స్థానికతలో అక్రమాలపై కేసీఆర్ ఆగ్రహం
పంపిణీపై టీఆర్‌ఎస్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను నిరోధించడంతో పాటు స్పష్టమైన విధానాన్ని, వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు బుధవారం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. పలు స్థాయిల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియలో స్థానికత, బోనఫైడ్ పత్రాల సమర్పణలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రమోషన్లు, పోస్టింగుల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. నిరుద్యోగులకు కూడా అవకాశాలు రాకుండా పోతాయన్నారు. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ధ్రువీకరణ పత్రాలు, బోనఫైడ్‌లను రాష్ట్ర విభజన తర్వాత కూడా మరోసారి పరిశీలిస్తామని హెచ్చరించారు. దీనిపై అప్రమత్తంగా ఉండటానికి స్పష్టమైన విధానం, దాని అమలుకు వ్యూహం ఉండాలన్నారు. అందుకోసం తెలంగాణ భవన్‌లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విభజన ప్రక్రియలో వచ్చే ఫిర్యాదులు, వినతులను అది పరిశీలిస్తుందన్నారు. సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడానికి పార్టీ ముఖ్య నేత టి.హరీశ్‌రావు నేతృత్వంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌లతో వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగానే విభజించాలని, ఏ రాష్ట్రంలో పుట్టి ఉంటే ఆ రాష్ట్రానికి పంపించాలని అన్నారు.
నేడు ఉద్యోగులతో కేసీఆర్ భేటీ
తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య అన్ని స్థాయిల ప్రభుత్వోద్యోగుల పంపిణీ తుది దశకు చేరుకుంటున్న సమయంలో నగర శివార్ల ఉన్న కొంపల్లిలోని ఆర్.డి.కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం సమావేశం అవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల, అన్ని స్థాయిల ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు దీనికి హాజరవాలని కేసీఆర్ కోరారు. ఉద్యోగుల పంపిణీలో అనుసరించాల్సిన వ్యూహం, విధానంపై సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. ఈ భేటీ నేపథ్యంలో కేసీఆర్ గురువారం సందర్శకులకు అందుబాటులో ఉండరని ఆయన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. సందర్శకులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. ఆడంబరాలకు, అట్టహాసాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని, కాబట్టి ఎవరూ పుష్పగుచ్ఛాలు, దండల వంటివి తీసుకురావద్దని కోరారు.