బౌద్ధ్ద పర్యాటకానికి చేయూత
ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ పర్యాటకం అభివృద్ధికి సాయం చేసేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏడు మిషన్లకు సంబంధించి సేవారంగంలో కీలకమైన పర్యాటక రంగంపై ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్షించారు. బౌద్ధ పర్యాటకం, దేవాలయ పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బౌద్ధ్ద పర్యాటకం అభివృద్ధికి ప్రపంచబ్యాంకు చేయూతనిస్తుందని చెప్పారు. పర్యాటకులు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో పాటు ఎక్కువ సమయం గడిపేలా అదనపు ఆకర్షణలు కల్పించటంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లలో మాదిరిగా అత్యున్నత ప్రమాణాలతో ట్రావెల్, టూరిజం విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు.
గర్భిణులకు స్మార్ట్ కార్డులివ్వండి: గర్భిణులకు ప్రభుత్వమిచ్చే సాయం అందేం దుకు వీలుగా.. రాష్ట్రంలో గుర్తించిన 9 లక్షల మంది గర్భిణులకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సంక్షేమ రంగంపై శనివారం అధికారులతో సమీక్ష జరిపారు.
పోలవరం ఖర్చులు తిరిగి ఇవ్వండి.. సీఎం లేఖ
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణంపై చేసిన వ్యయాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5,200 కోట్లు వ్యయం చేసిందని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా బాబు లేఖలో కోరారు. అంతకుముందే ప్రాజెక్టుపై చేసిన ఖర్చును ఇవ్వాల్సిందిగా జలవనరుల మంత్రిత్వ శాఖతో సమావేశం సందర్భంగా సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కోరారు. ఇందుకు ఆ శాఖ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సీఎం లేఖ రాశారు. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు చేపట్టిన సంగతి విదితమే.