
ఎర్ర చంధనం
మూడేళ్లలో 60 టన్నుల దుంగలు స్వాధీనం
ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
తిరుపతికి ఎర్ర చందనం దుంగల తరలింపు
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.18 కోట్లు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ లోటు బడ్జెట్ ఏర్పడటం.. కొత్త ప్రభుత్వం రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ఫించన్ల పెంపు తదితర హామీలను నెరవేర్చడం కోసం.. ఇతర వనరుల సమీకరణలో భాగంగా ఎర్రచందనం నిల్వలను వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో అనంతపురం అటవీశాఖ పరిధిలో స్వాధీనం చేసుకున్న దుంగలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. జిల్లాలో 60 టన్నుల ఎర్రచందనం దుంగలు నిల్వ ఉన్నాయని స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం దుంగల నిల్వలు ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం వృక్షాలు పెద్దగా లేకపోయినా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి స్మగ్లర్లు దుంగలను అనంతపురం జిల్లా మీదుగా తరలిస్తూ..ఇక్కడి అటవీశాఖాదికారులకు పట్టుబడడంతో వారి నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను అనంతపురంలోని రేంజర్ కార్యాలయంలో భద్రపరిచారు. గడిచిన మూడేళ్లలో అధికారులు స్వాధీనం చేసుకున్న దుంగలు 60 టన్నులు నిల్వ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ఎర్రచందనం విలువ రూ.30లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే.. జిల్లాలో నిల్వ ఉన్న దుంగల ఖరీదు దాదాపు రూ.18కోట్లు అన్నమాట. తరచూ ఎక్కడో ఒక చోట ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకుని వాహనాలు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నా..అక్రమ రవాణా ఆగడం లేదు.
వాహనాలు విక్రయిస్తే రూ.20 లక్షలు
జిల్లాలోని అటవీశాఖ పరిధిలో 2012 నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన వాహనాలు మొత్తం 48 ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అనంతపురం అటవీశాఖ కార్యాలయంలో వే లానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. వీటిని వేలంలో విక్ర యిస్తే ప్రభుత్వానికి దాదాపు రూ.20 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఇంటిదొంగలు తేలనేలేదు
జిల్లాలో ఆరు (అనంతపురం, కళ్యాణదుర్గం, బుక్కపట్నం, పెనుకొండ, కదిరి, గుత్తి) ఫారెస్ట్ రేంజ్‌లు ఉన్నాయి. 1989 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అయితే ఈ అడవుల్లో ఎక్కడా ఎర్రచందనం వృక్షాలు లేవు. గతంలో శ్రీగంధం చెట్లు ఉన్నా..ప్రస్తుతం అవి కూడా కనిపించడం లేదు. అయితే కర్నూలు నల్లమల అడవులు, వైఎస్సార్ జిల్లాలోని శేషాచలం, పాలకొండల్లో ఎర్రచందనం వృక్షాలు అపారంగా ఉన్నాయి. వాటిని అక్కడి స్మగ్లర్లు నరికి వేసి దుంగలుగా మార్చి..గతంలో చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి చైనాకు తరలించేవారు. అయితే చిత్తూరు జిల్లాలోని తలకోన అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు నిఘా పెంచారు. దీంతో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల స్మగ్లర్లు రూటు మార్చి అనంతపురం జిల్లా మీదుగా దుంగలను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే జిల్లాలో ఆ స్మగ్లర్లు పోలీసుశాఖలోని కొంత మంది ఎస్‌ఐలతో పాటు అటవీశాఖలోని కొంత మంది అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరి సహకారంతోనే స్మగ్లర్లు దుంగలను యథేచ్ఛగా జిల్లా దాటిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువైన నేపథ్యంలో అటవీ శాఖాధికారులు అడపా దడపా దాడులు చేసి దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 54 కేసులు నమోదు చేసి..115 మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే పోలీసులు, అటవీశాఖాధికారుల కళ్లుగప్పి పారి పోయిన నిందితులు కూడా అదేస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తప్పించుకున్న వారు అటవీ శాఖాధికారులు, సిబ్బందితో పరిచయాలు పెంచుకుని..వారు కోల్పోయిన దుంగలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే జూన్ 8న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అనంతపురం రేంజీ కార్యాలయం ఆవరణలోని గదిలో దాచి ఉంచిన రూ.కోటి విలువైన దుంగలను దర్జాగా తీసుకెళ్లిపోయారు. ఇంటిదొంగల ప్రమేయం ఉండటంతోనే నెలరోజులు గడిచిపోయినా ఇంత వరకు దొంగల సంగతి ఓ కొలిక్కిరాలేదు. పోలీసులు సైతం కేసును ఛేదించలేకపోతున్నారు.
వెలుగుచూడనివి ఎన్నో..!
కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు కూలీలతో ఇష్టారాజ్యంగా నరికించి ఎక్కడపడితే అక్కడ దాచిపెడతారు. జిల్లాలో కూడా గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, తలుపుల, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల్లో ఎక్కువగా దాచిపెడుతున్నట్లు తెలిసింది. పరిస్థితులు, వాతావరణం అనుకూలించినపుడు జిల్లా హద్దులు దాటిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ జిల్లా నుంచి తలుపుల, కదిరి మార్గంలో ఎక్కువగా ఎర్రచందనం దుంగలు తరలిపోతున్నట్లు తెలిసింది. ఈ తతంగం మొత్తం తెలిసినా సిబ్బంది తగినంత మంది లేకపోవడం.. ఆయుధాలు లేకపోవడంతో గాలింపును పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. స్మగ్లర్లకు ఇది అదునుగా మారింది. దీనికి తోడు కాసులకు కక్కుర్తిపడే కొంత మంది పోలీసులు, అటవీ సిబ్బంది సహకారం ఉండడంతో వారికి మరింత బలం చేకూరుతోంది.
తిరుపతికి తరలించాం
కార్యాలయంలో భద్రత లేకపోవడం, ప్రభుత్వం దుంగలను వేలం వేయాలని సూచించడంతో అనంతపురం రేంజీకార్యాలయంలో నిల్వ ఉంచిన 60 టన్నుల ఎర్రచందనం దుంగలను ప్రధాన అటవీసంరక్షణ అధికారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా బాకరాపేటలోని కేంద్ర శాండిల్‌ఉడ్ కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం కార్యాలయంలో దుంగలు ఏమీ లేవు.
-శ్రీనివాసులు, సబ్ డీఎఫ్‌ఓ, అనంతపురం