మొగ్ధుంపూర్‌లో రైతులు బాండ్ అందజేస్తున్న మంత్రి
ఫిబ్రవరి 26న కరీంనగర్ వేదికపై సీఎం కేసీఆర్ ఇచ్చిన మరోహామీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రైతు సమన్వయ సమితి సభ్యుల తెలంగాణ స్థాయి అవగాహన సదస్సు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన విషయం విధితమే. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఇదే వేదిక నుంచి ప్రకటించారు. ఆ హామీ మేరకు ఉమ్మడి జిల్లాలో 2.39 లక్షల మందికి రైతుబీమా బాండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్‌లో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు 2.39 లక్షల బాండ్లు రాగా, ఈ నెల 13 వరకు ఊరూరికి వెళ్లి అధికారులు నేరుగా రైతులకు అందజేయనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన 18 నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన రైతులకు ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.
– సాక్షిప్రతినిధి, కరీంనగర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రస్తుతం వచ్చిన బాండ్లను చూసి తమకు రాలేదన్న భావన ఏ రైతుకూ అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారికి ఈ బాండ్లు వస్తాయని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకూ తావులేదని చెబుతున్నారు. భూ రికార్డుల ఆధునికీకరణ కింద అన్ని పట్టాదారు పాస్‌పుస్తకాలు ఒకేసారి లేకపోవడంతో అందరికీ ఒకేసారి బాండ్లు రావడం లేదని, ఈ విషయాన్ని రైతులు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది నిరంతర కార్యక్రమమని పేర్కొంటున్నారు. ఈ నెల 15 నుంచి బాండ్లు అమల్లోకి వస్తాయని, ఏడాది పాటు ఏ కారణంతోనైనా అర్హత ఉన్న రైతు చనిపోతే వారి కుటుంబానికి 15 రోజుల్లోపు ఐదు లక్షల పరిహారం ఎల్‌ఐసీ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. ఇది మంచి పథకమని, బాండ్ల పంపిణీకి సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నారు. జిల్లాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిన రైతుల వద్దకువెళ్లి అధికారులు సర్వే చేశారు.
ఆ మేరకు అర్హత ఉన్న వారికి బీమా వర్తింప చేస్తూ వస్తున్నారు. అలాగే రికార్డుల ఆధునికీకరణ కింద ప్రతీ వారం, పక్షం రోజులకోసారి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన వివరాలను తీసుకొని వ్యవసాయ అధికారులు సదరు వాటిలో అర్హత ఉన్న రైతులకు బీమా వర్తింపజేస్తున్నారు. దీంతో దశలవారీగా బీమా బాండ్లు వస్తున్నాయి. అయి తే, వచ్చిన బాండ్లను వచ్చినట్లుగానే రైతులకు అందించాలన్న లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలోనే మొదటి దశగా వచ్చిన 2.39 లక్షల బాండ్లను ఈ నెల 6 నుంచి 13లోపు పంపిణీ చేయడానికి ఆయా జిల్లాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే బాండ్ల ను నేరుగా రైతుల ఇంటికి తీసుకెళ్లి అప్పగిస్తారు.
రైతు సంక్షేమానికి రూ.55 వేల కోట్లు..
రైతుల సంక్షేమమే ప్రధానలక్ష్యంగా ఏటా రూ.55–60 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సామూహిక జీవితబీమా పథకం కార్యక్రమాన్ని మంత్రి జ్వోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందుగా రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు మంత్రి రాజేందర్‌ను రాజీవ్ రహదారి నుంచి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు అభిమానంతో చేతులపై ఎత్తుకుని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాజేందర్ మాట్లాడుతూ.. రైతుల కోసం ప్రభుత్వం ఎంతగానో పనిచేస్తున్నప్పటికీ, దేవుని కరుణ లేకపోవడంతో వర్షాలు పడటం లేదన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ. 55 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని, రెండు, మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. రూ.7 వేల కోట్లతో రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతుబంధు పథకం కింద రూ.12 వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. రైతుబీమా పథకం ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతుబీమా పథకంలో చేరిన రైతు చనిపోతే 15 రోజుల్లోగా ఆ రైతు సూచించిన నామినికి రూ.5 లక్షల చెక్కు అందుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment