పోలవరంపై పోరుపథం
సాక్షి, రాజమండ్రి :పోలవరం ప్రాజెక్టును వివాదాల్లోకి లాగి మరోవైపు తెలంగాణలో గోదావరిపై 44 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకాలను వేగంగా నిర్మించేస్తున్నారు. వీటి ప్రభావంతో అక్టోబర్‌లో గోదావరిలో నీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. అక్టోబర్‌లో గోదావరిలో 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది. ఇందులో 70 శాతం వరకూ తెలంగాణా ఎత్తిపోతల పథకాలే వినియోగించుకుంటాయి. ఇదే జరిగితే పరిశ్రమల మురుగు తప్ప డెల్టా ప్రాంతానికి వచ్చే సాగు నీరంటూ ఉండదు. ఈ భయం రైతు సంఘాలనే కాదు ఇరిగేషన్ అధికారులను కూడా వేధిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో ఐదేళ్లలో పూర్తి కాకపోతే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించకముందు ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని ప్రకటించింది. ముంపు ప్రాంతాలను తూర్పుగోదావరిలో విలీనం చేసి ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తామని అప్పటి ప్రధాని ప్రకటించారు. బీజేపీ ఇందుకు అంగీకరించింది. నాలుగు రోజుల్లో అపాయింటెడ్ డే ముంచుకువస్తున్నా చర్యలు తీసుకోవడంలేదు. ముంపు ప్రాంతాలతో పాటు తెలంగాణ విడిపోతే పోలవరం కల్లగా మిగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉద్యమానికి సన్నద్ధం
పోలవరం సాకారం చేస్తానన్న చంద్రబాబునాయుడు తీరా ఎన్నికల్లో గెలిచాక మాట వరసకైనా ఆ విషయం మాట్లాడడంలేదు. ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌పై అధికార బీజేపీ పెదవి విప్పడంలేదు. ఈ తరుణంలో సీమాంధ్ర రైతులు తమకు పొంచి ఉన్న ముప్పుపై పోరాటానికి సిద్ధం అవుతున్నారు. వీరికి ఉభయగోదావరి జిల్లాల రైతు సంఘాలు, ఇరిగేషన్ అధికారుల సంయుక్త కార్యాచరణ కమిటీ మద్దతు పలుకుతున్నాయి. ధవళేశ్వరం నుంచి రాజమండ్రి సబ్‌కలెక్టర్ ఆఫీసు వరకూ మంగళవారం రైతు సంఘాలు, ఇంజనీర్లు, రైతులు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించాలని, ఖమ్మం జిల్లాలోని 205 ముంపు గ్రామాలను తూర్పుగోదావరిలో విలీనం చేయాలని ఆర్డీఓ నాన్‌రాజుకు వినతిపత్రం అందచేశారు.
ఆర్డినెన్స్ రాకపోతే...
పోలవరం వల్ల ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 950 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుంది. గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా సాధ్యమవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం జరగకపోతే ఎగువ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న లిఫ్టులు వ్యవసాయ సీజన్‌లో 72 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటాయి. ఫలితంగా ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం బాగా తగ్గిపోతుంది. వరదల సమయంలో తప్ప మిగిలిన కాలంలో కేవలం 20 అడుగుల దిగువన ఉన్న సముద్రపు ఉప్పునీరు క్రమేపీ పైకి ఎగదన్నుతుంది. నాలుగు లక్షల ఎకరాలు ఉప్పు భూములుగా మారిపోతాయి. ఈ పరిణామం మొదలంటూ అయితే ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మించినా ఫలితం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విభజన జరిగితే విలీనం కష్టం
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే టీఆర్‌ఎస్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో కుమ్మక్కై ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రాజెక్టును ఆ పార్టీ ప్రభుత్వం అడ్డుకుని తీరుతుంది. అందువల్ల అపాయింటెడ్ డే లోగానే ముంపు గ్రామాల విలీనంపై ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి నాయకుడు ఎంవీ సూర్యనారాయణ రాజు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోలవరం పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి, ఉభయగోదావరి జిల్లాల్లోని నీటి సంఘాల అధ్యక్షులతో పాటు, ఇరిగేషన్ ఇంజనీర్ల జేఏసీ ఉమ్మడిగా ఉద్యమ కార్యాచరణకు దిగామని సత్యనారాయణరాజు వెల్లడించారు.