మరింత జనబాహుళ్యం, వైశాల్యం మండలాలు @64
సాక్షి, రాజమండ్రి :బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టుకు ఒక ఆటంకం తొలగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు ప్రాంతాల విలీనం అంశానికి బుధవారం తెరపడింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేస్తూ ఎన్‌డీఏ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రాజెక్టులో ఇది ఒక కోణం అయితే..గ్రామాల విలీనంతో ఉభయగోదావరి జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో మరో నాలుగు మండలాలు కలవనున్నాయి. భౌగోళికంగా జిల్లా మరింతగా విస్తరించనుంది. విలీనం అయ్యే గ్రామాలు ముంపు ప్రాంతాలే అయినప్పటికీ ఆ ప్రజలకు జిల్లా పరిధిలోనే పునరావాసం కల్పిస్తారు.
ప్రాజెక్టులో మొత్తం తొమ్మిది మండలాలు, వాటి పరిధిలోని 276 గ్రామాలు వాస్తవ అంచనాల ప్రకారం ముంపునకు గురవుతున్నాయి. వీటిలో ఖమ్మం జిల్లాలోనే ఏడు మండలాలకు చెందిన 205 గ్రామాలు ఉన్నాయి. గోదావరి తూర్పుగోదావరి, ఖమ్మం సరిహద్దు తీరంలో చింతూరు, వరరామచంద్రపురం, భద్రాచలం, కూనవరం మండలాలకు చెందిన 123 గ్రామాలు, పశ్చిమగోదావరి, ఖమ్మం సరిహద్దుల్లో కుకునూరు, బూర్గంపహాడ్, వేలేరుపాడు మండలాలకు చెందిన 82 గ్రామాలు ఉన్నాయి. వీటిలో బూర్గంపహాడ్‌లో ఐదు గ్రామాలు మినహా మిగిలిన 200 గ్రామాలను ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైనట్టేనని అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వడంతో ఈ మండలాల్లోని ముంపు ప్రాంతాలే కాక మిగిలిన గ్రామాలు కూడా ఉభయగోదావరి జిల్లాల్లో అంతర్భాగం కాబోతున్నాయి. ఈ రకంగా మొత్తం 397 గ్రామాలు రెండు జిల్లాల్లో కలవనుండగా జిల్లాలోకి 308 జనావాసాలు వచ్చి చేరుతున్నాయి. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండున ఈ గ్రామా లు లేని తెలంగాణ మాత్రమే ఆవిర్భవించనుంది.
‘తూర్పు’న మార్పు ఇలా...:
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా 10,807 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. 58 మండలాలు 1404 గ్రామాలతో, 51.51 లక్షల జనాభా కలిగి ఉంది. కొత్తగా మరో 308 గ్రామాలు విలీనం అయితే గ్రామాల సంఖ్య 1712 కానుంది. మండలాల సంఖ్య (రెండు అర్బన్ మండలాలతో కలిపి) 64కు పెరగనుండగా జనాభా అదనంగా సుమారు మరో 1.32 లక్షల మంది చేరి 52.83 లక్షలకు చేరుకోనుంది. ఇక జిల్లా వైశాల్యం మరో 2006 చదరపు కిలోమీటర్ల మేర పెరిగి 12,813 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. నిర్వాసితుల్లో 64 శాతం వరకూ గిరిజనులున్నారు. దీంతో జిల్లాలో గిరిజన ప్రాంతం, గిరిజన జనాభా కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టు వల్ల 28 వేల కుటుంబాలకు చెందిన 1.20 లక్షల మంది నిర్వాసితులవుతుండగా వారిలో తూర్పులో సుమారు 3,000 కుటుంబాలకు చెందిన 12,000 మంది, పశ్చిమాన 2,200 కుటుంబాలకు చెందిన సుమారు 10,000 మంది ఉన్నారు. కాగా నిర్వాసితుల్లో 23 వేల కుటుంబాలకు చెందిన 98,000 మంది ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. కాగా వాస్తవంగా ఎన్ని గ్రామాలు ఏయే జిల్లాల్లో విలీనం అవుతాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆర్డినెన్సులోని పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.