pallavaram project
-
బంద్ సంపూర్ణం
బంద్ సంపూర్ణం పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ ఆమోదించడంపై జిల్లావ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. టీజేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్ విజయవంతమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు టీజేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్‌ను ఆమోదించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. బంద్‌కు అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కులసంఘాల నేతలు సంపూర్ణమద్దతు తెలిపాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సులు నడవలేదు. పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు, వ్యాపార వాణిజ్యసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశాయి. మంథని, సిరిసిల్ల, కోహెడ, బెజ్జంకి సెంటర్లలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిమ్మాపూర్ మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎల్కతుర్తిలో కరీంనగర్-వరంగల్ ప్రధానరహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెల్గటూరు, కోరుట్ల, ఎన్టీపీసీ సెంటర్లో బైక్‌ర్యాలీ తీసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సులను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం ఐదు గంటల నుంచే డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీజేఏసీ జిల్లా నాయకులు ఎం.నారాయణ, గీట్ల ముకుందరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, పైడిపల్లి రాజు, జూపాక శ్రీనివాస్, ముత్యంరావు తదితరులు అడ్డుకున్నారు. నగరంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి టవర్‌సర్కిల్ వరకు ఊరేగింపుగా వెళ్లారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో... పోలవరం బిల్లును పార్లమెంట్లో మూజవాణి ఓటుతో ఆమోదించడం తెలంగాణ ప్రజలను ఆవమానించడమేనని, తక్షణ బిల్లును వెనక్కి తీసుకోవాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివాసీ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉం చే వరకూ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. బంద్ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించి నగరంలో దుకాణాలు మూసివేయించారు. పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ నాయకులు రత్నం రమేశ్, కి శోర్, భాస్కర్, ఎస్.రామయ్య, శ్రావణ్, మహేశ్, వెంకటేశ్, రాకేశ్ పాల్గొన్నారు. టీజేఏసీ.. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడం కేంద్ర ప్రభుత్వ అనాగిరిక చర్య అని టీజేఏసీ జిల్లా కన్వీనర్ జే.రవీందర్, కో ఆర్డినేటర్ జక్కోజి వెంకటేశ్వర్లు అన్నారు. బంద్ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 220 గ్రామాలు, 3 లక్షల మంది గిరిజనుల బతుకులను చిన్నాభిన్నం చేసే పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు మర్రి శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయరావు, సుమిత్ర, పుష్పలత, మల్లిక, రాములునాయక్, లలిత, బన్సీలాల్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామిక చర్య: సీపీఐ పోలవరం బిల్లును పార్లమెంటులో ఆమోదించడం అప్రజాస్వామిక చర్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.నారాయణ అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిశీలనకు తీసుకోకుండా శాసనసభ అభిప్రాయాన్ని సైతం తీసుకోకుండా ఏకపక్షంగా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అనాగరిక చర్య అని అభివర్ణించారు. సీపీఐ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన బంద్ కార్యక్రమంలో నాయకులు బోయిని అశోక్, పైడిపల్లి రాజు, కూన శోభరాణి, కాల్వ నర్సయ్యయాదవ్, పంజాల శ్రీనివాస్, బి.మహేందర్, సూరి, సమ్మయ్య, సదానందం, రాయమల్లు, రమేశ్, శశి, రాకేశ్, కొమురయ్య, రాజు, రోహిత్, రాజు, మణికంఠరెడ్డి, వివేక్, సంతోష్, సీహెచ్.రాజేశం, గోపి పాల్గొన్నారు. ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో... ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎన్సీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ తేవడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీ ఆర్ఎస్ పార్టీలే కారణమని విమర్శించారు. పోలవరం అర్డినెన్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. టి.కృష్ణారెడ్డి, అజయ్, లింగయ్య, హేమలత, వేణుగోపాల్, బాబు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో... టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ ఆధ్వర్యంలో బంద్ సందర్భంగా బస్టాండ్ ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు బోడిగె గాలన్న, జంగపల్లి కుమార్, సుదగోని శ్రీనివాస్, బి.