పోల‘రణం’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు లోక్‌సభ ఆమోదం తెలపడంపై జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. పోలవరం బిల్లును నిరసిస్తూ శనివారం టీఆర్‌ఎస్, టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడగా, తెలంగాణ వాదులంతా రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచాలంటూ నినదించారు.
ఖేడ్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఖేడ్‌లో టీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళనకు దిగడంతో బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లపైకి రాలేదు. టీఆర్‌ఎస్ నాయకులు ఖేడ్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్ సిబ్బందికి ముంపు మండలాల విలీనం తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు ఖేడ్‌లోని రాజీవ్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బస్‌డిపో నుంచి బైపాస్‌రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దశంకరంపేటలో టీఆర్‌ఎస్ నాయకులు వ్యాపార, వాణిజ్య దుకాణాలను మూసివేయించారు.
సిద్దిపేటలో సంపూర్ణం
ఇక సిద్దిపేటలో ఉదయం 5 గంటల నుంచే టీఆర్‌ఎస్, జేఏసీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదురుగా బైఠాయించారు. అనంతరం సిద్దిపేట హైస్కూల్ నుంచి ఆయా సంఘాలు ఉమ్మడిగా పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ, పోలవరం బిల్లును న్యాయ పరంగా ఎదుర్కొంటామన్నారు. ఏకపక్షంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా బిల్లును ఆమోదించడం తగదన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోనూ టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వాణిజ్య, వ్యాపార వర్గాలు సహకరించడంతో బంద్ ప్రశాంతంగా జరిగింది.
గజ్వేల్‌లో బైక్ ర్యాలీ
గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు, దీంతో మధ్యాహ్నం వరకు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అంతకుముందు టీఎస్‌యూటీఎఫ్ నేతలు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద టీఆర్‌ఎస్ అధ్వర్యంలో రాజీవ్హ్రదారిపై నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొండపాక మండలం దుద్దెడ వద్ద టీఆర్‌ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నర్సాపూర్‌లో పాక్షికం
పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ నర్సాపూర్‌లో పాక్షికంగా జరిగింది. టీఆర్‌ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. శివ్వంపేట, కొల్చారం మండలాల్లోనూ బంద్ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపించింది. టీఆర్‌ఎస్‌కు చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం గమనార్హం.
తహశీల్దారు కార్యాలయం ముట్టడి
అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెండు గ్రూపులు వేర్వేరుగా బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే బాబూమోహన్ వర్గీయులు తహ శీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక నియోజకవర్గం పరిధిలోని జోగిపేట, పుల్కల్, టేక్మాల్ మండలాల్లో టీఆర్‌ఎస్ బంద్ పాటించింది.
మెదక్‌లో బంద్ ప్రశాంతం
మెదక్ పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. జేఏసీ నేతలు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం నేతలు బస్‌డిపో ఎదుట బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆయా పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
జహీరాబాద్‌లో విజయవంతం
టీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్‌ఎస్ నేతలు నిర్వహించిన బంద్ జహీరాబాద్‌లో విజయవంతమైంది. బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా, వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. టీఆర్‌ఎస్ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, 9వ జాతీయ రహదారిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోహీర్ క్రాస్‌రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్ నాయకులు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.