సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే | Employees protest seeking withdrawal of CPS | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

Published Mon, Mar 26 2018 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

Employees protest seeking withdrawal of CPS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను (సీపీఎస్‌) రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సకల ఉద్యోగుల మహాసభ తీర్మానించింది. సీపీఎస్‌ రద్దు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆ బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే పెడుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సమస్యలను ఏప్రిల్‌ నెలాఖరులోగా పరిష్కరించాలని, లేదంటే తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల జేఏసీ (టీఈజేఏసీ) సకల జనుల మహాసభను నిర్వహించింది. టీఈజేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు.

‘‘ఈ నాలుగేళ్ల కాలంలో ఉద్యోగుల అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అందులో కొన్ని పరిష్కారమైనా ఇంకా చాలా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్, ఆంధ్రాలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించడం వంటి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి’’అని ఆయన డిమాండ్‌ చేశారు. టీఈజేఏసీ సెక్రటరీ జనరల్‌ మమత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌ అయ్యాక పెన్షనే ఆధారమని, కానీ సీపీఎస్‌తో అలాంటి భద్రత లేదన్నారు. ‘‘సీపీఎస్‌ అమలోŠ?ల్క వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు దాదాపు 2 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. వారిలో కొందరు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇప్పుడు ఆసరా పెన్షన్ల కంటే తక్కువ పింఛన్‌ వస్తోంది. ఏపీలో ఉన్న ఉద్యోగుల బతుకు అగమ్యగోచరంగా మారింది. 8 ఏళ్లుగా బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు పోరాటాలు కొత్త కాదు. డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడదాం. అందుకు ఈ సభే నాంది’’అని ఆమె పేర్కొన్నారు. 

సీఎం వద్ద భజన గ్యాంగ్‌: రాజేందర్‌ 
టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం వీడాలన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులకే అవమానాలు, అసమానతలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలే అమలు కావడం లేదంటే ఎవరి వైఫల్యమో ప్రభుత్వం గుర్తించాలి. ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం ఇంకా కొనసాగుతోంది. ఆర్డర్‌ టు సర్వ్‌ను 18 నెలలు కొనసాగించే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా?’’అని ప్రశ్నించారు. సీఎం దగ్గర భజన గ్యాంగ్‌ ఉందని, సమస్యలు చెబితే సీఎం వరకు వెళ్లనీయడం లేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రగతి భవన్‌ గేట్లు తెరవట్లేదని, కానీ తెరవాల్సిన రోజు వస్తుందన్నారు. 

గంట సమయమిస్తే చాలు.. 
రిటైర్‌ అయిన ఉద్యోగులకు సాంత్వన చేకూరాలంటే సీపీఎస్‌ రద్దు చేయాల్సిందేనని టీజీవో జనరల్‌ సెక్రటరీ సత్యనారాయణ అన్నారు. సీఎం గంట టైం ఇస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్ల సాధన కోసమే ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకోకపోవడం వల్లే ఈ సభ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కొంతమంది అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బదిలీల కోసం బహిరంగ సభ పెట్టిన దుస్థితి తెలంగాణలో తప్ప ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను దూరం చేసుకోవద్దని, సమస్యలను పరిష్కరించాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు కేసీఆర్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇస్తారన్నారు. గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్నారు. టీటీయూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చట్ట సవరణలు అనేకసార్లు చేశారని, సీపీఎస్‌ రద్దు కోసం మరోసారి చేయాలన్నారు. ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్న వారికి కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌ అన్నారు. సమావేశంలో ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల నేతలు ప్రసంగించారు. 

సీఎంకే బాధ్యత అప్పగిద్దాం: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ 
సీపీఎస్‌ను తెచ్చిందే సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా మాట్లాడవద్దని, సీపీఎస్‌ రద్దు బాధ్యతను అయనకే అప్పగిద్దామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. సీపీఎస్‌ కచ్చితంగా రద్దు అవుతుందన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంతో వ్యూహాత్మకంగా పనులు చేయించుకోవాలి. సాధన కోసం దశల వారీ పోరాటాలు చేయాలి. సీఎం కూడా సానుకూలంగానే ఉన్నారు. అ«ధికారులతో మాట్లాడుతున్నారు. ఆంధ్రాలోని ఉద్యోగులను కచ్చితంగా తీసుకువద్దాం’’అని అన్నారు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాతున్న సమయంలో కొందరు ఉద్యోగులు నిలువరించే ప్రయత్నం చేశారు. తమను వెంటనే ఇక్కడికి తేవాలంటూ సభ జరుగుతున్నంత సేపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు బ్యానర్‌ పట్టుకొని నినాదాలు చేశారు. 

ప్రధాన తీర్మానాలిలవీ.. 
– ఏపీలోని 1,200 మంది ఉద్యోగులను వెంటనే తీసుకురావాలి 
– వచ్చే ఏప్రిల్‌ నెలాఖరులోగా బదిలీలు చేపట్టాలి 
– ఆర్డర్‌ టు సర్వ్‌ను వెంటనే రద్దు చేసి శాశ్వత కేటాయింపు జరపాలి 
– కాంట్రాకు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను వేగవంతం చేయాలి
– ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలను చెల్లించాలి 
– సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలి 
– పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను ఇవ్వాలి. తెలంగాణ ఇంక్రిమెంట్, రాయితీపై బస్‌పాస్‌ సదుపాయం కల్పించాలి 
– ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. జిల్లా గ్రంథాలయాలు, మార్కెట్‌ కమిటీ, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి 
– ఉద్యోగుల సమస్యలను ఏప్రిల్‌ నెలాఖరులోగా పరిష్కరించాలి. లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం  ఉద్యోగులకే అవమానాలు, అసమానతలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలే అమలు కావడం లేదంటే ఎవరి వైఫల్యమో ప్రభుత్వం గుర్తించాలి. ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం ఇంకా కొనసాగుతోంది. ఆర్డర్‌ టు సర్వ్‌ను 18 నెలలు కొనసాగించే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా?’’అని ప్రశ్నించారు. సీఎం దగ్గర భజన గ్యాంగ్‌ ఉందని, సమస్యలు చెబితే సీఎం వరకు వెళ్లనీయడం లేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రగతి భవన్‌ గేట్లు తెరవట్లేదని, కానీ తెరవాల్సిన రోజు వస్తుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement