
అసైన్డ్‌లో ‘రియల్’ దందా
మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రియల్ అక్రమాలు జోరందుకుంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాయాజాలంలో ముగ్గురు కార్పొరేటర్ల ప్రమేయం ఉండడంతో సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైల్వేస్టేషన్ నుంచి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వరకు, బందరు మండలం కరగ్రహారం పరిధి వరకు వందలాది ఎకరాలున్నాయి.
ఈ భూముల్లో కొన్నింటిని స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మిగిలిన భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ప్లాట్టుగా మార్చేసి ప్రస్తుతం గజం రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కిన వ్యాపారులు తమ ఇష్టానుసారం ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ భూములన్నీ అసైన్డ్ భూములు అయినప్పటికీ రిజిష్ట్రార్ కార్యాలయంలో తమదైన శైలిలో చక్రం తిప్పుతున్న వ్యాపారులు ఇవి ప్రైవేటు భూములేనని నమ్మిస్తూ విక్రయాలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
2006లోనే అసైన్డ్ భూములుగా గుర్తింపు
పట్టణంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు రైల్వేస్టేషన్ నుంచి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వరకు ఉన్న భూములను, కరగ్రహారంలోని భూములను 2006లో అధికారులు పరిశీలించారు. రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను తమకు ప్రభుత్వం పోషణ కోసం ఇచ్చిందని వీటిని తీసుకోవద్దని పొలం యజమానులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో అప్పటి జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సురేష్‌కుమార్ ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఇవి అసైన్డ్ భూములుగానే నిర్ధారించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను ఇళ్లస్థలాలుగా ఇచ్చేందుకు రైతులు అంగీకరించక పోవడంతో కరగ్రహారానికి సమీపంలోని భూములను సేకరించి వందలాది మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశారు. ఈ కాలనీకి నవీన్‌మిట్టల్ కాలనీగా నామకరణం చేశారు.
సర్వే నంబర్లు మార్చి ప్రైవేటు భూమిగా చూపి...
రాష్ట్ర విభజన అనంతరం రియల్‌భూమ్ ఊపందుకోవడంతో పట్టణానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఈ అసైన్డ్ భూమిపై కన్నేశారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, బైపాస్‌రోడ్డు సమీపంలో నివశించే ఇద్దరు కౌన్సిలర్లు, మరో కౌన్సిలర్ ఈ భూమిపై కన్నేశారు. ఒక స్వాతంత్ర సమరయోధునికి చెందిన రెండున్నర ఎకరాలు కొనుగోలు చేసి ఇది ప్రైవేటు భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిని ఆధారంగా చేసుకుని మిగిలిన అసైన్డ్ భూములను ప్రైవేటు భూములుగా చూపి ఈ ముగ్గురు కౌన్సిలర్లు భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విడగొట్టి విక్రయిస్తున్నారు. తమదైన శైలిలో భూమికి సంబంధించిన పత్రాలు, గతంలో ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలను చూపుతూ ఇక్కడ ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు.
డ్రెయినేజీ గట్లే రోడ్లు!
ఈ అసైన్డ్ భూమి మొత్తం వ్యవసాయ భూమే. పంటకాలువలు, డ్రెయినేజీలు ఈ భూముల పరిధిలో ఉన్నాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ప్లాట్లలోకి వెళ్లేందుకు ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయలేదు. కరగ్రహారానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న మురుగుకాలువ గట్టుపై రబ్బీసు రోడ్డు నిర్మించారు. అసైన్డ్‌భూమిని ప్లాట్లుగా విడగొట్టి 12 అడుగులకు మించకుండా రబ్బీసు రోడ్లు నిర్మించారు. ఈ ప్లాట్లకు అనుమతులు ఉన్నాయో, లేవో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు దృష్టి సారిస్తే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి...
పురపాలక సంఘం పరిధిలోని భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించటంపై మున్సిపల్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఇక్కడ భూమి అధికంగా ఉండటంతో అనుమతులు ఇచ్చే అధికారం తమ పరిధిలో లేదని తెలిపారు. లేఅవుట్ నిబంధన ప్రకారం 40 అడుగుల మేర రోడ్డు నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లయితే గృహనిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌ను మంజూరు చేయబోమని చెప్పారు.