ఏపీని అగ్రగామిగా నిలబెడతాం
చీమకుర్తి: దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెడతామని రోడ్లు, భవనాలు, రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ధీమా వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం రాత్రి చీమకుర్తిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన దారుణ వైఖరి వలన రాష్ట్రం సర్వం కోల్పోయిందన్నారు. మన రాష్ట్రంలో కాకినాడ నుంచి చెన్నై వరకు అపారమైన వనరులున్న కారణంగా రానున్న రోజుల్లో సుందరంగా అభివృద్ధి చేయవచ్చన్నారు.
బైపాస్‌కు శిలాఫలకం సిద్ధం చేసుకోవడమే తరువాయి:
చీమకుర్తి బైపాస్‌కు రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేస్తామని, దానికి శిలాఫలకం సిద్ధం చేసుకోవడమే తరువాయి అన్నారు. ఇప్పటికే సీఈతో మాట్లాడానని, రేపోమాపో భూమిపూజ చేస్తానన్నారు. దానితో పాటు స్థానిక నాయకులు గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు 8 సూట్లతో ఆర్ అండ్ బీ అతిథి గృహం మంజూరు చేస్తామని చెప్పారు. బస్టాండ్ నుంచి నెహ్రూనగర్ వరకు కర్నూల్‌రోడ్డు మార్జిన్‌లకు కూడా తారురోడ్డు వేయించనున్నట్లు తెలిపారు.
చంద్రబాబునాయుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విలేకరుల సమావేశం అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, వైస్‌చైర్మన్ కందిమళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి రావలసిన గ్రానైట్ సీనరేజి నిధులను ఇప్పించే లా చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి శిద్దా దంపతులకు స్థానిక నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నం శ్రీధర్‌బాబు, కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, చీమకుర్తి కమలమోహన్, మన్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.