హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఇంటికే అయోధ్య రామయ్య రానున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును.. ఎంపీ బండి సంజయ్‌కుమార్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు రాములోరి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు తమ ఇళ్లల్లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? వారిలో రామయ్యను కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు.
మొత్తం 5 లక్షల కుటుంబాలకు పైగా ఉండగా.. వాటిలో నాలుగు లక్షలకు పైగా కుటుంబాలు హిందువులని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, 4.21 లక్షల అయోధ్య రాముని చిత్రపటాలను తయారు చేయించే పనిలో ఎంపీ నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్షకు పైగా సిద్ధమవడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంజయ్ మంగళవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment