వకాల్తా తీసుకుని విభజన జరిగిన రోజు బిల్లును సమర్థించారు.
2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమి విజయం సాధించిందంటే దానికి కారణం మీరు రాజ్యసభలో చేసిన ప్రసంగమే. మీరు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మం త్రులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అయినా మేం సిద్ధాంతానికి కట్టుబడి సమర్థిస్తున్నామని మీరు చెప్పారు. అలాగే మేం అధికారంలోకి వస్తామని, ఇప్పుడు నేను అడుగుతున్నవన్నీ మేం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మీరే అన్నారు’ అని గుర్తు చేశారు.
సవరణలు ప్రతిపాదించి.. : ‘ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వండి.. ఐదేళ్లలో పరిశ్రమల స్థాపన సాధ్యం కాదు. ఒప్పుకోని పక్షంలో నా సవరణల మీద ఓటింగ్‌కు పట్టుబడతాను అంటూ ఆరోజు హెచ్చరించారు. అలా ప్రతిపాదించి ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెంది వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.ఆ విషయం ప్రజలకు తెలియకపోవడం శోచనీయం. నాటి ప్రధాని ప్రకటనకే విలువ లేదంటున్నారు నేటి పాలకులు! నాడు, నేడు కీలకపాత్ర వహిస్తున్న మీరు కా ర్యోన్ముఖులు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదా కోసం నేను ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఈనెల 13న సభకు వస్తున్నందున దానికి అనుకూలంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటితో ఓటు వేయించి భారత రాజకీయ చరిత్రలో ఒక ధృవతారగా వెలుగొందాలని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు.