♦ రూ.9,050 కోట్లు తీసుకోవాలని నిర్ణయం
♦ రుణం ఇవ్వనున్న జైకా, ఏడీబీ, ప్రపంచ బ్యాంకు
♦ రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.4,390 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విదేశీ సంస్థల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగు ప్రాజెక్టులకు రూ.9,050 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యయం రూ.13,440 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థలు రూ,9,050 కోట్లను సమకూర్చనున్నాయి. మిగతా రూ.4,390 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకోనుంది. ఈ నాలుగు ప్రాజెక్టుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి, ఆయా విదేశీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. రాష్ట్రంలో 21 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 20 వేల హెక్టార్ల గ్యాప్ ఆయకట్టుకు, 485 చిన్ననీటి వనరుల కింద 12,800 హెక్టార్లకు సాగునీరు అందించేందుకు రూ.2,000 కోట్లతో రాష్ట్ర సమగ్ర వాటర్ మేనేజ్‌మెంట్ పేరిట ప్రాజెక్టును చేపట్టనున్నారు.
ఇందుకోసం జపాన్ ఇంటర్నేషనల్ సహకార ఏజెన్సీ (జైకా) నుంచి రూ.1,700 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. కమ్యూనిటీ ఆధారిత వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,200 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ రుణంతో 1,200 చిన్న నీటి వనరుల కింద 1.20 లక్షల హెక్టార్లను సాగులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడీబీ) నుంచి రూ.3,750 కోట్ల రుణం తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగు పరిచేందుకు, విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2,400 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఈ నాలుగు ప్రాజెక్టులను ఐదేళ్ల కాలవ్యవధిలో అమలు చేయనున్నారు.
నాలుగు ప్రాజెక్టులకు విదేశీ అప్పు
Published Mon, Dec 21 2015 1:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement