ఈ చిన్న లాజిక్ కూడా మరిచారా...బాబుగారూ
- ప్రత్యేక హోదా వస్తే అప్పుల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది
- ఇందులో రూ.26,253 కోట్లు విదేశీ సంస్థల నుంచి రుణం
- ప్రత్యేక హోదా ఇస్తే–ఇందులో 90 శాతం కేంద్రమే భరిస్తుంది
- అంటే 23,628.33 కోట్లు కేంద్రం భరిస్తుంది–రాష్ట్రం కేవలం రూ.2623.37 కోట్లే భరిస్తే చాలు
- రూ.11,525 కోట్లు రాష్ట్ర సర్కారు వాటా
- కేంద్రం వద్ద పెండింగ్‌లో 13 విదేశీ అప్పు ప్రాజెక్టులు
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం భారీ ఎత్తున విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రాజెక్టులను రూపొందించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు జైకా, తదితర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 37,778.80 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇందులో విదేశీ సంస్థల నుంచి 26,253.71 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించింది.
ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ఈ అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరిస్తుంది. రాష్ట్ర సర్కారు పది శాతం భరిస్తే సరిపోతుంది. 26,253.71 కోట్ల రూపాయల అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం 23,628.33 కోట్ల రూపాయలు భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2623.37 కోట్లు భరిస్తే సరిపోతుంది. ఐదేళ్ల పాటు అమలయ్యే ఈ విదేశీ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా వర్తింప చేస్తే రాష్ట్రంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తరువాత, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆధారంగాను, అలాగే వ్యయం చేసే సామర్ధ్యం ఆధారంగా ఆమోదం తెలుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వ్యయం చేసే సామర్ధ్యంతో పాటు తిరిగి రుణాలు చెల్లించే సామర్ధ్యాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకునే ఎంత వరకు ఏ ప్రాజెక్టులకు అనుమతించాలో నిర్ధారిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు.
విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా చేపట్టేందుకు 13 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మొత్తం 13 ప్రాజెక్టుల వ్యయం రూ.37,778.80 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థల రుణం రూ.26,253.71 కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భరించనున్న వాటాగా రూ.11,525.09 కోట్లుగా పేర్కొన్నారు. ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయంలో 70 శాతం మేర విదేశీ సంస్థల నుంచి రుణంగా తీసుకుంటుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 30 శాతం భరించనుంది.