తిరుపతినాయక్, పెండ్యాల మహేశ్, ప్రిన్స్ రాజు, మాజిద్ తదితరులు పాల్గొన్నారు. దిష్టిబొమ్మకు శవయాత్ర పోలవరం బిల్లు ఆమోదించడం గిరిజన బతుకులను కాలరాయడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. బంద్ సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి టవర్‌సర్కిల్‌లో దహనం చేశారు. నాయకులు ముత్యంరావు, సత్యం, రవికుమార్, సంపత్, శేఖర్, రాజునాయక్, ఎస్.మోహన్, ఎల్లయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పోల‘రణం’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు లోక్‌సభ ఆమోదం తెలపడంపై జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. పోలవరం బిల్లును నిరసిస్తూ శనివారం టీఆర్ఎస్, టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడగా, తెలంగాణ వాదులంతా రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచాలంటూ నినదించారు. ఖేడ్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఖేడ్‌లో టీఆర్ఎస్, సీపీఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళనకు దిగడంతో బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లపైకి రాలేదు. టీఆర్ఎస్ నాయకులు ఖేడ్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్ సిబ్బందికి ముంపు మండలాల విలీనం తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు ఖేడ్‌లోని రాజీవ్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బస్‌డిపో నుంచి బైపాస్‌రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దశంకరంపేటలో టీఆర్ఎస్ నాయకులు వ్యాపార, వాణిజ్య దుకాణాలను మూసివేయించారు. సిద్దిపేటలో సంపూర్ణం ఇక సిద్దిపేటలో ఉదయం 5 గంటల నుంచే టీఆర్ఎస్, జేఏసీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదురుగా బైఠాయించారు. అనంతరం సిద్దిపేట హైస్కూల్ నుంచి ఆయా సంఘాలు ఉమ్మడిగా పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ, పోలవరం బిల్లును న్యాయ పరంగా ఎదుర్కొంటామన్నారు. ఏకపక్షంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా బిల్లును ఆమోదించడం తగదన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోనూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వాణిజ్య, వ్యాపార వర్గాలు సహకరించడంతో బంద్ ప్రశాంతంగా జరిగింది. గజ్వేల్‌లో బైక్ ర్యాలీ గజ్వేల్‌లో టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు, దీంతో మధ్యాహ్నం వరకు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అంతకుముందు టీఎస్‌యూటీఎఫ్ నేతలు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద టీఆర్ఎస్ అధ్వర్యంలో రాజీవ్హ్రదారిపై నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొండపాక మండలం దుద్దెడ వద్ద టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నర్సాపూర్‌లో పాక్షికం పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ నర్సాపూర్‌లో పాక్షికంగా జరిగింది. టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. శివ్వంపేట, కొల్చారం మండలాల్లోనూ బంద్ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపించింది. టీఆర్ఎస్కు చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణిలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం గమనార్హం. తహశీల్దారు కార్యాలయం ముట్టడి అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు గ్రూపులు వేర్వేరుగా బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే బాబూమోహన్ వర్గీయులు తహ శీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక నియోజకవర్గం పరిధిలోని జోగిపేట, పుల్కల్, టేక్మాల్ మండలాల్లో టీఆర్ఎస్ బంద్ పాటించింది. మెదక్‌లో బంద్ ప్రశాంతం మెదక్ పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. జేఏసీ నేతలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం నేతలు బస్‌డిపో ఎదుట బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆయా పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్‌లో విజయవంతం టీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ నేతలు నిర్వహించిన బంద్ జహీరాబాద్‌లో విజయవంతమైంది. బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా, వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. టీఆర్ఎస్ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, 9వ జాతీయ రహదారిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోహీర్ క్రాస్‌రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. -
మరింత జనబాహుళ్యం, వైశాల్యం మండలాలు @64
సాక్షి, రాజమండ్రి :బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టుకు ఒక ఆటంకం తొలగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు ప్రాంతాల విలీనం అంశానికి బుధవారం తెరపడింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేస్తూ ఎన్డీఏ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రాజెక్టులో ఇది ఒక కోణం అయితే..గ్రామాల విలీనంతో ఉభయగోదావరి జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో మరో నాలుగు మండలాలు కలవనున్నాయి. భౌగోళికంగా జిల్లా మరింతగా విస్తరించనుంది. విలీనం అయ్యే గ్రామాలు ముంపు ప్రాంతాలే అయినప్పటికీ ఆ ప్రజలకు జిల్లా పరిధిలోనే పునరావాసం కల్పిస్తారు. ప్రాజెక్టులో మొత్తం తొమ్మిది మండలాలు, వాటి పరిధిలోని 276 గ్రామాలు వాస్తవ అంచనాల ప్రకారం ముంపునకు గురవుతున్నాయి. వీటిలో ఖమ్మం జిల్లాలోనే ఏడు మండలాలకు చెందిన 205 గ్రామాలు ఉన్నాయి. గోదావరి తూర్పుగోదావరి, ఖమ్మం సరిహద్దు తీరంలో చింతూరు, వరరామచంద్రపురం, భద్రాచలం, కూనవరం మండలాలకు చెందిన 123 గ్రామాలు, పశ్చిమగోదావరి, ఖమ్మం సరిహద్దుల్లో కుకునూరు, బూర్గంపహాడ్, వేలేరుపాడు మండలాలకు చెందిన 82 గ్రామాలు ఉన్నాయి. వీటిలో బూర్గంపహాడ్‌లో ఐదు గ్రామాలు మినహా మిగిలిన 200 గ్రామాలను ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైనట్టేనని అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వడంతో ఈ మండలాల్లోని ముంపు ప్రాంతాలే కాక మిగిలిన గ్రామాలు కూడా ఉభయగోదావరి జిల్లాల్లో అంతర్భాగం కాబోతున్నాయి. ఈ రకంగా మొత్తం 397 గ్రామాలు రెండు జిల్లాల్లో కలవనుండగా జిల్లాలోకి 308 జనావాసాలు వచ్చి చేరుతున్నాయి. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండున ఈ గ్రామా లు లేని తెలంగాణ మాత్రమే ఆవిర్భవించనుంది. ‘తూర్పు’న మార్పు ఇలా...: ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా 10,807 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. 58 మండలాలు 1404 గ్రామాలతో, 51.51 లక్షల జనాభా కలిగి ఉంది. కొత్తగా మరో 308 గ్రామాలు విలీనం అయితే గ్రామాల సంఖ్య 1712 కానుంది. మండలాల సంఖ్య (రెండు అర్బన్ మండలాలతో కలిపి) 64కు పెరగనుండగా జనాభా అదనంగా సుమారు మరో 1.32 లక్షల మంది చేరి 52.83 లక్షలకు చేరుకోనుంది. ఇక జిల్లా వైశాల్యం మరో 2006 చదరపు కిలోమీటర్ల మేర పెరిగి 12,813 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. నిర్వాసితుల్లో 64 శాతం వరకూ గిరిజనులున్నారు. దీంతో జిల్లాలో గిరిజన ప్రాంతం, గిరిజన జనాభా కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు వల్ల 28 వేల కుటుంబాలకు చెందిన 1.20 లక్షల మంది నిర్వాసితులవుతుండగా వారిలో తూర్పులో సుమారు 3,000 కుటుంబాలకు చెందిన 12,000 మంది, పశ్చిమాన 2,200 కుటుంబాలకు చెందిన సుమారు 10,000 మంది ఉన్నారు. కాగా నిర్వాసితుల్లో 23 వేల కుటుంబాలకు చెందిన 98,000 మంది ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. కాగా వాస్తవంగా ఎన్ని గ్రామాలు ఏయే జిల్లాల్లో విలీనం అవుతాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆర్డినెన్సులోని పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
పోలవరంపై పోరుపథం
సాక్షి, రాజమండ్రి :పోలవరం ప్రాజెక్టును వివాదాల్లోకి లాగి మరోవైపు తెలంగాణలో గోదావరిపై 44 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకాలను వేగంగా నిర్మించేస్తున్నారు. వీటి ప్రభావంతో అక్టోబర్‌లో గోదావరిలో నీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. అక్టోబర్‌లో గోదావరిలో 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది. ఇందులో 70 శాతం వరకూ తెలంగాణా ఎత్తిపోతల పథకాలే వినియోగించుకుంటాయి. ఇదే జరిగితే పరిశ్రమల మురుగు తప్ప డెల్టా ప్రాంతానికి వచ్చే సాగు నీరంటూ ఉండదు. ఈ భయం రైతు సంఘాలనే కాదు ఇరిగేషన్ అధికారులను కూడా వేధిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో ఐదేళ్లలో పూర్తి కాకపోతే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించకముందు ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని ప్రకటించింది. ముంపు ప్రాంతాలను తూర్పుగోదావరిలో విలీనం చేసి ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తామని అప్పటి ప్రధాని ప్రకటించారు. బీజేపీ ఇందుకు అంగీకరించింది. నాలుగు రోజుల్లో అపాయింటెడ్ డే ముంచుకువస్తున్నా చర్యలు తీసుకోవడంలేదు. ముంపు ప్రాంతాలతో పాటు తెలంగాణ విడిపోతే పోలవరం కల్లగా మిగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యమానికి సన్నద్ధం పోలవరం సాకారం చేస్తానన్న చంద్రబాబునాయుడు తీరా ఎన్నికల్లో గెలిచాక మాట వరసకైనా ఆ విషయం మాట్లాడడంలేదు. ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌పై అధికార బీజేపీ పెదవి విప్పడంలేదు. ఈ తరుణంలో సీమాంధ్ర రైతులు తమకు పొంచి ఉన్న ముప్పుపై పోరాటానికి సిద్ధం అవుతున్నారు. వీరికి ఉభయగోదావరి జిల్లాల రైతు సంఘాలు, ఇరిగేషన్ అధికారుల సంయుక్త కార్యాచరణ కమిటీ మద్దతు పలుకుతున్నాయి. ధవళేశ్వరం నుంచి రాజమండ్రి సబ్‌కలెక్టర్ ఆఫీసు వరకూ మంగళవారం రైతు సంఘాలు, ఇంజనీర్లు, రైతులు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించాలని, ఖమ్మం జిల్లాలోని 205 ముంపు గ్రామాలను తూర్పుగోదావరిలో విలీనం చేయాలని ఆర్డీఓ నాన్రాజుకు వినతిపత్రం అందచేశారు. ఆర్డినెన్స్ రాకపోతే... పోలవరం వల్ల ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 950 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుంది. గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా సాధ్యమవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం జరగకపోతే ఎగువ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న లిఫ్టులు వ్యవసాయ సీజన్లో 72 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటాయి. ఫలితంగా ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం బాగా తగ్గిపోతుంది. వరదల సమయంలో తప్ప మిగిలిన కాలంలో కేవలం 20 అడుగుల దిగువన ఉన్న సముద్రపు ఉప్పునీరు క్రమేపీ పైకి ఎగదన్నుతుంది. నాలుగు లక్షల ఎకరాలు ఉప్పు భూములుగా మారిపోతాయి. ఈ పరిణామం మొదలంటూ అయితే ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మించినా ఫలితం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విభజన జరిగితే విలీనం కష్టం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే టీఆర్ఎస్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో కుమ్మక్కై ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రాజెక్టును ఆ పార్టీ ప్రభుత్వం అడ్డుకుని తీరుతుంది. అందువల్ల అపాయింటెడ్ డే లోగానే ముంపు గ్రామాల విలీనంపై ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి నాయకుడు ఎంవీ సూర్యనారాయణ రాజు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోలవరం పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి, ఉభయగోదావరి జిల్లాల్లోని నీటి సంఘాల అధ్యక్షులతో పాటు, ఇరిగేషన్ ఇంజనీర్ల జేఏసీ ఉమ్మడిగా ఉద్యమ కార్యాచరణకు దిగామని సత్యనారాయణరాజు వెల్లడించారు. -
పోలవరంపై పట్టువిడవద్దు: హరిబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కట్టుబడుతూనే సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి పార్టీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత బీజేపీ నేతలు నిర్ణయించారు. పార్టీ పదాధికారుల సమావేశం మంగళవారం గుంటూరులో జరి గింది. కె.హరిబాబు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇటీవలి తమ ఢిల్లీ పర్యటన వివరాలను, పార్టీ కేంద్రనాయకులు చెప్పిన విషయాలను వివరించారు. సీమాంధ్రుల సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే బిల్లుకు మద్దతు ఇచ్చేలా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాలని సమావేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు తొలిప్రాధాన్యం ఇవ్వకపోతే భావితరాలు నష్టపోయే ప్రమాదం ఉందని, అందువల్ల చట్టపరమైన రక్షణ కల్పిం చేలా బిల్లులోనే ప్రతిపాదనలు ఉండేలా చూడాలని నిర్ణయానికొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు రాకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నింటినీ ఆంధ్రాలోనే కల పాలని.. నీటివనరుల పంపిణీ పర్యవేక్షణకు ఒక సంఘాన్ని నియమించాలంటూ పార్టీ నాయకత్వాన్ని కోరాలని నిర్ణయించారు. మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయానికొచ్చారు. పార్టీ జాతీయ నేతలను కలిసేందుకు హరి బాబును బుధవారం ఢిల్లీకి పంపాలని సమావేశం తీర్మానించింది. సీనియర్ నేత బి.రంగమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నేతలు, సోము వీర్రాజు, శాంతారెడ్డి, సురేష్‌రెడ్డి, జె.శ్యాంకిషోర్, వై.రఘునాధ్‌బాబు, శ్రీని వాసరాజుతో పాటు 13జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో ప్రొఫెసర్ శేషగిరిరావు పోలవరం ప్రాజెక్టు అవశ్యకతను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని సమావేశానికి ఆహ్వానించలేదు.