అక్కరకు రాని చంద్రబాబు అనుభవం!
► రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి అడ్డుకోరు.
► ఓటుకు కోట్లు నేపథ్యంలో ప్రత్యేక హోదా తాకట్టు..
► విభజన హామీల అమలు లేదు..
► రెవెన్యూ లోటు భర్తీ లేదు.. రాజధానికీ అరకొర నిధులే..
► పదోషెడ్యూలులో ఆస్తులు పోతున్నా పట్టదు..
తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి... పదేళ్ల ప్రతిపక్షనాయకుడు.. రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాల అనుభవం..ఇవన్నీ ఎవరిని ఉద్దేశించినవో వేరే చెప్పనక్కరలేదు.. ఆయన జగమెరిగిన ‘త్రికాలజ్ఞుడు’. స్వయం ప్రకటిత ‘అనుభవజ్ఞుడు’. ఆయనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..తన అనుభవం.. కేంద్రంతో తన ఫ్రెండ్‌షిప్.. వెరసి రాష్ట్రానికి ఎంతో మేలుచేస్తుందని, స్వర్గాన్ని నేలకు దించేస్తానని నమ్మబలికారు.. నమ్మి జనం ఓట్లేశారు.
మూడేళ్లు పూర్తయ్యాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఖాళీ.. రాష్ట్రానికి ఏం ఒరిగింది? ప్రజలకు ఏం మేలు జరిగింది? బాబుగారి అనుభవమంతా ఏమయ్యింది? రాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడారా? కనీసం మాట్లాడారా?.. ఆకాశాన్ని నేలకు దించనక్కరలేదు.. న్యాయంగా మనకు రావలసినవి వచ్చేలా చూశారా? అన్నిటికీ ఒక్కటే సమాధానం.. ఏమీ జరగలేదు.
అమరావతి : ఐదుకోట్ల మంది ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘ప్రత్యేక హోదా’ను పనిగట్టుకుని అటకెక్కించారు. రాష్ట్ర ప్రగతికి పది కాదు, పదిహేను సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని తిరుమల వెంకన్న సాక్షిగా, నరేంద్రమోదీ సమక్షంలో డిమాండ్ చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత మాటమార్చారు. నాడు ప్రత్యేక హోదా సంజీవని అన్న నోటితోనే.. దాంతో ఏం వస్తుంది? అని ప్రశ్నించడంతో విలేకరులతో పాటు ప్రజలూ నివ్వెరపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతితో ఆర్జించిన నల్లడబ్బును ఎరవేసి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు.
ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నందునే ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారన్నది బహిరంగ రహస్యం. అంటే తన ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నమాట. ముఖ్యమంత్రి హోదాలో ముందుండి పోరాడాల్సిన, అందరినీ కలుపుకుని పోయి కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు మూడేళ్లలో ఎన్నడూ నోరు మెదిపిందే లేదు. వెరసి.. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయింది.
విభజన హామీలదీ అదేదారి..
రాష్ట్రం విడిపోయి మూడేళ్లు పూర్తయినప్పటికీ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి విభజన చట్టంలోని హామీలన్నింటినీ చదివేస్తే అదే ఏదో ప్రత్యేక ప్యాకేజీ అన్నట్లు వెంకయ్యనాయుడిని పిలిచి సన్మానాలు చేశారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు నాయుడు స్వాగతించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. జైట్లీ ప్రకటనలో అసలు ప్యాకేజీ అన్నమాటే లేకపోయినా ప్యాకేజీ ఏదో ప్రకటించారంటూ ప్రచారం చేశారు.
విభజన చట్టంలోని అంశాల అమలుకు పట్టుబట్టకుండా ప్యాకేజీ వచ్చేసిందంటూ చంకలు గుద్దుకోవడంతోనే మూడేళ్లు గడచిపోయాయి. రాష్ట్ర విభజన ఏడాది ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలో కేంద్రం భారీగా కోత విధించింది. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం అరకొర నిధులతోనే సరిపుచ్చింది. విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇంకా సాగునీటి రంగం, ఉద్యోగుల సర్వీసు అంశాలు, పంపిణీ, పదవ, తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు.
పైగా తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలోను, అలాగే పదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రతికూల ఆదేశాలు జారీ అయ్యాయి. పదవ షెడ్యూల్లోని సంస్థలకు చెందిన స్థిరాస్తుల్లో(రూ.33 వేల కోట్లు) ఏపీకి ఎటువంటి వాటా రాదని, ఎక్కడి ఆస్తులు అక్కడికే చెందుతాయని, నగదు, అప్పులను మాత్రమే జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే తొమ్మిదవ షెడ్యూల్‌లోని సంస్థలకు చెందిన ఆస్తులు(రూ.10వేల కోట్లు), అప్పుల పంపిణీకి సబంధించి హెడ్ క్వార్టర్స్ అంటే కేవలం ప్రధాన కేంద్ర కార్యాలయం ఆస్తులు, అప్పులే గానీ దాని అనుబంధ యూనిట్లు, సంస్థలు రావని ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయలేకపోయారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా మౌన ప్రేక్షకుని మాదిరిగా చూస్తుండడమే చంద్రబాబు అనుభవమని అనుకోవడం తప్ప ఇక ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
విభజన చట్టంలోని ప్రధాన హామీలు, వాటి అమలు తీరు తెన్నులు
- రెవెన్యూ లోటు భర్తీగా రూ.16,078 కోట్లు కేంద్రం ఇవ్వాలికానీ కేంద్రం 4,117 కోట్ల రూపాయలతో సరిపుచ్చింది. ఇంతకన్నా ఒక్క పైసా ఇవ్వబోమని స్పష్టం చేసింది.
- ప్రత్యేక హోదాకు మంగళం పలికింది. బాబు కోరిక మేరక చట్టంలోని అంశాలన్నీ కలిపి అదే ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం ప్రకటించింది.
- రాజధాని నిర్మాణానికి తొలుత బాబు ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని అడిగారు. అయితే కేంద్రానికి 43,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. కానీ కేంద్రం రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజభవన్ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలే ఇస్తామని తేల్చింది. ఇందులో ఇప్పటికి 1,950 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
- దుగరాజపట్టణంలో భారీ ఓడరేవు నిర్మాణం చేపడతామని విభజన చట్టంలో చెప్పారు కానీ ఇప్పుడు వయబుల్ కాదని కేంద్రం స్పష్టీకరించింది.
- వైఎస్‌ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారు కానీ ఇంకా వయబులిటీ అధ్యయనం పేరుతో కమిటీ ఏర్పాటు వద్దే ఆగిపోయింది.
- రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారుకానీ రైల్వే జోన్ ఏర్పాటుపై దాగుడు మూతలు కొనసాగుతున్నాయి.
- ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీల రికవరీలో విభజన చట్టం నిబంధనలతో రాష్ట్రానికి రూ.3820 కోట్లు నష్టం వస్తున్నందున నిబంధనల్లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు.
- వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చట్టంలో చెప్పారు. అయితే ఒక ఏడాదికి జిల్లాకు 50 కోట్ల రూపాయలతో కేంద్రం సరిపుచ్చేసింది. మూడేళ్లలో రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం.